మూడు లకారాలుంటే...పోస్టు మీదే!
Published Sun, Nov 17 2013 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 12:40 AM
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ :జిల్లాలో ఖాళీగా ఉన్న 158 గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సంబంధించి దళారులు రంగంలోకి దిగారు. నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీక రించే ఘట్టం శుక్రవారంతో ముగియడంతో బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఇళ్లను వెతుక్కుంటూ వెళ్లి మరీ బేరాలు కుదుర్చుకునే పనిలో దళారులు పడ్డారు. 158 పోస్టుల భర్తీకి సంబంధించి చివరి తేదీ ఈ నెల 15 సాయంత్రం 5 గంటల వరకు వచ్చిన దరఖాస్తులు తొమ్మిది వేలకు పైగా ఉంటాయని పంచాయతీ అధికారులు చెబుతున్నారు.
ఈ పోస్టులకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష కాని.. మౌఖిక పరీక్ష కానీ నిర్వహించకపోవడంతో ప్రతిఒక్కరూ ఆశపెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పైరవీలా ద్వారానైనా పోస్టు దక్కించుకునేందుకు పావులుకదుపుతున్నారు. అయితే మొత్తం పోస్టుల్లో 136 వరకు 25 శాతం వెయిటేజీ ఉన్న ఇన్‌సర్వీస్ (కాంట్రాక్ట్) కార్యదర్శులకే దక్కనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే మిగిలిన 22 పోస్టుల కోసం నిరుద్యోగ అభ్యర్థులు పోటీ పడవలసి ఉంటుంది. ఇందులో డిగ్రీలో అత్యధిక మార్కుల సాధించిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు కులాల వారీగా పోస్టుల కేటాయింపులుంటాయని డీపీఓ చెబుతున్నారు. ఈ తతంగం తెలియని నిరుద్యోగ అభ్యర్థులు మాత్రం ఉద్యోగం వస్తుందనే ఆశతో దళారుల వలలో పడుతున్నారు.
జోరుగా పైరవీలు...
ఎన్నో ఏళ్లుగా భర్తీకి నోచుకోని పంచాయతీ కార్యదర్శులు పోస్టులను ఎట్టకేలకు ప్రభుత్వం పూర్తి చేస్తుండడంతో నిరుద్యోగ యువ త ఆ పోస్టులు దక్కించుకునేందుకు తాపత్రాయపడుతున్నారు. పోస్టులు తక్కువ, పోటీ ఎక్కువగా ఉండడంతో అభ్యర్థుల్లో ఆత్రుత మరింత పెరిగింది. సొంత జిల్లాలో ఉద్యోగం కావడంతో పోస్టు ఎలాగైనా దక్కించుకోవాలనే ఆశతో ఇప్పటికే రాజకీయ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని బడా నేతలతో పాటు మండల, గ్రామ స్థాయి నేతల ఇళ్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయితే వారి వద్దకే మిగిలిన అభ్యర్థులు కూడా క్యూ కడుతుండడం చూస్తున్న కొందరు కీలకవ్యక్తులు దళారులుగా అవతారమెత్తుతున్నారు.
తాము పెద్ద నాయకులతో మాట్లాడి పోస్టులు ఇప్పిస్తామంటూ బేరసారాలు సాగిస్తున్నారు. పోస్టుల భర్తీ ప్రక్రియ ఈ నెలాఖరుతో పూర్తికానుండడంతో మూడు లకారాల వరకు ఖర్చవుతుందంటూ బేరసారాలు జోరుగా కానిస్తున్నారన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. కొందరు దళారులయితే ఎక్కువ మార్కులు కలిగి ఉండి రిజర్వేషన్ ఉన్న వారి ఇళ్లను వెతుక్కుంటూ వెళ్లి మరి వారిని ప్రలోభపెడుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ ప్రక్రియ మాత్రం దళారులకు కాసుల వర్షం కురిపిస్తోందనడంలో సందే హం లేదు.
Advertisement
Advertisement