
రైల్వేకోడూరు/గుంతకల్లు/రొంపిచర్ల: రాష్ట్ర రహదారులు ఆదివారం రక్తమోడాయి. వైఎస్సార్, గుంటూరు జిల్లాల్లో జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతి చెందారు. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన సినిమా డిస్ట్రిబ్యూటర్ శివప్రసాద్(60) పెద్ద అమ్మాయి ఉషారాణి వివాహం సోమవారం ఉదయం తిరుపతిలో జరగాల్సి ఉంది. తొమ్మిది మంది బంధువులతో కలసి శివప్రసాద్ తుఫాన్ వాహనంలో తిరుపతికి బయల్దేరారు. వైఎస్సార్ జిల్లా పుల్లంపేట మండలం ప్రకాశ్‌నగర్‌కు చేరుకునేసరికి.. ఎదురుగా వేగంగా దూసుకువచ్చిన లారీ వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివప్రసాద్‌తో పాటు ఏడుగురు మృతి చెందారు.
కాగా, గుంటూరు జిల్లా నకరికల్లు మండలం చీమలమర్రికి చెందిన దొంతుల ఆంజనేయులు(35), తిరుపతమ్మ (30) దంపతులకు అంజలి (12), కోటేశ్వరి (10) అనే ఇద్దరు కుమార్తెలున్నారు. వేసవి సెలవులు ఇవ్వడంతో వీరిని అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లేందుకు ఆంజనేయులు, తిరుపతమ్మ బైక్‌పై ప్రకాశం జిల్లా వేంపాడుకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం మర్రిచెట్టుపాలెం వద్దకు రాగానే ఓ లారీ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. దీంతో బైక్ అదుపుతప్పి పక్కనే వెళుతున్న మరో లారీ కిందకు దూసుకెళ్లింది. వీరి మీదగా ఆ లారీ దూసుకెళ్లడంతో నలుగురూ అక్కడికక్కడే మృతిచెందారు.
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప, గుంటూరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతి చెందారని తెలుసుకున్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment