రాష్ట్ర విభజన నేపథ్యంలో విజయనగరం పట్టణంలో చోటు చేసుకున్న ఆస్తుల విధ్వంసం, పోలీసులపై రాళ్ల దాడుల కేసులో ఇప్పటివరకు 110 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ కార్తికేయ మంగళవారం విజయనగరంలో వెల్లడించారు. ఆ దాడుల్లో మరికొంత మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని తెలిపారు.
ఆ దాడులకు పాల్పడిన అల్లరిముకలను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఆ బృందాలు తమ విచారణను ముమ్మరం చేశాయని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా అల్లరిముకలను అరెస్ట్ చేస్తామని కార్తికేయ ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజనకు నిరసనగా పీసీసీ అధ్యక్షుడు, రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన జోడు పదవులకు రాజీనామా చేయకపోవడంతో ఆయన సొంత జిల్లా అయిన విజయనగరంలో జిల్లావాసుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఆ నేపథ్యంలో బొత్సకు చెందిన ఆస్తులపై దాడికి తెగబడ్డారు.
అందులోభాగంగా బొత్స బంధువులను కూడా వదలలేదు. ఆ క్రమంలో విజయనగరం పట్టణం అటుడికింది. పరిస్థితి చేయి దాటుందని భావించిన ప్రభుత్వం ప్రత్యేక పోలీసు బలగాలను విజయనగరానికి హుటాహుటిన తరలించింది. దాంతో ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించి నిరవధిక కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే.