సాక్షి, హన్మకొండ :
వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి మరో కీలక అడుగు ముందుకు పడింది. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూమిని సేకరించేందుకు 18 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వుల ప్రతులను ఎంపీ సిరిసిల్ల రాజయ్య గురువారం హన్మకొండలో మీడియాకు అందజేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిన కాజీపేటలో వ్యాగన్ పరిశ్రమను నిర్మిస్తామని 2010-11 బడ్జెట్‌లో రైల్వేశాఖ ప్రకటించింది. అందులో భాగంగా మడికొండ సమీపంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధీనంలో ఉన్న 54.15 ఎకరాల భూమిని వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటుకు అనువైనదిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. పరిశ్రమ ఏర్పాటుకు ఈ భూమిని దేవాదాయశాఖ నుంచి రవాణాశాఖకు బదలాయించాల్సిందిగా రాష్ర్ట ప్రభుత్వం హైకోర్టును ఆశ్రరుుంచింది.
2013 ఫిబ్రవరిలో హైకోర్టు అనుమతి రాగా... ఎనిమిది నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణకు అవసరమైన నిధులను కేటాయిస్తూ ఈ నెల ఏడో తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వేబడ్జెట్ కసరత్తు జరుగుతున్న దశలో భూ సేకరణకు నిధులు మంజూరు కావడంతో అతిత్వరలో పరిశ్రమ ప్రారంభం కావొచ్చనే ఆశలు చిగురిస్తున్నాయి. ఈ పరిశ్రమ ఏర్పాటైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా జిల్లాలో పదివేల మందికి ఉపాధి లభించే అవకాశముంది.
‘వ్యాగన్’ స్థల సేకరణకు 18 కోట్లు మంజూరు
Published Fri, Nov 15 2013 4:29 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM
Advertisement
Advertisement