చెన్నూరు, న్యూస్‌లైన్: మధ్యాహ్న భోజనం విషాహారమైంది. అన్నంలో బల్లి పడటాన్ని గమనించకుండా విద్యార్థులకు వడ్డించడంతో వాటిని తిన్న 17 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒక్కొక్కరుగా విద్యార్థులు వాంతులు చేసుకోవడాన్ని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఏజెన్సీ నిర్వాహకులు, ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వడంతో వారు అప్రమత్తమయ్యారు. విద్యార్థులందరినీ సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.
సంఘటన జరిగిందెలాగంటే...
చెన్నూరులోని బాలుర ఉన్నత పాఠశాలలో 400 మంది విద్యార్థులు ఉంటున్నారు. రోజులాగే శనివారం మధ్యాహ్నం కూడా ఏజెన్సీ నిర్వాహకులు పిల్లలకు భోజనం వడ్డించారు. వాటిని తిన్న వారిలో తొలుత భరత్ అనే పదో తరగతి విద్యార్థి తన పళ్లెంలో బల్లి ఉందంటూ ఉపాధ్యాయులతో పాటు వంట చేసేవారికి చూపించాడు. అంతలోనే మరో ఇద్దరు విద్యార్థులు వచ్చి తమకు కడపులో వికారంగా ఉందని చెప్పారు.
దీంతో ఇన్‌చార్జ్ ఎంఈఓ, హెడ్మాస్టర్ వెంకటలక్షుమ్మ, వంట ఏజెన్సీ నిర్వాహకులు, ఉపాధ్యాయు లు కలసి విద్యార్థులను వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. చిన్నపిల్లల వైద్యనిపుణుడు ఇబ్రహీం, వైద్యాధికా రి రాఘవ వెంటనే విద్యార్థులను పరీ క్షించారు. పిల్లలకు ఎటువంటి ప్రమా దం లేదని నిర్ధరించారు. అయితే భరత్ అనే విద్యార్థి ఎక్కువగా భయపడటంతో అతనికి ప్లూయిడ్స్ ఎక్కించారు. మిగిలిన 16 మందికి మందులు, ఓఆర్‌ఎస్ ద్రావణం, బ్రెడ్ ఇచ్చారు.
పాఠశాలకు చేరుకున్న అధికారులు
సమాచారం అందిన వెంటనే స్థానిక తహశీల్దారు శాంతమ్మ, డీటీ వెంకటసుబ్బయ్య సహా చెన్నూరు సర్పంచ్ రాజేశ్వరి పాఠశాలకు చేరుకున్నారు. ఆ తరువాత పీహెచ్‌సీకి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అప్పటికే విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పరుగులతో ఆస్పత్రికి చేరుకున్నారు.
తమ పిల్లకేమైందంటూ డాక్టర్లు, అధికారులను పదేపదే అడిగారు. పిల్లలకు ఏం కాదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. పర్యవేక్షణ లోపంతోనే ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సంఘటన ఎలా జరిగిందనే అంశంపై విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎంఈఓ, తహ శీల్దార్ తెలిపారు.
మధ్యాహ్న భోజనం వికటించి...
Published Sun, Dec 15 2013 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
Advertisement
Advertisement