గాడ్సేను పొగిడే స్థాయికి దిగజారిన కేంద్రం
► కార్పొరేట్లకు ధారాదత్తానికే 10 లక్షల ఎకరాల భూమి
► పారిశ్రామిక వేత్తలకు భజన చేస్తున్న మోదీ, బాబు
► సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు నారాయణ
తిరుపతి కల్చరల్ : ఒక వైపు జాతిపిత గాంధీని ప్రశంసిస్తూనే మరో వైపు ఆయన్ను హత్య చేసిన గాడ్సేను పొగిడే స్థాయికి కేంద్ర ప్రభుత్వం దిగజారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు కె.నారాయణ ధ్వజమెత్తారు. తిరుపతిలోని గంధమనేని శివయ్య భవన్‌లో జరుగుతున్న జాతీయ సీపీఐ రాజకీయ శిక్షణ తరగతుల్లో రెండవరోజు శనివారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని పాండిచ్చేరిలో జరిగిన జాతీయ మహాసభల్లో తీసుకున్న నిర్ణయాలు, కార్యక్రమాలను వివరించారు. మత ఘర్షణల నేపథ్యంలో కొన్ని బిల్లులు ఆమోదించుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోందని, దీనిని అడ్డుకునేందుకు సీపీఐ ఆధ్వర్యంలో ఉధృతమైన పోరాటాలు సాగించాలన్నారు.
మోదీ, చంద్రబాబు ఇద్దరూ కార్పొరేట్ కంపెనీలకు భజన చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలు సేకరించి పారిశ్రామిక వేత్తల చేతుల్లో పెట్టాలని ముఖ్యమంత్రి ప్రాకులాడడం శోచనీయమన్నారు. మే 14న భూ సేకరణ బిల్లుపై జైల్‌భరో కార్యక్రమాన్ని చేపడతామని ఆయన తెలిపారు. జిల్లా కార్యదర్శి ఎ.రామానాయుడు పాల్గొన్నారు. అలాగే శేషాచల ఎన్‌కౌంటర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ముద్దాయని కె. నారాయణ ఆరోపించారు. తిరుపతిలో శనివారం ఆయన జాతీయ ఎస్టీ కమిషన్ వైస్ చైర్మన్ రవిఠాకూర్‌ను కలసి శేషాచల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వినతిపత్రం సమర్పించారు.