జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ ఆదేశం
ఒంగోలు టౌన్ : జిల్లాలో ఈ ఏడాది దీపం పథకం కింద 2.25 లక్షల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్‌లాల్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో దీపం పథకంపై పౌరసరఫరాల అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్ కనెక్షన్ లేని ఏపీఎల్, బీపీఎల్ కుటుంబాలకు దీపం పథకం కింద అందించాలన్నారు వార్షిక లక్ష్యాన్ని నెలవారీగా, మూడు నెలలు, ఆరునెలలు విభజించి సంబంధిత ఆయిల్ కంపెనీలకు పంపించాలని ఆదేశించారు. గ్యాస్ కనెక్షన్ల వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు వివరిస్తూ అవగాహన సదస్సులు రెండు రోజుల్లో ఏర్పాటు చేయాలన్నారు.
క్షేత్ర స్థాయిలో వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు కూడా గ్యాస్‌కనెక్షన్ల మేళాకు సహకరించాలని ఆదేశించారు. గ్యాస్ కనెక్షన్లు లేని కుటుంబాల జాబితాలు మండలాల వారీగా తయారుచేసి మూడు రోజుల్లో సంబంధిత ఆయిల్ కంపెనీలకు అందించాలన్నారు. గ్యాస్ కనెక్షన్ కోసం మొదటిగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కనెక్షన్లు మంజూరు చేసే విషయంలో 50 శాతం ఎస్సీ, ఎస్టీలకు అందించాలన్నారు. సమావేశంలో సహాయ పౌరసరఫరాల అధికారులు హనుమంతరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
2.25 లక్షల దీపం కనెక్షన్లు మంజూరు చేయాలి
Published Wed, May 18 2016 1:58 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM
Advertisement