Gas pipeline blast
-
పేలిన గెయిల్ గ్యాస్ పైప్‌లైన్
సూర్యాపేట: ప్రమాదవశాత్తూ గెయిల్‌కు చెందిన గ్యాస్ పైప్‌లైన్ లీకవ్వడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం నల్లగొండ జిల్లా సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట గ్రామ సమీపంలో ని గెయిల్ పరిశ్రమలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... ఐదుగురు కూలీలు శనివారం గెయిల్ పైప్‌లను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ పైప్‌లకు ఉన్న ఫిన్ ఊడిపోవడంతో ఒక్కసారిగా గ్యాస్ పైకి ఎగిసిపడింది. దీంతో అక్కడున్న కూలీలు వెళ్లి గోడకు బలంగా ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిని హైదరాబాద్‌కు చెందిన రమేష్, రోషన్‌లుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన కుడకుడకు చెందిన వెంకన్నను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. మిగిలిన ఇద్దరు వ్యక్తులను స్థానిక మెట్రో ఆస్పత్రిలో చేర్పించగా వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరిద్దరిని సైతం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించనున్నారు. సంఘటనా స్థలాన్ని ఆర్డీవో శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. కాగా ఈ ప్రమాదం గురించి మాట్లాడేందుకు గెయిల్ అధికారులు ఎవరూ అందుబాటులో లేరు. -
గెయిల్ పైప్‌లైన్ మార్చడం కుదరదు
కోనసీమ ప్రాంతంలో ఇప్పుడున్న గెయిల్ పైప్‌లైన్ వ్యవస్థను మార్చడం కుదరదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. అయితే కొత్తగా వేసే పైప్లైన్లను మాత్రం జనావాసాలకు దూరంగా వేయాలని సూచించామన్నారు. బాధితులకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని గెయిల్‌కు తెలిపామని.. అలాగే, మృతుల కుటుంబాల్లో అర్హులకు గెయిల్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అన్నారు. గెయిల్ ప్రమాద ఘటనలో ఊహించని ప్రాణనష్టం జరిగిందని చినరాజప్ప చెప్పారు. పరిసర గ్రామాల్లో పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని గెయిల్‌ను ఆదేశించామన్నారు. ఇప్పుడున్న పైప్‌లైన్ కాలపరిమితి ముగిసిందని తాము భావిస్తున్నామని, ఈ విషయాన్ని తేల్చేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించామని, కమిటీ నుంచి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. -
నగరం ఘటనలో 20 మంది మృతి
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ పేలిన ఘటనలో ఇప్పటివరకు 20 మంది మరణించారు. 19 మంది గాయపడ్డారు. క్షతగాత్రులలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం అమలాపురం కిమ్స్ నుంచి కాకినాడ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. మొత్తం 14 ఎకరాల పరిధిలో పేలుడు ప్రభావం ఉన్నట్లు తేల్చారు. కాగా, మరోవైపు నగరం ఘటనపై నేడు అఖిలపక్షం భేటీ కానుంది. నగరం గ్రామాన్ని తాము దత్తత తీసుకుని దాన్ని మోడల్ విలేజ్‌గా మారుస్తామని ఇప్పటికే గెయిల్ ప్రకటించింది. అయితే, శ్మశానంలా మారిన గ్రామాన్ని ఏం చేస్తారని స్థానికులు మండిపడుతున్నారు. గ్రామం గుండా ఇప్పటికీ పైపులైన్లు వెళ్తున్నాయని, వాటిని పూర్తిగా మార్చడమో లేదా తీసేయడమో చేస్తే తప్ప ఇక్కడ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడదని వారు అంటున్నారు. -
కేజీ బేసిన్ ఓ మందుపాతరే..
దినదిన గండంగా కాలం వెళ్లదీస్తున్న ప్రజలు మొత్తం 900 కిలోమీటర్ల పైపులైన్లు ఏళ్లు గడుస్తున్నా మార్చని చమురు సంస్థలు అది 2012 జూలై 21వ తేదీ. ఉదయం 5 గంటలు. మలికిపురం మండలం శంకరగుప్తంలో ఉన్న అడవిపాలెం గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్(జీసీఎస్) ప్రాంతం. ఉదయం కొందరు నిద్రలేచి బయటకు వెళుతున్నారు. అదే సమయంలో సమీపంలో ఉన్న గ్యాస్ పైపులైన్ భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ఆ ప్రాంతమంతా గ్యాస్ వ్యాపించింది. తీవ్ర స్థాయిలో గ్యాస్ వాసనవస్తుంటే.. దీనిని గమనించిన ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను ఎత్తుకుని ఆ ప్రాంతం వదిలి పరుగులు తీసింది. పొయ్యి వెలిగంచొద్దంటూ అరుస్తూ.. అందరినీ అప్రమత్తం చేసింది. ఆమెతో పాటు అక్కడున్న కూలీనాలీ చేసుకునే వందలాది మంది సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. స్థానికంగా ఉన్న గెయిల్ అధికారులు తాపీగా వచ్చి అదుపు చేశారు. ఆ రోజు సాయంత్రం వరకు ఆ ప్రాంతంలో పొయ్యి వెలిగించడానికి కూడా స్థానికులు భయపడ్డారు. అప్పట్లో ప్రాణాపాయం తప్పింది. అదే పరిస్థితి గురువారం ఉదయం 5 గంటల సమయంలో మామిడికుదురు మండలం నగరం మినీ రిఫైనరీ ఎదుట చోటుచేసుకుంది. ఏం జరిగిందో తెలుసుకోక ముందే తల్లీబిడ్డలు మంటల్లో చిక్కుకుని బూడిదగా మారారు. సంఘటన ప్రదేశంలోనే 13 మంది సజీవ దహనమయ్యారు. కొంత మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఓఎన్జీసీ, గెయిల్ చరిత్రలో ఇది అతి భయంకర, చేదు దుర్ఘటన. మలికిపురం/అమలాపురం : తరచూ కేజీ బేసిన్లో జరుగుతున్న ప్రమాదాలు ప్రజలను కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. భూగర్భం నుంచి చమురు నిక్షేపాలను వెలికి తీస్తున్నామని గర్వంగా చెప్పుకొనే ఆయా సంస్థలు.. పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. మొత్తం 900 కిలోమీటర్లు కేజీ బేసిన్లో చమురు, సహజ వాయువులను ఓఎన్జీసీ, రిలయన్స్, రవ్వ జాయింట్ వెంచర్, ఆయిల్ ఇండియా తదితర సంస్థలు వెలికితీస్తున్నాయి. గ్యాస్, ముడిచమురును పైపులైన్ల ద్వారా రవాణాకు గెయిల్ వంటి సంస్థల ద్వారా ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. కోనసీమలో తీరం వెంబడి ఉన్న మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలాల్లో గ్యాస్ పైపులైన్లు విస్తరించి ఉన్నాయి. తీరప్రాంత మండలాలే కాకుండా అమలాపురం పట్టణంతో పాటు కోనసీమలోని అంబాజీపేట, అయినవిల్లి మండలాల్లో కూడా పైపులైన్లు ఉన్నాయి. అమలాపురం మీదుగా ఉన్న గ్యాస్ పైపులైన్ ప్రాంతంలో ఎన్నో ప్రధాన కట్టడాలు, కార్పొరేట్ స్కూళ్లు ఉన్నాయి. కేజీ బేసిన్లో మొత్తం 900 కిలోమీటర్ల మేరకు గ్యాస్ పైపులైన్లు విస్తరించి ఉన్నాయి. కోనసీమతో పాటు ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు వీటిని ఏర్పాటు చేశారు. నిర్వహణ లోపం గెయిల్ పైపులైన్లను తరచూ పరిశీలిస్తూ నిర్వహణ సక్రమంగా ఉండాలి. కేజీ బేసిన్లో ఈ పైపులైన్ల నిర్వహణ సక్రమంగా లేదు. వీటిలో ప్యూర్ గ్యాస్ మాత్రమే వెళ్లాలి. కానీ నీరు, క్రూ డాయిల్‌తో కూడిన గ్యాస్ సరఫరా అవుతోంది. దీంతో తక్కువ కాలానికే పాడైపోతున్నాయి. పూర్తి నిర్లక్ష్యం గ్యాస్ పైపులైన్లు పాడైపోతున్నా.. వాటిని మార్చాల్సిన గెయిల్‌తో పాటు ఇతర సంస్థలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గ్యాస్ అమ్మకాల ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నా.. ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నాయి మినహా మరమ్మతులను చేయించడం లేదు. పైపులైన్ల నిరా్మాణంలో నాణ్యత లోపం చాలా ఉంటోంది. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న పైపులైన్ల నిర్మాణంలో బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా, ఇష్టానుసారం కాంట్రాక్టులు ఇచ్చి, నాణ్యత లేని పైపులైన్లు వేయడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దోపిడీయే.. అభివృద్ధి శూన్యం ఆయిల్ నిక్షేపాలను తరలించుకుపోతున్న సంస్థలు ఈ ప్రాంత అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు కంటితుడుపుగానే ఉన్నాయి. కారు చౌకగా ప్రైవేటు సంస్థలకు గ్యాస్‌ను కేటాయిస్తున్నాయి. ఇక్కడ కనీసం రోడ్డు వేయడానికి నిధులు ఇవ్వరు. ఆ సంస్థ వాహనాలు తిరిగి పాడైపోతున్నా రోడ్లను ప్రభుత్వం వేయించాల్సి వస్తోంది. కుంగిన కోనసీమ ఓఎన్జీసీ, గెయిల్ కార్యకలాపాల వల్ల కోనసీమ మూడడుగులు కిందికి దిగిందని అధ్యయన బృందాలు ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జరిగిన సదస్సులో తేల్చాయి. దీంతో సముద్రం నుంచి ఉప్పునీరు భూభాగం పైకి వస్తోందని ఆ బృందం స్పష్టం చేసింది. తగ్గిన పంట దిగుబడులు ఆయిల్, గ్యాస్ వెలికితీత వల్ల కోనసీమలో వ్యవసాయ దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయని రైతులు, వ్యవసాయ నిపుణులు తేల్చారు. ఇవి అపోహలంటూ భౌగోళిక శాస్త్రవేత్తలమంటూ కొందరు సదస్సులు పెట్టి ఆ సంస్థకు వత్తాసు పలుకుతున్నారు. కక్కుర్తి పడేది నాయకులే.. ఓఎన్జీసీ, గెయిల్ చర్యలకు వ్యతిరేకంగా ఇప్పటివరకు కొంత మంది రాజకీయ నాయకులు అనేక పోరాటాలు చేశారు. ప్రజలు ఉద్యమాలు చేసినా.. నాయకులు ప్రవేశించి నీరు గార్చేశారు. చిల్లర పైసలకు కక్కుర్తి పడి నాయకులు.. ప్రజా ఉద్యమాలను అణగదొక్కించిన సంఘటనలు కోనసీమలో అనేకం ఉన్నాయి. -
అండగా ఉంటా...
-
మీడియా ఉండబట్టే కదా రెచ్చిపోతున్నారు: మురళీమోహన్
నగరం గ్యాస్ పైపులైన్ పేలుడు బాధితులను పరామర్శించేందుకు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చిన రాజమండ్రి ఎంపీ మురళీమోహన్.. ఆ బాధితులపైనే మండిపడ్డారు. ''మీడియా ఉండబట్టే కదా మీరింతగా రెచ్చిపోతున్నారు.. మీడియా ముందు వద్దు, లోపలకు రండి మాట్లాడుకుందాం. అన్నీ ఇచ్చాం కదా, అయినా ఏమీ సాయం అందలేదని అంటారెందుకు'' అంటూ బాధితుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి సాయం అందలేదని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, చుట్టపుచూపుగా వచ్చి పలకరించినంత మాత్రాన ఏమీ అయిపోదని కొంతమంది బాధితులు ఎంపీ మురళీమోహన్ను కాకినాడ ఆస్పత్రిలో నిలదీశారు. తమ బతుకులు బుగ్గి అయిపోయాయని, కొబ్బరిచెట్లు మొత్తం కాలిపోయాయని, ఇళ్లు ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయని, అయినా ఎవరూ ఆదుకోలేదని అన్నారు. దాంతో మురళీమోహన్‌కు ఎక్కడలేని కోపం వచ్చింది. ''అన్నీ చేస్తున్నా.. ఏమీ ఇవ్వట్లేదని ఎందుకు అంటారు? డబ్బులు ఇచ్చాం కదా.. ఏ ప్రభుత్వానివైనా డబ్బులు డబ్బులే'' అన్నారు. అంతేకాదు, మీడియా ముందు మాట్లాడొద్దని.. అన్ని విషయాలు లోపలకు వెళ్లి మాట్లాడుకుందామని అన్నారు. ఇంకా ఏదో అడగబోతుంటే.. మీడియా ఉండబట్టే కదా మీరింతగా రెచ్చిపోతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలువ నీడ కూడా లేకుండా పోయిన తమవాళ్లను ఎవరూ పట్టించుకోవట్లేదని, కనీస సాయం కూడా అందించలేదని మరికొందరు మహిళలు ఆయన దృష్టికి తీసుకురాగా, అందరినీ సొంతమనుషుల్లా అనుకుని వాళ్లను కూడా మీరే చూసుకోవాలని చెప్పారు. -
'మీడియా ఉండబట్టే కదా రెచ్చిపోతున్నారు'
-
బాధ్యులపై కఠిన చర్యలు: చంద్రబాబు
నగరం: ఎన్ఎఫ్సీఎల్, జీఎఫ్సీఎల్, ల్యాంకో లాంటి పరిశ్రమలకు గ్యాస్‌ను సరఫరా చేసేందుకు గ్యాస్ కలెక్షన్ స్టేషన్ నుంచి వెళ్లే ప్రధానమైన ట్రంకుపైపులైను మామిడికుదురు మండలం నగరం వద్ద పేలిన దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాల పిల్లలకు టెన్త్ వరకు ఉచిత విద్యను అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు అన్నారు. కమిటీ సమర్పించే తుదినివేదిక ఆధారంగా ఈ ప్రమాదానికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు మీడియాతో అన్నారు. నగరం గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా గెయిల్ తీర్చిదిద్దుతుందని, మృతుల కుటుంబాల పేరుపై 5 లక్షల రూపాయల సబ్సిడీ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.