ఎవడబ్బ సొమ్మని..!
అమాత్యుల ప్రొటోకాల్ ఖర్చుల కోసం అధికారుల అడ్డదారులు
లంచం డబ్బుతో మంత్రులకు ఏర్పాట్లు !
ఏసీబీకి పట్టుబడ్డ ఐసీడీఎస్ ఉద్యోగిని వెల్లడి
ప్రభుత్వం నుంచి చాలీచాలని నిధులు
చర్చనీయాంశమైన ప్రొటోకాల్ నీతి!
ఆనాడు రామదాసు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో శ్రీరామచంద్రుడికి గుడి కట్టించి తన స్వామి భక్తిని చాటుకున్నాడు.. ఆనక చెరసాల పాలయ్యాడు. ఇప్పుడు మన అధికారులు అమాత్యులపై తమ స్వామిభక్తిని చాటుకుంటున్నారు. ప్రొటోకాల్ ఖర్చుల పేరుతో మంత్రివర్యుల విందు విలాసాలకు, స్టార్ హోటల్ సౌకర్యాలకు, వారి మందీమార్బలం కోసం అవసరమైనంతా ఖర్చు చేస్తున్నారు. దీనికోసం లంచాలకు తెరతీస్తున్నారు. చివరికి జైలుపాలవుతున్నారు. తాజాగా విజయవాడలో ఏసీబీకి చిక్కిన ఐసీడీఎస్ ఉద్యోగిని ఉదంతంతో ఈ విషయం బాహాటమైంది.
సాక్షి ప్రతినిధి, విజయవాడ : జిల్లాలో ముగ్గురు రాష్ట్ర మంత్రులు ఉన్నారు. పక్క జిల్లా గుంటూరులో మరో ఇద్దరున్నారు. వీరుగాక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నిత్యం విజయవాడ, రాజధాని ప్రాంతంలోనే పర్యటిస్తున్నారు. అంటే ఆరుగురు మంత్రులు వారంలో నాలుగు రోజులు విజయవాడలోనే ఉంటున్నారు. ఐదుగురు మంత్రులకు హోటళ్లలో గదులు బుక్ చేస్తున్నారు. స్టార్ హోటళ్లు కావడంతో బిల్లులు కట్టలేక ఆయా శాఖల వారు నానా అవస్థలు పడుతున్నారు.
అన్ని హంగులూ ఉండాల్సిందే...
ఎక్సైజ్ శాఖ మంత్రి విజయవాడ వచ్చారంటే అన్ని హంగులూ ఉండాల్సిందే. గెస్ట్‌హౌస్‌లో తగిన సౌకర్యాలు ఉండటం లేదని చాలా సార్లు హోటల్‌లో గదులు బుక్ చేస్తున్నారు. సాధారణంగా డబ్బు సంపాదించే శాఖ కావడం, మద్యం వ్యాపారులు నిత్యం మంత్రితో టచ్‌లో ఉండటంతో ఖర్చులకు వెనకాడటం లేదు. పైగా నగరంలో మద్యం సిండికేట్ వారు ఎంత పెంచుకోవాలంటే అంత పెంచి అమ్మకాలు చేసుకునే సౌకర్యం ఎక్సైజ్ శాఖ కల్పించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు కూడా నిత్యం ఇక్కడే ఉంటుంటారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కార్యాలయం ఏర్పాటుచేసినా అది పేరుకు మాత్రమేనని చెప్పవచ్చు.
సమావేశాల ఖర్చులన్నీ అధికారుల పైనే...
ఇక జల వనరుల శాఖ మంత్రి కూడా గెస్ట్‌హౌస్‌లో ఉంటుంటారు. ఇరిగేషన్ కార్యాలయంలో పలుమార్లు సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఖర్చులన్నీ ఇరిగేషన్ శాఖ పైనే పడుతున్నాయి. ఈ మంత్రి ప్రొటోకాల్‌కే నెలకు కనీసంగా ఆరు లక్షల రూపాయలకు పైగా ఖర్చవుతున్నట్లు ఆ శాఖ ఉద్యోగులు కొందరు తెలిపారు. రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు ప్రకాశం జిల్లా నుంచి వారంలో ఒకసారి తప్పకుండా వస్తుంటారు.
