మహిళలకు కట్టెల పొయ్యిపై వంట కష్టాలను దూరం చేయడానికి ప్రభుత్వాలు దీపం వంటి పథకాలు తీసుకువచ్చినా.. పేదింట మాత్రం గ్యాస్‌పొయ్యి వెలగడం లేదు. సిలిండర్లను రీఫిల్ చేయించుకోవడం ఆర్థికంగా భారం కావడంతో చాలా మంది దీపం కనెక్షన్లనూ మూలన పడేశారు. గ్రామాల్లో చాలా ఇళ్లలో కట్టెల పొయ్యిపైనే వంట చేసుకుంటున్నారు.
సాక్షి,కామారెడ్డి: కట్టెల పొయ్యిపై వంట చేస్తే వచ్చే పొగతో మహిళలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే వంట చెరుకుకోసం చెట్లను నరికివేస్తుండడంతో పర్యావరణానికి హాని కలుగుతోంది. వీటిని దృష్టిలో ఉంచుకుని వంట గ్యాస్ వినియోగాన్ని పెంచడానికి ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయి. గ్యాస్‌పై సబ్సిడీ ఇస్తుండడంతో ఉచితంగా కనెక్షన్లుకూడా ఇస్తున్నాయి. దీంతో సిలిండర్ల వినియోగం పెరిగింది. అయితే గ్యాస్‌బండ పేదలకు గుదిబండగా మారుతోంది. సిలిండర్‌ను రీఫిల్ చేయించుకోవడం ఆర్థిక భారమవుతోంది. చాలా కుటుంబాల్లో ఒక సిలిండర్ నెలన్నరకుమించి రావడం లేదు. వర్షాకాలం, చలికాలాలలో స్నానానికి వేడి నీళ్లను కాగబెట్టుకుంటే మరో పదిరోజుల ముందే గ్యాస్ అయిపోతోంది.. మరోవైపు సిలిండర్ ధర ఎప్పటికప్పుడు మారుతుండడం ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ. 725.50 ఉంది. గత నెలలో సిలిండర్ ధర రూ. 760 ఉండింది.
సిలిండర్‌పై సబ్సిడీని ప్రభుత్వం వినియోగదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పుడున్న ధర ప్రకారం రూ. 216 సబ్సిడీ ఖాతాలో జమ అవుతుంది. అయితే చాలా మందికి సబ్సిడీ సొమ్ము బ్యాంకు ఖాతాల్లో సరిగా జమ కావడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఏజెన్సీల వద్దకు వెళ్లి అడిగితే మాకు సంబంధం లేదనే సమాధానం వస్తోంది. కాగా ఇప్పటికిప్పుడు సిలిండర్‌కు రూ. 725 చెల్లించడం పేదలకు ఎంతో భారంగా ఉంటోంది. సిలిండర్ ధర రూ. 509 అవుతోంది. పైగా గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసేవాళ్లు ఒక్కో సిలిండర్‌కు రవాణా చార్జీ కింద రూ. 20 నుంచి రూ. 50 వరకు వసూలు చేస్తున్నారు. సింగిల్ సిలిండర్ ఉన్న కుటుంబాల్లో సిలిండర్ అయిపోతే.. నిండు బుడ్డీ కోసం ఇరుగుపొరుగు ఇళ్లకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఇన్ని కష్టాల మధ్య గ్యాస్ బుడ్డీ వాడుడు తమతో కాదంటూ చాలా మంది మూలన పడేస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో టీ కాయడానికి, కూర వండడానికి గ్యాస్ పొయ్యిని వాడుతూ, అన్నం వండడానికి, నీళ్లు కాగబెట్టుకోవడానికి కట్టెల పొయ్యిలనే వినియోగిస్తున్నారు. మరికొన్ని కుటుంబాలకైతే ఇప్పటికీ గ్యాస్ కనెక్షన్లు కూడా లేవు. దీపం పథకం కింద కనెక్షన్లు తీసుకోవడానికి చాలా మంది ముందుకు రావడం లేదు.
86 వేల కుటుంబాలకు..
జిల్లాలో 2,77,355 కుటుంబాలు (సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం) ఉండగా.. 1,90,742 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇంకా 86,613 కుటుంబాలకు కనెక్షన్లు లేవు. వారంతా కట్టెలపొయ్యిపైనే వంట చేసుకుంటున్నారు.
పేదల ఇళ్లలో మూలకే....
వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా గ్యాస్ కనెక్షన్లు పొందిన వారిలో చాలా మంది గ్యాస్ పొయ్యిలను వాడడం లేదు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గ్యాస్ పొయ్యిల వాడకం గురించి ప్రశ్నిస్తే ‘అన్ని పైసలు పెట్టి యాడికెళ్లి తెచ్చుకుంటాం సార్’ అన్న సమాధానం వస్తోంది. కొందరైతే గ్యాస్ సిలిండర్ కొనే తాహత్తు తమకు లేదంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన గ్యాస్ సిలిండర్లను చాలా మంది అమ్ముకున్నారు. కొందరు అటక ఎక్కించారు. వారి పేర్లపై కనెక్షన్లు కొనసాగుతున్నా.. వేరే వ్యక్తులు వాడుకుంటున్నట్టు స్పష్టమవుతోంది.
కట్టెలపొయ్యే నయ్యమున్నది
నాలుగు కట్టె పుల్లలు ఇరుసుకచ్చి పొయ్యికింద పెడితే వంట అయితది. గ్యాస్‌పొయ్యికి వందలకు వందలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటం. గందుకే గ్యాస్ పొయ్యిని మూలకు పెట్టినం. వానలు పడ్డప్పుడు మాత్రం గ్యాస్ పొయ్యిమీద వండుతం. లేకుంటే కట్టెలపొయ్యిమీదనే వంట అయితది. – సాయవ్వ, సోమార్‌పేట, ఎల్లారెడ్డి మండలం
Comments
Please login to add a commentAdd a comment