‘ఇంటెరాక్స్ ఎస్టీ 50’ కెమికల్ ఇదే.. కార్ఖానాలో ఒక ట్యాంకు నుంచి మరో ట్యాంకులోకి కిరోసిన్‌ను తోడుతున్న వైనం...
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలోని పేదలకు సబ్సిడీ ధరపై చేరాల్సిన కిరోసిన్ పక్కదారి పడుతోంది. ఇది ఏళ్లుగా సాగుతున్న వ్యవహారమే అయినప్పటికీ.. ఇందులో ఓ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ‘ఇంటెరాక్స్ ఎస్టీ 50’ అనే కెమికల్‌తో పాటు ముల్తానా మట్టిని వినియోగించి కిరోసిన్‌ను డీజిల్‌గా మార్చేస్తున్నారు. ఇలా తయారు చేసిన నకిలీ ఇంధనాన్ని ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా రవాణా చేసి, వివిధ పెట్రోల్ బంకులకు విక్రయిస్తున్నారు. ఏటా రూ.100 కోట్ల మేర సా గుతున్న ఈ అక్రమ వ్యవహారం తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల చొరవతో బహిర్గతమైంది. గురువారం మధ్యాహ్నం నుంచి 24గంటల పాటు చేపట్టిన ఆపరేషన్‌లో మాఫియా గుట్టురట్టయింది. పాత్రధారుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న అధికారులు దళారులు, సూత్రధారుల కోసం గాలిస్తున్నారు. వారూ చిక్కితే పూర్తి వ్యవహారం వెలుగులోకి వస్తుందని చెబుతున్నారు.
అనుమానంతో ఆరా...
కిరోసిన్ సరఫరాకు సంబంధించి నగర శివార్లలో ని ఘట్‌కేసర్, చర్లపల్లిలో ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ కంపెనీలకు చెందిన ప్రధాన కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఏజెన్సీల ద్వారా పర్మిట్ ఉన్న ట్యాంకర్లలో కిరోసిన్‌ను రేషన్ డీలర్లకు సరఫరా చేస్తుంటారు. సాధారణంగా ఒక్కో ట్యాంకర్ 12వేల నుంచి 12,500 లీటర్ల సామర్థ్యంతో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొందరు రేషన్ డీలర్లకు కలిపి ఒకే ట్యాంకర్ పంపిస్తూ ఉంటారు. రాష్ట్రంలో ఉన్న ఏజెన్సీల్లో అచ్చంపేటకు చెందిన ఇందుమతి ఏజెన్సీస్ ఒకటి. సాధారణ తనిఖీల్లో భాగంగా కేంద్ర కార్యాలయానికి చెందిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కొన్ని అవకతవకల్ని గుర్తించారు. దీంతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి వారికి కేసును అప్పగించారు. సాధారణంగా బ్లాక్ మార్కెట్‌లో విక్రయాల నేపథ్యంలో ఏజెన్సీల వద్ద తమకు వస్తున్న కిరోసిన్ కంటే స్టాక్ తక్కువగా ఉంటుంది. అయితే ఇందుమతి ఏజెన్సీ వద్ద ఎక్కువ కనిపించడంతో విజిలెన్స్ అధికారులకు అనుమానం వచ్చింది. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఆ విభాగం డీజీ రాజీవ్ త్రివేది సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా హైదరాబాద్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి చిట్టిబాబును ఆదేశించారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన ఆయన సమగ్ర దర్యాప్తు చేయించారు.
నిఘాతో గుట్టురట్టు..
స్పెషల్ టీమ్స్ ఘట్‌కేసర్‌లోని హెచ్‌పీసీఎల్ నుంచి ఇందుమతి ఏజెన్సీస్‌కు జరుగుతున్న సరఫరాపై కన్నేశాయి. ఘట్‌కేసర్ నుంచి 12వేల లీటర్ల కిరోసిన్‌తో గురువారం మధ్యాహ్నం బయలుదేరిన ట్యాంకర్ (ఏపీ 13 టీ 8362) రాత్రి వరకు అచ్చంపేటకు రాలేదని తేల్చారు. హైదరాబాద్‌లోని పటేల్‌నగర్‌కు చెందిన ఇలియాజ్‌కు చెందిన ఈ ట్యాంకర్‌కు నగరవాసే అయిన మహ్మద్ ఖాసీం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సాంకేతికంగా ఆరా తీయడంతో పాటు లోతైన క్షేత్రస్థాయి పరిశోధన జరిపిన విజిలెన్స్ టీమ్స్ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఈ ట్యాంకర్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ గేట్ నెం.1 వద్ద ఆగి ఉన్నట్లు గుర్తించారు. అచ్చంపేటకు చేరకుండానే ట్యాంకర్ ఖాళీగా మారడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఈ అనుమానం నివృత్తి చేసుకోవడానికి ఖాసీంను అదుపులోకి తీసుకొని విచారించగా అనేక కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. కిరోసిన్ సరఫరా చేసే కంపెనీల నుంచి బయలుదేరిన ట్యాంకర్లు పటాన్‌చెరు మీదుగా పాశమైలారం చేరుకుంటున్నాయి. అక్కడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఓ కార్ఖానా స్థాపించాడు. ఇక్కడున్న ట్యాంకుల్లోకి తీసుకొచ్చిన ట్యాంకర్లలోని కిరోసిన్‌ను తోడుతున్నారు. తొలుత కిరోసిన్‌కు ఉన్న నీలిరంగు పోగొట్టడానికి ఆ ట్యాంకుల్లో ఇంటెరాక్స్ ఎస్టీ 50 అనే కెమికల్‌ను వేస్తున్నారు. దీని ప్రభావంతో కిరోసిన్‌లో ఉండే నీలిరంగు ట్యాంక్ కింది భాగంలోకి వెళ్లిపోతుండగా, తెల్లరంగులోకి మారిన కిరోసిన్ పైభాగంలో ఉంటోంది.
దీన్ని మరో ట్యాంకులోకి తోడుతున్న దుండగులు మహిళలు ముఖానికి వినియోగించే సౌందర్య సాధనం ముల్తానామట్టిని నిర్ణీత ప్రమాణంలో కలుపుతున్నారు. దీంతో కిరోసిన్ రంగు మారి డీజిల్ రంగులోకి వస్తోంది. దీన్ని వేరే ట్యాంకర్‌లోకి నింపి ఆంధ్రప్రదేశ్‌లోని పెట్రోల్ బంకులకు సరఫరా చేస్తున్నారు. ఈ వ్యవహారంలో నగరానికి చెందిన రఫీఖ్ దళారీగా వ్యవహరిస్తున్నాడు. ఏజెన్సీలు, రేషన్ డీలర్ల సహకారంతో లీటర్ కిరోసిన్‌ను రూ.45 నుంచి రూ.50కి ఖరీదు చేస్తున్న శ్రీనివాస్ దాన్ని డీజిల్‌గా మార్చిన తర్వాత లీటర్ రూ.70కి విక్రయిస్తున్నాడని తేలింది. దాదాపు ఏడాదిగా శ్రీనివాస్ ఈ కార్ఖానా నిర్వహిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమ రవాణా విషయం తెలుసుకున్న విజిలెన్స్ బృందాలు నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ నుంచి కర్నూలు వరకు ఉన్న అనేక టోల్‌గేట్స్ ఆధారంగా నకిలీ డీజిల్‌ను రవాణా చేస్తున్న ట్యాంకర్‌ని పట్టుకోవడానికి ప్రయత్నించాయి.
ఆ ట్యాంకర్ (ఏపీ 26 టీఈ 1566) షాద్‌నగర్ మీదుగా ప్రయాణించి కర్నూలు వెళ్లిందని, అక్కడ నుంచి నెల్లూరు చేరుకుంటున్నట్లు గుర్తించారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్రతమత్తమైన ఆ టీమ్స్ నెల్లూరుకు 20 కి.మీ దూరంలో నకిలీ డీజిల్ ట్యాంకర్‌ను శుక్రవారం మధ్యాహ్నం పట్టుకొని డ్రైవర్‌ను విచారిస్తున్నాయి. ఆ ప్రాంతంలో వీరికున్న లింకుల్ని ఆరా తీస్తున్నాయి. ఈ నకిలీ డీజిల్‌ను బంకుల్లో అసలు ఇంధనంతో కలిపి విక్రయిస్తున్నారని అనుమానిస్తున్నారు. ఈ దందా పూర్వాపరాలు బయటకు లాగడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రాథమికంగా రఫీఖ్, శ్రీనివాస్‌లతో పాటు ఇతర సూత్రదారుల్ని పట్టుకుంటే అనేక చిక్కుముడులు వీడతాయని చెబున్నారు. ఈ తరహా దందాలు చేస్తున్న అక్రమ ఏజెన్సీలు, కార్ఖానాలు ఎన్ని ఉన్నాయి? ఎక్కడెక్కడ నుంచి వ్యవహారాలు సాగిస్తున్నాయి? అనే అంశాలను గుర్తించడంపై విజిలెన్స్ విభాగం దృష్టి పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment