
18 కోట్లు డిపాజిట్ చేయండి
ఏపీఐఐసీని ఆదేశిస్తూహైకోర్టు సంచలన ఉత్తర్వులు
హైదరాబాద్: ప్రభుత్వ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) మూసివేతను కోరుతూ దాఖలైన పిటిషన్ విషయంలో హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఐహెచ్‌పీ జాయింట్ వెంచర్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత కోసం దాఖలయ్యే వ్యాజ్యాలను కోర్టులు విచారణకు స్వీకరించడమన్నది అత్యంత అరుదైన విషయం. ఐహెచ్‌పీ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు, ఆ కంపెనీకి ఇంకా చెల్లించాల్సిన రూ.8.18 కోట్లను రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) వద్ద రెండు నెలల్లో డిపాజిట్ చేయాలని ఏపీఐఐసీని ఆదేశించింది. అలా చేస్తేనే ఆ పిటిషన్‌ను కొట్టివేస్తామని తేల్చి చెప్పింది. డిపాజిట్ చేసిన మొత్తాన్ని రిజిస్ట్రార్‌ను సంప్రదించి విత్‌డ్రా చేసుకోవచ్చని ఐహెచ్‌పీ కంపెనీకి హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ఏపీఐఐసీ ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయని పక్షంలో, కంపెనీ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన విషయాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హిందూ, సాక్షి దినపత్రికల్లో ప్రకటన రూపంలో తెలియచేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. తాము ఆదేశించిన విధంగా ఏపీఐఐసీ డబ్బు డిపాజిట్ చేయకపోతే ఈ వ్యాజ్యాన్ని ఈ ఏడాది డిసెంబర్ 8న తిరిగి విచారిస్తామని తేల్చి చెప్పింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ఇటీవల ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కడప జిల్లాకు తాగునీరు అందించేందుకు రూ.267 కోట్ల విలువైన పైప్‌లైన్ల పనులకు ఐహెచ్‌పీ జాయింట్ వెంచర్‌తో ఏపీఐఐసీ గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. పనులు కొంత మేర పూర్తయిన తరువాత ఒప్పందం ప్రకారం బిల్లులు సమర్పించగా, ఆ బిల్లుల్లో కొద్ది మొత్తమే ఐహెచ్‌పీకి ఏపీఐఐసీ చెల్లించింది. ఇంకా రూ.8.18 కోట్లు బకాయిపడింది. బకాయిలు చెల్లించాలని కోరితే, ప్రభుత్వ నిధులు వచ్చినతర్వాత చెల్లిస్తామని ఏపీఐఐసీ చెప్పేది. తరువాత అది కూడా చెప్పడం మానేసింది. దీంతో ఐహెచ్‌పీ జాయింట్ వెంచర్ హైకోర్టును ఆశ్రయించింది. ఏపీఐఐసీని మూసివేసేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థించింది.