
120 లీటర్ల నాటుసారా స్వాధీనం
పార్వతీపురం: ఎక్సైజ్ దాడుల్లో 120 లీటర్ల నాటుసారా, 40 నిబ్బులను స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ ఎస్.విజయకుమార్ శుక్రవారం తెలిపారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వై.చైతన్య మురళి ఆదేశాల మేరకు ఎస్‌ఐలు జె.రాజశేఖర్, పి.బి.వి.ఎస్‌ఎన్ మూర్తి తదితరులు సిబ్బందితో వెళ్లి పార్వతీపురం మండలం గోచెక్క వద్ద తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా లావాల వెంకటరావు వద్ద నుంచి 120 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు. జియ్యమ్మవలస మండలం పరజపాడు వద్ద వడ్డి సాగర్ వద్ద నుంచి 40 నిబ్బులు స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సారా తయారు చేసినా, విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
సారాబట్టీలపై దాడులు
విజయనగరం రూరల్: కొత్తవలస, గుర్ల మండలాల్లో నాటుసారా బట్టీలపై గురువారం రాత్రి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ ఎంవీఎస్ లోకేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెంలో ఉగ్గిన అండాలమ్మ వద్ద ఐదు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని ఆమెను అరెస్ట్ చేశారు. గుర్ల మండలం దేవుని కణపాకలో దాడులు చేసి 150 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ కరుణలత, హెడ్ కానిస్టేబుళ్లు నాగేశ్వరరావు, గీతారాణి, కానిస్టేబుళ్లు హరికిరణ్‌కుమార్, కూర్మారావు, ఫాతిమాబేగం తదితరులు పాల్గొన్నారు.