కేజీ బేసిన్ ఓ మందుపాతరే.. | KG Basin - It's like a Landmine | Sakshi
Sakshi News home page

కేజీ బేసిన్ ఓ మందుపాతరే..

Published Sun, Jun 29 2014 1:49 PM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

కేజీ బేసిన్ ఓ మందుపాతరే..

కేజీ బేసిన్ ఓ మందుపాతరే..

  • దినదిన గండంగా కాలం వెళ్లదీస్తున్న ప్రజలు 
  •   మొత్తం 900 కిలోమీటర్ల పైపులైన్లు 
  •   ఏళ్లు గడుస్తున్నా మార్చని చమురు సంస్థలు
  •  
     అది 2012 జూలై 21వ తేదీ. ఉదయం 5 గంటలు. మలికిపురం మండలం శంకరగుప్తంలో ఉన్న అడవిపాలెం గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్(జీసీఎస్) ప్రాంతం. ఉదయం కొందరు నిద్రలేచి బయటకు వెళుతున్నారు. అదే సమయంలో సమీపంలో ఉన్న గ్యాస్ పైపులైన్ భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది.  ఆ ప్రాంతమంతా గ్యాస్ వ్యాపించింది. తీవ్ర స్థాయిలో గ్యాస్ వాసనవస్తుంటే.. దీనిని గమనించిన ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను ఎత్తుకుని ఆ ప్రాంతం వదిలి పరుగులు తీసింది. పొయ్యి వెలిగంచొద్దంటూ అరుస్తూ.. అందరినీ అప్రమత్తం చేసింది. ఆమెతో పాటు అక్కడున్న కూలీనాలీ చేసుకునే వందలాది మంది సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. స్థానికంగా ఉన్న గెయిల్ అధికారులు తాపీగా వచ్చి  అదుపు చేశారు. ఆ రోజు సాయంత్రం వరకు ఆ ప్రాంతంలో పొయ్యి వెలిగించడానికి కూడా స్థానికులు భయపడ్డారు. అప్పట్లో ప్రాణాపాయం తప్పింది. అదే పరిస్థితి గురువారం ఉదయం 5 గంటల సమయంలో మామిడికుదురు మండలం నగరం మినీ రిఫైనరీ ఎదుట చోటుచేసుకుంది. ఏం జరిగిందో తెలుసుకోక ముందే తల్లీబిడ్డలు మంటల్లో చిక్కుకుని బూడిదగా మారారు. సంఘటన ప్రదేశంలోనే 13 మంది సజీవ దహనమయ్యారు. కొంత మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఓఎన్‌జీసీ, గెయిల్ చరిత్రలో ఇది అతి భయంకర, చేదు దుర్ఘటన.
     
     మలికిపురం/అమలాపురం :
     తరచూ కేజీ బేసిన్‌లో జరుగుతున్న ప్రమాదాలు ప్రజలను కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. భూగర్భం నుంచి చమురు నిక్షేపాలను వెలికి తీస్తున్నామని గర్వంగా చెప్పుకొనే ఆయా సంస్థలు.. పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. 
     
     మొత్తం 900 కిలోమీటర్లు
     కేజీ బేసిన్‌లో చమురు, సహజ వాయువులను ఓఎన్‌జీసీ, రిలయన్స్, రవ్వ జాయింట్ వెంచర్, ఆయిల్ ఇండియా తదితర సంస్థలు వెలికితీస్తున్నాయి. గ్యాస్, ముడిచమురును పైపులైన్ల ద్వారా రవాణాకు గెయిల్ వంటి సంస్థల ద్వారా ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. కోనసీమలో తీరం వెంబడి ఉన్న మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలాల్లో గ్యాస్ పైపులైన్లు విస్తరించి ఉన్నాయి. తీరప్రాంత మండలాలే కాకుండా అమలాపురం పట్టణంతో పాటు కోనసీమలోని అంబాజీపేట, అయినవిల్లి మండలాల్లో కూడా పైపులైన్లు ఉన్నాయి. అమలాపురం మీదుగా ఉన్న గ్యాస్ పైపులైన్ ప్రాంతంలో ఎన్నో ప్రధాన కట్టడాలు, కార్పొరేట్ స్కూళ్లు ఉన్నాయి. కేజీ బేసిన్‌లో మొత్తం 900 కిలోమీటర్ల మేరకు గ్యాస్ పైపులైన్లు విస్తరించి ఉన్నాయి. కోనసీమతో పాటు  ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు వీటిని ఏర్పాటు చేశారు.
     
     నిర్వహణ లోపం
     గెయిల్ పైపులైన్లను తరచూ పరిశీలిస్తూ నిర్వహణ సక్రమంగా ఉండాలి. కేజీ బేసిన్‌లో ఈ పైపులైన్ల నిర్వహణ సక్రమంగా లేదు. వీటిలో ప్యూర్ గ్యాస్ మాత్రమే వెళ్లాలి. కానీ నీరు, క్రూ డాయిల్‌తో కూడిన గ్యాస్ సరఫరా అవుతోంది. దీంతో తక్కువ కాలానికే పాడైపోతున్నాయి.
     
     పూర్తి నిర్లక్ష్యం
     గ్యాస్ పైపులైన్లు పాడైపోతున్నా.. వాటిని మార్చాల్సిన గెయిల్‌తో పాటు ఇతర సంస్థలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గ్యాస్ అమ్మకాల ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నా.. ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నాయి మినహా మరమ్మతులను చేయించడం లేదు. పైపులైన్ల నిరా్మాణంలో నాణ్యత లోపం చాలా ఉంటోంది. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న పైపులైన్ల నిర్మాణంలో బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా, ఇష్టానుసారం కాంట్రాక్టులు ఇచ్చి, నాణ్యత లేని పైపులైన్లు వేయడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
     
     దోపిడీయే.. అభివృద్ధి శూన్యం
     ఆయిల్ నిక్షేపాలను తరలించుకుపోతున్న సంస్థలు ఈ ప్రాంత అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు కంటితుడుపుగానే ఉన్నాయి. కారు చౌకగా ప్రైవేటు సంస్థలకు గ్యాస్‌ను కేటాయిస్తున్నాయి. ఇక్కడ కనీసం రోడ్డు వేయడానికి నిధులు ఇవ్వరు. ఆ సంస్థ వాహనాలు తిరిగి పాడైపోతున్నా రోడ్లను ప్రభుత్వం వేయించాల్సి వస్తోంది.
     
     కుంగిన కోనసీమ
     ఓఎన్‌జీసీ, గెయిల్ కార్యకలాపాల వల్ల కోనసీమ మూడడుగులు కిందికి దిగిందని అధ్యయన బృందాలు ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జరిగిన సదస్సులో తేల్చాయి. దీంతో సముద్రం నుంచి ఉప్పునీరు భూభాగం పైకి వస్తోందని ఆ బృందం స్పష్టం చేసింది.
     
     తగ్గిన పంట దిగుబడులు
     ఆయిల్, గ్యాస్ వెలికితీత వల్ల కోనసీమలో వ్యవసాయ దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయని రైతులు, వ్యవసాయ నిపుణులు తేల్చారు. ఇవి అపోహలంటూ భౌగోళిక శాస్త్రవేత్తలమంటూ కొందరు సదస్సులు పెట్టి ఆ సంస్థకు వత్తాసు పలుకుతున్నారు.
     
     కక్కుర్తి పడేది నాయకులే..
     ఓఎన్‌జీసీ, గెయిల్ చర్యలకు వ్యతిరేకంగా ఇప్పటివరకు కొంత మంది రాజకీయ నాయకులు అనేక పోరాటాలు చేశారు. ప్రజలు ఉద్యమాలు చేసినా.. నాయకులు ప్రవేశించి నీరు గార్చేశారు. చిల్లర పైసలకు కక్కుర్తి పడి నాయకులు.. ప్రజా ఉద్యమాలను అణగదొక్కించిన సంఘటనలు కోనసీమలో అనేకం ఉన్నాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement