
మీడియా ఉండబట్టే కదా రెచ్చిపోతున్నారు: మురళీమోహన్
నగరం గ్యాస్ పైపులైన్ పేలుడు బాధితులను పరామర్శించేందుకు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చిన రాజమండ్రి ఎంపీ మురళీమోహన్.. ఆ బాధితులపైనే మండిపడ్డారు. ''మీడియా ఉండబట్టే కదా మీరింతగా రెచ్చిపోతున్నారు.. మీడియా ముందు వద్దు, లోపలకు రండి మాట్లాడుకుందాం. అన్నీ ఇచ్చాం కదా, అయినా ఏమీ సాయం అందలేదని అంటారెందుకు'' అంటూ బాధితుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి సాయం అందలేదని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, చుట్టపుచూపుగా వచ్చి పలకరించినంత మాత్రాన ఏమీ అయిపోదని కొంతమంది బాధితులు ఎంపీ మురళీమోహన్ను కాకినాడ ఆస్పత్రిలో నిలదీశారు.
తమ బతుకులు బుగ్గి అయిపోయాయని, కొబ్బరిచెట్లు మొత్తం కాలిపోయాయని, ఇళ్లు ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయని, అయినా ఎవరూ ఆదుకోలేదని అన్నారు. దాంతో మురళీమోహన్కు ఎక్కడలేని కోపం వచ్చింది. ''అన్నీ చేస్తున్నా.. ఏమీ ఇవ్వట్లేదని ఎందుకు అంటారు? డబ్బులు ఇచ్చాం కదా.. ఏ ప్రభుత్వానివైనా డబ్బులు డబ్బులే'' అన్నారు. అంతేకాదు, మీడియా ముందు మాట్లాడొద్దని.. అన్ని విషయాలు లోపలకు వెళ్లి మాట్లాడుకుందామని అన్నారు. ఇంకా ఏదో అడగబోతుంటే.. మీడియా ఉండబట్టే కదా మీరింతగా రెచ్చిపోతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలువ నీడ కూడా లేకుండా పోయిన తమవాళ్లను ఎవరూ పట్టించుకోవట్లేదని, కనీస సాయం కూడా అందించలేదని మరికొందరు మహిళలు ఆయన దృష్టికి తీసుకురాగా, అందరినీ సొంతమనుషుల్లా అనుకుని వాళ్లను కూడా మీరే చూసుకోవాలని చెప్పారు.