నగరం ఘటనలో 20 మంది మృతి
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో గెయిల్ గ్యాస్ పైప్లైన్ పేలిన ఘటనలో ఇప్పటివరకు 20 మంది మరణించారు. 19 మంది గాయపడ్డారు. క్షతగాత్రులలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం అమలాపురం కిమ్స్ నుంచి కాకినాడ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. మొత్తం 14 ఎకరాల పరిధిలో పేలుడు ప్రభావం ఉన్నట్లు తేల్చారు. కాగా, మరోవైపు నగరం ఘటనపై నేడు అఖిలపక్షం భేటీ కానుంది.
నగరం గ్రామాన్ని తాము దత్తత తీసుకుని దాన్ని మోడల్ విలేజ్గా మారుస్తామని ఇప్పటికే గెయిల్ ప్రకటించింది. అయితే, శ్మశానంలా మారిన గ్రామాన్ని ఏం చేస్తారని స్థానికులు మండిపడుతున్నారు. గ్రామం గుండా ఇప్పటికీ పైపులైన్లు వెళ్తున్నాయని, వాటిని పూర్తిగా మార్చడమో లేదా తీసేయడమో చేస్తే తప్ప ఇక్కడ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడదని వారు అంటున్నారు.