ఆయన ప్రొటోకాల్ బిల్లు కూడా తడిసి మోపెడవుతోందని అధికారులు చెబుతున్నారు. వాణిజ్య పన్నుల శాఖ మంత్రి, రెవెన్యూ మంత్రి వచ్చినప్పుడు ఇక చెప్పేదేముంది వారి హంగామానే వేరు. ఆ శాఖల్లో తీసుకునే పై ఫీజుల నుంచే ప్రొటోకాల్‌కు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో మంత్రికి కనీసంగా నెలకు రెండు లక్షలు ప్రొటోకాల్ ఖర్చులు అవుతున్నట్లు అధికారుల సమాచారం.
ప్రభుత్వం ఇచ్చేది నామినల్...
ప్రొటోకాల్ ఖర్చుల కోసం ప్రభుత్వం నామినల్‌గా ఇస్తుంది. వాహనాల ఖర్చు, మంత్రి, గన్‌మెన్‌ల భోజనం ఖర్చులు మాత్రమే ప్రభుత్వం భరిస్తుంది. మరి వారు వచ్చినప్పుడు గేట్‌వే హోటల్‌లో సమావేశం పెట్టారంటే కనీసంగానైనా లక్ష రూపాయల బిల్లు చెల్లించాల్సిందే. మంత్రితో పాటు వచ్చే మందీమార్బలానికి కూడా సంబంధిత శాఖ వారే ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది. ఇటీవల జిల్లా కలెక్టర్‌కు రూ.8 లక్షల ప్రొటోకాల్ సొమ్ము వచ్చింది.
కానీ బిల్లులు పెడితే అవి ఏ మూలకూ సరిపోవని ఒక ఉన్నతాధికారి తెలిపారు. విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయం, గుడివాడ, నూజివీడు డివిజన్‌లకూ ప్రొటోకాల్ సొమ్ము ఇస్తారు. ఒక్క విజయవాడకే ఎక్కువ సొమ్ము కేటాయిస్తారు. ఇవి కాకుండా గన్నవరం తహశీల్దార్‌కు ప్రత్యేకంగా ప్రొటోకాల్ డ్యూటీ ఉంటుంది. అదీ నెలకు రూ.50 వేలకు మించడం లేదు. అక్కడ అయ్యే ఖర్చులు మాత్రం నెలకు కనీసంగానైనా రూ.3 లక్షల వరకు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. విమానాశ్రయం ఉండటంతో నిత్యం మంత్రులే కాకుండా ఉన్నతాధికారులు, కేంద్ర మంత్రులు, అధికారులు వస్తుంటారు. వారి ఖర్చంతా తహశీల్దార్ కార్యాలయం భరించాల్సి ఉంటుంది.
మామూళ్లకు తెరతీసిన శాఖలు
ప్రొటోకాల్ ఖర్చుల పేరుతో పలు శాఖలు దండుకునే కార్యక్రమాన్ని చేపట్టాయి. కొన్ని శాఖల వారు ఏకంగా మంత్రుల పేర్లు చెప్పి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. వీరు ప్రత్యేకించి డబ్బులు అడగకుండా నెల కాగానే వారే పువ్వుల్లో పెట్టి ఇవ్వాలి. లేకుంటే తగిన విధంగా అధికారులు స్పందిస్తారు. సీఎం సభలు, పర్యటన ఖర్చులు మినహా ఇతర ప్రొటోకాల్ ఖర్చుల వ్యవహారం ఆయా శాఖల వారే చూడటంతో పరిస్థితి దారుణంగా ఉంది. సాధారణంగా ప్రొటోకాల్ ఖర్చులు రెవెన్యూ వారు చూడాలి.
అయితే పలు శాఖల మంత్రులు నిత్యం వస్తుండటంతో రెవెన్యూ వారు చేతులెత్తేశారు. దాంతో ఆయా శాఖల వారే స్టార్ హోటళ్లలో రూముల నుంచి వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లూ చూస్తున్నారు. పది నెలల క్రితం విజయవాడ గేట్‌వేలో సీఎం ఏర్పాటు చేసిన కలెక్టర్‌ల సమావేశం సొమ్ము వారం రోజుల క్రితం వచ్చింది. ఇలా నెలల తరబడి ఆగే పరిస్థితుల్లో వ్యాపారులు లేరు. దీంతో ఆయా శాఖల వారికి వడ్డన తప్పడం లేదు. ప్రొటోకాల్ రాష్ట్ర కార్యాలయం కూడా హైదరాబాద్‌లోనే ఉంది. నూతన రాజధానికి వస్తే కొంతవరకు సమస్య తీరుతుంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉంది.