ఫుల్లుగా తాగేశారు
జంట నగరాల్లో న్యూఇయర్ కిక్
రెండు జిల్లాల్లో రూ.13 కోట్ల మద్యం విక్రయాలు
గతేడాది కంటే 10 శాతం పెరుగుదల
విజయవాడ : నూతన సంవత్సర వేడుకలకు మందుబాబులు మద్యం మత్తులో మునిగితేలారు. రెండు జిల్లాల్లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రికార్డుస్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. రెండు జిల్లాల్లో రోజూ జరిగే మద్యం విక్రయాల కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో విక్రయాలు జరగడం గమనార్హం. గురువారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సుమారు 13 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి.
రాష్ట్రంలో మద్యం విక్రయాలు అధికంగా జరిగే జిల్లాల్లో గుంటూరు, కృష్ణా జిల్లాలు మొదటి ఐదు స్థానాల్లోనే ఉంటాయి. సగటున రెండు జిల్లాల్లో నెలకు 110 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరగుతుంటాయి. సంవత్సరం ముగింపు పార్టీల్లో మద్యం వినియోగం అధికంగా ఉంటుందని రెండు జిల్లాల పోలీసులు మందుగానే నూతన సంవత్సర వేడుకలకు అనేక ఆంక్షలు విధించారు. అయితే బార్లు, వైన్ షాపుల విషయంలో ఈసారి పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారు. దీంతో గుంటూరు, విజయవాడ నగరాల్లో గురవారం రాత్రి 1 గంట వరకు మద్యం అమ్మకాలు జరిగాయి. వీటితో పాటు హాయ్‌ల్యాండ్,గుంటూరు, విజయవాడలోని క్లబ్‌ల్లో న్యూయర్ పార్టీలు పెద్ద సంఖ్యలో జరిగాయి. దీంతో రోజువారీ విక్రయల కంటే రెట్టింపు విక్రయాలు జరిగాయి. నూతన బార్ పాలసీపై గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లికి చెందిన మద్యం వ్యాపారులు హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొచ్చారు. దీంతో పాత బార్ పాలసీనే మరో నెల రోజులు పొడిగించమని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో వ్యాపారులకు ఊరట లభించింది. దీంతో రెన్యూవల్స్ అయిన బార్లు, రెన్యూవల్స్ కాని బార్లు అన్నింట్లో మద్యం విక్రయాలు జరిగాయి. అయితే ఇప్పటి వరకు రెండు జిల్లాల్లో 60 శాతం షాపులకు మాత్రమే కొత్త బార్ పాలసీ నిబంధనల ప్రకారం లెసైన్స్‌లు వస్తాయి. గుంటూరు జిల్లాలో 351 వైన్ షాపులు, 152 బార్లు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు అధికారికంగా 2.30 లక్షల కేసుల మద్యం నిల్వలు విక్రయాలు జరుగుతుంటాయి. అలాగే కృష్ణా జిల్లాలో 301 వైన్ షాపులు, 167 బార్లు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు 2.10 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరగుతుంటాయి. గురువారం గుంటూరు జిల్లాలో రూ.7 కోట్లు, కృష్ణాలో రూ.6 కోట్లు మద్యం విక్రయాలు జరిగాయి.
200 కోట్లు పెరిగిన విక్రయాలు
రెండు జిల్లాల్లో గడచిన ఏడాది సుమారు రూ.200 కోట్ల మద్యం విక్రయాలు అధికంగా జరిగాయి. 2014 సంవత్సరంలో గుంటూరు జిల్లాలో 870 కోట్లు విక్రయాలు జరిగాయి. 2015లో 1,000 కోట్ల మార్కు దాటింది. కృష్ణా జిల్లాలో గతేడాది 838 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరగ్గా ఈ ఏడాది విక్రయాల స్థాయి రూ.950 కోట్లకు చేరింది.