సాక్షి, తిరుమల: కరోనా వైరస్ వల్ల భక్తులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దర్శనాలు ప్రారంభించాక టీటీడీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 140 మందికి పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. పాజిటివ్ వచ్చిన వారిలో అర్చకులు, టీటీడీ ఉద్యోగులు, ఎస్టీఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది, లడ్లు తయారు చేసే సిబ్బంది ఉన్నారని వెల్లడించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో 70 మంది కోలుకుని హోంక్వారంటైన్‌లో ఉండగా, క్వారంటైన్‌లో ఉన్నవారిలో ఒక్కరు మినహా అందరు ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు.
ప్రధానంగా 40 మంది అర్చకుల్లో 14 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. 60 సంవత్సరాలు నిండిన అర్చకులకి విధుల నుండి సడలింపు ఇచ్చామని తెలిపారు. రమణ దీక్షితులు చేసిన ట్వీట్‌కు రాజకీయ రంగు పులమకండని, గౌరవ ప్రధాన అర్చకులుగా ఉండి ఇలా ట్వీట్ చేయటం మంచి పద్దతి కాదని సూచించారు. ఏమైనా సమస్య ఉంటే రమణ దీక్షితులుతో కూడా చర్చిస్తామని అన్నారు. అర్చకులకి ప్రమాదకరమైన పరిస్థితి నెలకొంటే దర్శనాలు కూడా ఆపివేస్తామని అన్నారు. అర్చకులు బాగుంటేనే శ్రీవారి కైంకర్యాలు సక్రమంగా జరుగుతాయని, దర్శనాల సంఖ్య తగ్గించడం, పెంచడం ఉండదని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment