చక్కగా ఉతికి, ఆరుబయట దండెంపై ఆరేసిన దుస్తులు.. అకాలవర్షంతో తడిసిపోతేనే ‘అరెరే.. అయ్యయ్యో’ అనిపిస్తుంది. అలాంటిది.. నాటిన నాటి నుంచి కంటికి రెప్పలా కాచి, పెంచిన పైరు నీట మునిగిపోయిన వేళ ఆ రైతు గుండె ఎంత గుబగుబలాడుతుంది! చక్కగా అలికి, ముగ్గులేసిన వాకిలిని పశువులు తొక్కితేనే మనసు చివుక్కుమంటుంది. అలాంటిది.. నీడనిచ్చే గుడిసో, గూడో గాలివానకు కుప్పకూలితే ఆ ఇంటి వారు ఎంత వ్యథ చెందుతారు! అల్పపీడనం, ఈశాన్య రుతుపవనాలు జిల్లాలో పంటలకు, నివాసాలకు పెద్ద నష్టాన్నే కలిగించాయి. జిల్లాలో నెలకొన్న పరిస్థితిని చూస్తే.. అధికారులు చెపుతున్న దాని కన్నా అధికంగానే నష్టం జరిగిందని చెప్పవచ్చు.
అమలాపురం, న్యూస్‌లైన్ :
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఈశాన్య రుతుపవనాలు జిల్లావాసులను మరోసారి కష్టాల సుడిగుండంలోకి నెట్టాయి. అన్నదాత ఆశలను చిదిమేస్తూ, నిరుపేదలకు నిలువనీడ లేకుండా చేస్తున్నాయి. నాలుగురోజులుగా పడుతున్న వర్షాలు శుక్రవారం కాస్త తెరిపి ఇచ్చినా.. మధ్యమధ్య వాన పడుతూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు మడుగులుగా మారగా చేలు ముంపులోనే ఉన్నాయి. కడియం మండలం మాధవరాయుడుపాలెంలో యలమశెట్టి పెద్దినాయుడు (55) గురువారం రాత్రి పిడుగుపాటుకు మరణించాడు. ఆలమూరు మండ లం సంధిపూడికి చెందిన గుత్తుల తాళ్లమ్మ (78) ఇంటి గోడ కూలిపోవడం చూసి గుండెపోటుతో మరణించింది. పెద్దాపురం మండలం కట్టమూరుకు చెందిన యాళ్ల సంతోష్ (19) శుక్రవారం కాలువలో గల్లంతయ్యాడు. కాట్రేనికోన మండ లం గెద్దనాపల్లి శివారు పోరపేటలో పాక కూలి నెల్లి నీలయ్య (67) అక్కడికక్కడే మరణించాడు.
అర్ధరాత్రి నుంచి భారీ వర్షం
గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు జిల్లాలో భారీ వర్షం నమోదైంది. గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల వరకు జిల్లాలో 59.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ప్రత్తిపాడు మండలంలో అత్యధికంగా 260.2 మి.మీ. వర్షం నమోదయింది. శుక్రవారం ఉదయం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. తునిలో మాత్రం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కుంభవృష్టి కురిసి పట్టణం జలదిగ్బంధమైంది. పంపాలో నీటి మట్టం 103.5 అడుగులకు చేరడంతో మూడు గేట్లు ఎత్తి 2,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.
కాకినాడలో 800 మందికి పునరావాసం
గడిచిన ఐదు రోజులుగా ముసురు, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో కాకినాడ, రాజ మండ్రి, అమలాపురం, తుని, పెద్దాపురంతో పా టు ఇతర చోట్ల లోతట్టు ప్రాంతాల్లోని కాలనీ లు ముంపుబారిన పడ్డాయి. కాకినాడలో వరుసగా రెండవ రోజు భారీ వర్షం కురవడంతో మ రికొ న్ని కాలనీలు ముంపులో చిక్కుకున్నాయి. మూ డుచోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అయోధ్యనగర్, గొడారిగుంట, ట్రెజరీ కాలనీల్లో జలదిగ్బంధంలో చిక్కుకున్న 800 మంది బాధితులకు అధికారులు భోజన, తాగునీటి వసతి కల్పించారు. పుష్కరకాలువకు ఐదు చోట్ల, పిఠాపురం బ్రాంచ్ కెనాల్‌కు రెండు చోట్ల గండ్లు పడడంతో 150 ఎకరాల్లో పత్తి, మూడువేల ఎకరాల్లో వరి చేలు నీట మునిగాయి. జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది.
పంట నష్టం పరిశీలన
జిల్లాలో భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వ్యవసాయ శాఖాధికారులు పర్యటించి నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. జేడీఏ ఎన్.విజయకుమార్, మార్టేరు వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు పి.వి.రమణారావు, కె.వసంతభాను, వి.భువనేశ్వరి అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం, రాజోలు మండలాల్లో పర్యటించారు. ముంపు త గ్గాక పంట నష్టంపై వాస్తవికమైన అంచనాకు రాగలమని జేడీ తెలిపారు.
తూర్పుడెల్టాలో అధిక నష్టం
తూర్పుడెల్టా పరిధిలోలో ఆలమూరు, అనపర్తి, రామచంద్రపురం, కాకినాడ సబ్ డివిజన్‌ల పరిధిలో వరిచేలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ముందుగా సాగు చేసిన ఇక్కడ చేలు కోతలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సమయంలో వర్షం బారిన పడడంతో నష్టం ఎక్కువ గా ఉంటుందని రైతులు చెబుతున్నారు. మోటారు ఇంజన్లు ఏర్పా టు చేసి ముంపునీరు బయటకు తోడుతున్నా మళ్లీమళ్లీ వాన పడుతూనే ఉండడంతో రైతులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. మధ్యడెల్టాలో చేలు ఇంకా పాలుపోసుకుంటున్న దశలో ఉండడం వల్ల ముంపు ఉన్నా చేలు పడిపోవడం తక్కువ. అయితే ఉప్పలగుప్తం, మలికిపురం వంటి తీర ప్రాంతాల్లో ముంపువీడే అవకాశం తక్కువగా ఉండి నష్టం పెరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వర్షాలకు గత నాలు గు రోజులుగా ముంపులో ఉండడం, మరో మూ డు, నాలుగు రోజులు ముంపు వీడే అవకాశం లేకపోవడంతో ఎకరాకు ఐదు నుంచి పది బస్తాల దిగుబడి తగ్గి, రైతులు రూ.ఆరు వేల విలువ చేసే పంటను కోల్పోయే ప్రమాదమేర్పడింది. దీనిని బట్టి చూస్తే జిల్లాలో ఒక్క వరికే రూ.90 కోట్ల నష్టం వాటిల్లింది. జిల్లాలో 18 వేల ఎకరాలకు పై గా పత్తి పంట నీట మునగడంతో ఎకరాకు రెండు క్వింటాళ్ల చొప్పున దిగుబడి కోల్పోయే అవకాశ ముంది. పత్తితోపాటు కూరగాయ, వాణిజ్య పం టలకు సైతం సుమారు రూ.10 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం భారీ వర్షాలు జిల్లాలో రూ.100 కోట్ల పంట నష్టానికి కారణమయ్యాయి.
1.5 లక్షల ఎకరాల్లో నీట మునిగిన వరి
Published Sat, Oct 26 2013 3:46 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement