మరో 15 మృతదేహాల గుర్తింపు
మొత్తం 34 మృతదేహాలను గుర్తించిన అధికారులు
28 మృతదేహాల అప్పగింత
నేడు మరో 8 మృతదేహాల నివేదికలు అందే అవకాశం
హైదరాబాద్, న్యూస్‌లైన్: మహబూబ్‌నగర్‌జిల్లా పాలెం వద్ద జరిగిన బస్సు దగ్ధం దుర్ఘటనలో సజీవ దహనమైన మృతదేహాల తాలూకు రెండో జాబితాను అధికారులు మంగళవారం సాయంత్రం ప్రకటించారు. డీఎన్‌ఏ నివేదికల ఆధారంగా మరో 15 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఉస్మానియా మార్చురీ వద్ద మృతుల కుటుంబీకులకు మంగళవారం సాయంత్రం వరకూ 13 మృతదేహాలను అప్పగించగా.. సాయంత్రం ప్రకటించిన రెండో జాబితాలోని 6 మృతదేహాలను కూడా వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరో 3 మృతదేహాలను బుధవారం తెల్లవారుజామున తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటి జాబితాలోని మరో మూడు మృతదేహాల సంబంధీకులు మంగళవారం మంచి రోజు కానందున (సెంటిమెంటు) బుధవారం తీసుకెళ్లనున్నారు. అంతకుముందు సోమవారం 3 మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. దీంతో ఇప్పటిదాకా 28 మృతదేహాలను సంబంధీకులకు అప్పగించినట్లైంది. మరో ఆరు మృతదేహాలను బుధవారం అప్పగించనున్నారు. ఇప్పటిదాకా మొత్తం 34 మృతదేహాల డీఎన్‌ఏ నివేదికలు అందగా మిగతా 8 మృతదేహాల నివేదికలు బుధవారం సాయంత్రంలోపు అందే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
రెండో జాబితాలో గుర్తించింది వీరినే..
1.ఎన్.ఎస్. గిరిధర్(62), 2.జి.వాసంతి(60), 3. శక్తికాంత్ రౌత్(28), 4. కె.రమ్య(26), 5. కె.రిదియ(30 నెలలు), 6. హరీష్ భగాయత్ (31), 7.చంద్రశేఖర్(28), 8. సురేష్ బాబు (26), 9. సాఖీబ్ అహ్మద్(27), 10.హసీబ్ అహ్మద్(24), 11.మహ్మద్‌ఆసీఫ్ (25), 12. ఫారూక్‌అలీ(24), 13.జబీన్ తాజ్(26), 14.ఉజ్మాసుల్తానా(6), 15.అజ్మతుల్లా (35).
దర్యాప్తునకు ఆదేశించండి: హైకోర్టులో పిల్
మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఓల్వో బస్సు ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించి, దానిని పర్యవేక్షించాలని హైకోర్టును అభ్యర్థిస్తూ హైకోర్టు న్యాయవాది ఎస్.రాజు ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, కేంద్ర రవాణాశాఖ కార్యదర్శి, డీజీపీ, ఏసీబీ డీజీ, జబ్బార్ ట్రావెల్స్, శ్రీకాళేశ్వరి ట్రావెల్స్, ఓల్వో ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లతో పాటు రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు బస్సు ఆపరేటర్లపై, దర్యాప్తు నివేదిక ఆధారంగా బస్సు దుర్ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకునేలా సర్కారును ఆదేశించాలని పిటిషనర్ కోరారు.