- జిల్లాలో 161 కేంద్రాలు
- హాజరుకానున్న 25వేల 39మంది విద్యార్థులు
విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : ఇంటర్ ద్వితీయ సంవత్స రం సైన్స్ గ్రూపుల విద్యార్థులకు ఈనెల 12నుంచి మార్చి 3వ తేదీ వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. 16,546 మంది ఎంపీసీ, 8,493మంది బీపీసీ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో 161 పరీక్ష కేంద్రాలు ఏ ర్పాటుచేశారు. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో నా లుగు దశల్లో బ్యాచ్‌ల వారీగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ల్యాబ్ పరికరాలు అందుబాటులో ఉన్న కళాశాలల్లోనే ప్రాక్టికల్స్ కోసం పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశామని ఇంటర్ విద్య ఆర్‌ఐఓ మల్‌హల్‌రావు తెలిపారు. ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లుగా వ్యవహరించనుండగా, ఎగ్జామినర్ల నియామ కం పూర్తయిందని పేర్కొన్నారు. ఇంటర్ విద్య ఉన్నతాధికారులతో పాటు జిల్లాలోని హైపవర్ కమిటీ ప్రాక్టికల్స్ నిర్వహణ తీరును పరిశీలిస్తుందని, త్వరలోనే విద్యార్థులకు హాల్‌టికెట్లు అందజేస్తామని ఆర్‌ఐఓ వివరించారు.
ఒకేషనల్ విద్యార్థులకు..
జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో కొనసాగిస్తున్న ఒకేషనల్ కోర్సుల ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కూడా ఈనెల 12నుంచి ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 3,890మంది, ద్వితీయ సంవత్సరం 4,782మంది విద్యార్థులు ప్రాక్టికల్స్ పరీక్షలు రాయనుండగా, కోర్సులు నిర్వహించే కళాశాలల్లోనే సెంటర్లు ఏర్పాటుచేశారు. ఒకేషనల్ కోర్సుల విద్యార్థుల కోసం తొలిసారిగా ఇంటర్ బోర్డు ప్రాక్టికల్స్ పరీక్షల ప్రశ్నాపత్రాలు రూపొందించగా, పారామెడికల్ కోర్సులకు మాత్రం ఆయా కళాశాలల్లోనే ప్రశ్నపత్రాలు రూపొందిస్తారు.