'ప్రేమించలేదని కత్తితో పొడిచి చంపాడు'
ఆదిలాబాద్ : ఓ ఉన్మాది ఘాతుకానికి మరో బాలిక బలైన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జైపూర్ మండలం కాన్కూరులో తొమ్మిదో తరగతి విద్యార్థిని అనూష దారుణ హత్యకు గురైంది. గ్రామంలో జులాయిగా తిరిగే రవి అనే యువకుడు గత కొంతకాలంగా అనూషను ప్రేమ పేరిట వేధింపులకు గురి చేస్తున్నాడు. అయితే అతని ప్రేమను తిరస్కరించిన అనూష....ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. రవిని కుటుంబ సభ్యులు మందలించినా అతనిలో మార్పు రాలేదు.
గత రాత్రి స్నేహితురాలితో కలిసి ఇంట్లో చదువుకుంటున్న అనూషను పక్క పథకం ప్రకారం రవి..గత రాత్రి హతమార్చాడు. ఆమె స్నేహితురాలిని బెదిరించి అక్కడ నుంచి పంపించివేసి... అరుపులు వినిపించకుండా టీవీ సౌండ్ పెంచి కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం నిందితుడు రవి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అనూష మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆదిలాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.