కనుచూపు మేర కనిపించని ‘కిరోసిన్‌ ఫ్రీ సిటీ’ | Deepam Scheme Delayed in Hyderabad | Sakshi
Sakshi News home page

కనుచూపు మేర కనిపించని ‘కిరోసిన్‌ ఫ్రీ సిటీ’

Published Thu, Jul 18 2019 9:31 AM | Last Updated on Mon, Jul 22 2019 12:13 PM

Deepam Scheme Delayed in Hyderabad - Sakshi

సాక్షి,సిటీ బ్యూరో:  హైదరాబాద్‌ను కిరోసిన్‌ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యంపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. ఫలితంగా ప్రతి ఇంటా వంట గ్యాస్‌ వెలుగులు అందించాలనే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (దీపం) పథకం కూడా ముందుకు సాగడం లేదు. గత ఆరు మాసాల్లో ఒక్క కనెక్షన్‌ కూడా జారీ కాలేదంటే ఆయిల్‌ కంపెనీల  నిర్లక్ష్యం, పౌరసరఫరాల శాఖ పర్యవేక్షణ లోపం స్పష్టమవుతోంది.
విశ్వ నగరిగా పరుగులు తీస్తున్న మహా నగరంలో నిరుపేద కుటుంబాలు కిరోసిన్‌ పైనే ఆధారపడి వంటవార్పు కొన సాగించడం విస్మయానికి గురిచేస్తోంది. కనీసం ఆహార భద్రత (రేషన్‌) కార్డు కలిగిన కిరోసిన్‌ లబ్ధి దారులకు కనెక్షన్లు మంజూరు చేయించడంలో పౌరసరఫరాల శాఖ పూర్తిగా విఫలం చెందినట్లు కనిపిస్తోంది. వాస్తవంగా పౌరసరఫరా శాఖ ఎల్పీజీ సిలిండర్‌ లేని వారిని గుర్తించి కొందరికి ప్రొసీడింగ్‌ జారీ చేసినా ...  ఆయిల్‌ కంపెనీల డిస్ట్రిబ్యూటర్లు మాత్రం కనెక్షన్ల జారీలో నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రోసీడింగ్‌ జారీని తాత్కాలికంగా నిలిపివేసింది.

నాలుగు లక్షల కుటుంబాలకు నో గ్యాస్‌
 మహా నగరంలో సుమారు 28 లక్షలకు పైగా కుటుంబాలు ఉండగా అందులో 24 లక్షల కుటుంబాలకు మాత్రమే వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. మిగిలిన నాలుగు లక్షల కుటుంబాలకు వంట గ్యాస్‌ కనెక్షన్లు లేవు. బీపీఎల్‌ కింద ఆహార భద్రత (రేషన్‌) కార్డు కలిగి  వంట గ్యాస్‌ లేని  కుటుంబాలను పౌరసరఫరాల  గుర్తించి చేపట్టిన చర్యలు మొక్కుబడిగా మారాయి. వాస్తవంగా దీపం పథకం కింద కిరోసిన్‌ లబ్ధి కుటుంబాలను గుర్తించినప్పటికి  వాటిలోనే సగం మందికి కూడా కనెక్షన్లు అందలేదనంటే సంబంధిత శాఖ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.  సుమారు 1,67,182 కుటుంబాలను గుర్తించి కనెక్షన్లకు అమోదం తెల్పినా... ఆయిల్‌ కంపెనీల డిస్ట్రిబ్యూటర్లు మాత్రం  84,713 కనెక్షన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మిగిలిన ఎల్పీజీ ప్రొసీడింగ్‌ పెండింగ్‌లో పడిపోయాయి. పౌరసరఫరాల విభాగాలు సైతం జారీ చేసిన ప్రొసీడింగ్‌ గ్రౌండింగ్‌లను పర్యవేక్షించక పోవడంతో గత ఆరుమాసాల్లో ఒక్క కనెక్షన్‌ కూడా జారీ కాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.

కనెక్షన్ల పరిస్ధితి ఇలా..
గ్రేటర్‌ పరిధిలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (దీపం) పథకం అమలు ను పరిశీలిస్తే పౌరసరఫరాల విభాగాల పనితీరు అధ్వానంగా కనిపిస్తోంది. ఆయిల్‌ కంపెనీల నిర్లక్ష్యంపై కనీసం చర్యలు చేపట్టక పోవడం మెతక వైఖరీని  అద్దం పడుతోంది. పౌరసరఫరాల విభాగం హైదరాబాద్‌ పరిధిలో సుమారు 1,13,993 కుటుంబాలను గుర్తించి ప్రొసీడింగ్‌ జారీ చేస్తే  కేవలం 57,824 కుటుంబాలకు మాత్రమే గ్యాస్‌ కనెక్షన్లను ఆయిల్‌ కంపెనీలు జారీ చేశాయి.  రంగారెడ్డి జిల్లా పరిధిలో     32,014 కుటుంబాలను గుర్తిస్తే 18,469 కనెక్షన్లు, మేడ్చల్‌ జిల్లా పరిధిలో 21,175 కుటుంబాలకు గాను 8,420 కనెక్షన్లు మాత్రమే జారీ అయ్యాయి. దీంతో సంబంధిత అధికారుల ఉదాసీన వైఖరీ స్పష్టమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement