ప్రారంభమైన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
హైదరాబాద్: తెలంగాణలో ఎస్ఎస్సీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 1, 41,601 మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శేషుకుమారి తెలిపారు. వీరి కోసం 599 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థుల హాల్ టికెట్ పై సంబంధిత ప్రధానోపాధ్యాయుడి సంతకం చేయించుకుని పరీక్షకు వెళ్లాలని పేర్కొన్నారు. కొత్త సిలబస్ లో ద్వితీయభాషకు అదనంగా 30 నిమిషాల సమయం ఇస్తున్నామని వెల్లడించారు. పాత, కొత్త సిలబస్ వారికి ఆబ్జెక్టివ్ పేపరు వేరుగా ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని పరీక్షా కేంద్రాలకు 500 ల గజాల పరిధిలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. జూలై 2 వ తేదీ పరీక్షలు ముగిసే వరకు ఈ నిబంధన అమలులో ఉంటుంది. సెంటర్ల సమీపంలో గుంపులుగా ఉండరాదని, ఎవరైనా 144 సెక్షన్ అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోనూ నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్టు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్టు అధికారులు తెలిపారు. ఈ పరీక్షలకు 73,395 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 374 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెలిపారు.