గాయపడిన వారిని మాత్రమే బయటకు పంపిన సంస్థ
తాడిపత్రి : పొట్ట చేత పట్టుకుని ఒడిశా నుంచి వచ్చిన వారిపై నిర్దాక్ష్యిణ్యంగా వ్యవహరించారు.. జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ.. కనీసం కార్మాగారం నుంచి కూడా బయటకు రానీకుండా నిర్బంధించి పని చేయించుకున్నారు. కార్మికులకు, కర్మాగారంలోని సెక్యూరీటి సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణలో 12 మంది గాయపడితే.. వారి పట్ల మానవత్వంతో వ్యవహరించాల్సిన యాజమాన్యం ‘సెక్యూరీటి సిబ్బందిపైనే దాడి చేస్తారా?’ అంటూ 200 మందిని నిర్బంధంలో ఉంచింది.
చివరకు ఎలాగోలా కార్మికులు తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి ప్రభుత్వం స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చింది. అయితే ఈ విషయం బయటకు పొక్కనీయకుండా ఉక్కు కర్మాగారంతో పాటు స్థానిక అధికారులతో లాలాచీ పడి కొంత మందిని మాత్రమే మంగళవారం రాత్రి ఒడిశాకు రెలైక్కించారు.
ఇంకా 150 మందికి పైగా కార్మికులు ఫ్యాక్టరీలో నిర్బంధంలోనే ఉన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఎన్‌సీసీ అనే కన్‌స్ట్రక్షన్ సంస్థ చందన, జేఎం అనే మరో సంస్థలకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. తాడిపత్రిలోని గెర్డెవ్ ఫ్యాక్టరీలో నిర్మాణ పనులు చేయిస్తున్న ఈ సంస్థలు ఈ ఏడాది మే నెల నుంచి ఒడిశాకు చెందిన కార్మికులను దశల వారీగా సుమారు 200 మందిని ఇక్కడికి పిలిపించుకుని పని చేయిస్తున్నాయి. జీతాల విషయంలో కాంట్రాక్టర్, కార్మికుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో కొంత మంది వాదనకు దిగారు. అయితే ఏం చేయలేని స్థితిలో ఉన్న కార్మికులు అక్కడే మగ్గుతున్నారు.
కొంత కాలం క్రితం కార్మికులు ఫ్యాక్టరీ బయటకు వెళ్లి మద్యం బాటిళ్లతో తిరిగి లోపలికి వస్తుండగా గేట్ వద్ద సెక్యూరిటీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది ఆ మద్యాన్ని తాగడాన్ని గమనించిన కార్మికులు వారితో గొడవకు దిగారు. ఈ క్రమంలో కొంత మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన సెక్యూరిటీ చీఫ్ కుట్టి, సహాయకుడు సంజయ్ బెనర్జీలు కార్మికులను తీవ్ర స్థాయిలో హెచ్చరించి.. యాజమాన్యం సహకారంతో మొత్తం ఒడిశా కార్మికులను నిర్బంధించి పని చేయిస్తున్నారు. గాయపడ్డ వారికి ఫ్యాక్టరీలోని ఆస్పత్రిలోనే చికిత్స చేయించి గుట్టుచప్పుడు కాకుండా ఉంచారు. సెల్‌ఫోన్లూ లాక్కునట్లు తెలిసింది. ఎట్టకేలకు ఓ కార్మికుడు ఫోన్ దొరకబుచ్చుకుని ఒడిశాలోని కుటుంబ సభ్యులకు తాము నిర్బంధంలో ఉన్న విషయాన్ని వివరించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
నిర్బంధంలో ఇంకా 150 మంది
Published Thu, Aug 7 2014 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM
Advertisement
Advertisement