రక్తదాహం వేసిన రహదారి మరోసారి తన వికృతరూపం ప్రదర్శించింది. వేకువజామున మృత్యువు వెంటాడి ముగ్గురి జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. మరో ఇద్దరిని గాయపర్చింది. నాగరికతకు చిహ్నాలుగా చెప్పుకునే రహదారులు ప్రతి రోజూ ఇటు మృతులు, క్షతగాత్రుల రక్తం... అటు బాధితుల కన్నీటితో తడిసి ముద్దవుతున్నాయి. కళ్లెదుటే ఇంత ఘోరకలి జరుగుతున్నా, వాటిని నియంత్రించాలన్న ఆలోచన అధికారులలో ఉన్నట్లు కన్పించడం లేదు.
పోరుమామిళ్ల, న్యూస్‌లైన్: పోరుమామిళ్ల మండలం నాగలకుంట్ల బస్టాప్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 3.15 గంటలకు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇదే ప్రమాదంలో మరో ఇద్దరు స్వల్ప గాయాలతో ప్రణాపాయం నుంచి తప్పించుకున్నారు. మృతులిద్దరూ లారీ డ్రైవర్లే కాగా, మరొకరు క్లీనర్.
ప్రమాదమెలా జరిగిందంటే..
గుంటూరు జిల్లా మాచర్ల నుంచి సిమెంట్ లోడుతో ఓ లారీ మైదుకూరుకు బయలుదేరింది. మరో లారీ ఎర్రగుంట్ల నుంచి సిమెంట్ లోడుతో గుంటూరుకు బయలుదేరింది. రెండు లారీలు మార్గమధ్యంలోని నాగలకుంట్ల వద్దకు రాగానే ఢీకొన్నాయి. సంఘటనలో రెండు లారీల డ్రైవర్లు శ్రీను(45), బత్తుల లక్ష్మీనరసయ్య(43), క్లీనర్ ఆంజనేయులు(25) అక్కడికక్కడే మరణించారు. శ్రీనివాసులు, మరో ప్రయాణికుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా ఘటనలో రెండు లారీలు తుక్కుతుక్కయ్యాయి. దీంతో మృతదేహాలు లారీ క్యాబిన్లలోనే ఇరుక్కుపోయాయి. మృతుల్లోని మాచర్ల లారీ డ్రైవర్ శ్రీను, క్లీనర్ ఆంజనేయులు మామా అల్లుళ్లు అని తెలిసింది. గాయపడ్డ శ్రీనివాసులు క్లీనర్ లక్ష్మీనరసయ్యకు కుమారుడు అవుతాడని సమాచారం. వీరి స్వస్థలం సిద్దవటం.
నిద్ర ముంచుకు రావడంతోనే..
మాచర్ల నుంచి వచ్చిన లారీని చూసి ఎర్రగుంట్ల నుంచి వచ్చిన లారీని డ్రైవర్ సైడ్ ఇచ్చినా ప్రమాదం జరిగిందని అక్కడి పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. దీనికి కారణంగా మాచర్ల లారీ డ్రైవర్ కంభంపాడుకు చెందిన శ్రీనుకు నిద్ర ముంచుకు రాగా ఆయన లారీని నియంత్రించలేకపోవడంతో ఘోర సంఘటన జరిగిందని భావిస్తున్నారు.
రంగంలోకి దిగిన యంత్రాంగం
లారీలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు ఫోన్‌లో ఇచ్చిన సమాచారంతో పోరుమామిళ్ల అగ్నిమాపక అధికారి విజయకుమార్, వారి సిబ్బంది, సీఐ వెంకటకుమార్, పోలీస్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. రెండు లారీలు బాగా దెబ్బతినడంతో క్యాబిన్లలోనే మృతదేహాలు నలిగిపోయి ఉన్నాయి. స్థానికుల సహకారంతో పైన పేర్కొన్న రెండు శాఖల అధికారులు వాటిని వెలికితీశారు. వాటిని పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పరిసర గ్రామాల నుంచి వందలాది మంది అక్కడికి రావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది.
ప్రమాదం కసిరి.. ఉసురు ఆగి
Published Wed, Sep 25 2013 3:19 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement