land mine
-
పాలెం ప్రాజెక్టు సమీపంలో ల్యాండ్‌మైన్
► గుర్తించిన ‘ఉపాధి’ కూలీలు ► పోలీసులకు సమాచారం వెంకటాపురం (భద్రాచలం): జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండల పరిధి మల్లాపురం సమీప పాలెం ప్రాజెక్టు వద్ద శనివారం ల్యాండ్‌మైన్ బయటపడింది. అటవీ ప్రాంతంలో కందకాలు తవ్వేందుకు ఉపాధి హామీ కూలీలు ఉదయం పనులు చేపట్టారు. కొందరు కూలీలు కొప్పుగుట్ట సమీప అటవీప్రాంతంలో మూత్రవిసర్జనకు వెళ్లగా... కాళ్లకు కరెంట్ వైర్లు తగలడంతో వాటిని పరిశీలించారు. వైర్లు రోడ్డు మీద తవ్విన గుంత వరకు ఉండడాన్ని గమనించి భయంతో అదే ప్రాంతంలో పనిచేస్తున్న మిగతా కూలీలకు విషయం చెప్పారు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని ల్యాండ్‌మైన్ గా గుర్తించారు. బాంబు స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు చేయించనున్నారు. -
ల్యాండ్‌మైన్ నిర్వీర్యం..తప్పిన ముప్పు
రాయిపూర్(ఛత్తీస్‌గఢ్): ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లాలో శనివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో భద్రతా బలగాలు ఒక మావోయిస్టును అరెస్టు చేయటంతోపాటు మందుపాతరను వెలికి తీశారు. మారేడుబాక అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుపుతున్న భద్రతా బలగాలకు భండారి రామ్మూర్తి(24) అనే మావోయిస్టు పట్టుబడ్డాడు. ఉసూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2015లో పోలీసులపై జరిపిన కాల్పుల ఘటనలో రామ్మూర్తి కూడా సభ్యుడని విచారణలో తేలింది. సర్కేగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన అమర్చిన ఐదు కిలోల ఐఈడీని బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ గుర్తించి వెలికి తీసింది. పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు దీనిని అమర్చి ఉంటారని భావిస్తున్నారు. -
మందుపాతరను తొలగించిన పోలీసులు
చింతూరు : తూర్పుగోదావరి జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరను పోలీసులు నిర్వీర్యం చేశారు. దీంతో పెద్దప్రమాదం తప్పినట్లైంది. చింతూరు మండలం సరివేల గ్రామ సమీపంలో జాతీయరహదారిపై మావోయిస్టులు గురువారం రాత్రి ఈ మందుపాతరను అమర్చి ఉంటారని భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం తనిఖీలు చేపట్టిన పోలీసులు మందుపాతరను గుర్తించి వెలికితీసి, నిర్వీర్యం చేశారు. అదేవిధంగా సంఘటన స్థలంలో పీఎల్జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని ఉన్న కరపత్రాలను తొలగించారు. ముందు జాగ్రత్తగా ఆ మార్గంలో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. -
చర్ల అటవీ ప్రాంతంలో పేలిన మందుపాతర
చర్ల(ఖమ్మం): ఖమ్మం జిల్లా చర్ల అటవీ ప్రాంతంలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఖమ్మం-ఛత్తిస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టుల పోస్టర్లు ఏర్పాటు చేసిన ప్రాంతంలో మందుపాతర పేలడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా మావోయిస్టులు ఈరోజు తెలంగాణ బంద్‌ను పాటిస్తున్నారు. ఇందులో భాగంగా చెర్ల అటవీ ప్రాంతంలో బంద్ పోస్టర్లు ఏర్పాటు చేసిన చోట టిఫిన్ బాక్స్ బాంబ్ పేల్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఐదేళ్ల కిందటి ల్యాండ్ మైన్ వెలికితీత
భరంపూర్: ఒడిశాలో ఐదేళ్ల కిందటి శక్తిమంతమైన మందుపాతరను భద్రతా బలగాలు వెలికి తీశాయి. అనంతరం నిర్వీర్యం చేశాయి. అది ఒక వేళ పేలిపోయి ఉంటే భారీ స్థాయిలో ప్రాణనష్టం చోటుచేసుకొని ఉండేదని పోలీసులు తెలిపారు. ఒడిశాలో మావోయిస్టుల ఏరి వేత చర్యల్లో భాగంగా గజపతి జిల్లాలో పానిగండా అనే గ్రామంలో పోలీసులు, ప్రత్యేక బలగాలు కలిసి కూంబింగ్ నిర్వహిస్తుండగా ఓ శక్తిమంతమైన ల్యాండ్ మైన్ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం జాగ్రత్తగా దానిని వెలికి తీసి పరిశీలించగా ఐదేళ్ల కిందటే మావోయిస్టులు దానిని పాతి పెట్టి ఉంచారనే అంఛనాకు వచ్చారు. దీనిని గుర్తించిన అనంతరం మరింత అప్రమత్తమైన బలగాలు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో మరింత విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. -
కశ్మీర్ లో పేలుళ్లు..!
జమ్మూ: జమ్ము-కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో మందు పాతర పేలి ఒకరికి గాయాలయ్యాయి. పూంచ్ జిల్లాలోని బాగియాల్ దారా వద్ద బుధవారం ఉదయం మహమ్మద్ బషీర్ అనే వ్యక్తి నడుచుకుంటూ వెళుతుండగా.. మందు పాతరపై కాలు పెట్టడంతో ఒక్కసారిగా అవి పేలాయి. ఈ ఘటనలో గాయపడ్డ అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఛత్తీస్‌గఢ్‌లో పాలమూరు జవాన్ మృతి
ల్యాండ్‌మైన్ పేలుడుతో ఘటన మహబూబ్‌నగర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని దాస్‌గూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ల్యాండ్‌మైన్‌కు పాలమూరు జిల్లాకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ మృత్యువాత పడ్డాడు. కోయిలకొండ మండలం సంగనోనిపల్లి గ్రామానికి చెందిన గోవర్దన్‌రెడ్డి (28) రెండేళ్ల కిందట సీఆర్పీఎఫ్ దళంలో చేరాడు. ఆదివారం అక్కడ ప్రారంభించబోయే రోడ్డును శనివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఆర్ఓపీ (రోడ్డు ఆపరేషన్ పార్టీ) జవాన్లు తనిఖీలు నిర్వహిస్తుండగా సమీపంలోని కల్వర్ట్ కింద గతంలో మావోయిస్టులు అమర్చిన ల్యాండ్‌మైన్ పేలింది. అదే బృందంలో ఉన్న గోవర్దన్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. సహచర జవాన్లు అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. బెటాలియన్ అధికారులు ఆయన మృతదేహాన్న్ని రాయగఢ్‌కు తరలించి ఆదివారం రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు పంపించారు. సోమవారం స్వగ్రామంలో గోవర్దన్‌రెడ్డికి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి. -
కేజీ బేసిన్ ఓ మందుపాతరే..
దినదిన గండంగా కాలం వెళ్లదీస్తున్న ప్రజలు మొత్తం 900 కిలోమీటర్ల పైపులైన్లు ఏళ్లు గడుస్తున్నా మార్చని చమురు సంస్థలు అది 2012 జూలై 21వ తేదీ. ఉదయం 5 గంటలు. మలికిపురం మండలం శంకరగుప్తంలో ఉన్న అడవిపాలెం గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్(జీసీఎస్) ప్రాంతం. ఉదయం కొందరు నిద్రలేచి బయటకు వెళుతున్నారు. అదే సమయంలో సమీపంలో ఉన్న గ్యాస్ పైపులైన్ భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ఆ ప్రాంతమంతా గ్యాస్ వ్యాపించింది. తీవ్ర స్థాయిలో గ్యాస్ వాసనవస్తుంటే.. దీనిని గమనించిన ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను ఎత్తుకుని ఆ ప్రాంతం వదిలి పరుగులు తీసింది. పొయ్యి వెలిగంచొద్దంటూ అరుస్తూ.. అందరినీ అప్రమత్తం చేసింది. ఆమెతో పాటు అక్కడున్న కూలీనాలీ చేసుకునే వందలాది మంది సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. స్థానికంగా ఉన్న గెయిల్ అధికారులు తాపీగా వచ్చి అదుపు చేశారు. ఆ రోజు సాయంత్రం వరకు ఆ ప్రాంతంలో పొయ్యి వెలిగించడానికి కూడా స్థానికులు భయపడ్డారు. అప్పట్లో ప్రాణాపాయం తప్పింది. అదే పరిస్థితి గురువారం ఉదయం 5 గంటల సమయంలో మామిడికుదురు మండలం నగరం మినీ రిఫైనరీ ఎదుట చోటుచేసుకుంది. ఏం జరిగిందో తెలుసుకోక ముందే తల్లీబిడ్డలు మంటల్లో చిక్కుకుని బూడిదగా మారారు. సంఘటన ప్రదేశంలోనే 13 మంది సజీవ దహనమయ్యారు. కొంత మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఓఎన్జీసీ, గెయిల్ చరిత్రలో ఇది అతి భయంకర, చేదు దుర్ఘటన. మలికిపురం/అమలాపురం : తరచూ కేజీ బేసిన్లో జరుగుతున్న ప్రమాదాలు ప్రజలను కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. భూగర్భం నుంచి చమురు నిక్షేపాలను వెలికి తీస్తున్నామని గర్వంగా చెప్పుకొనే ఆయా సంస్థలు.. పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. మొత్తం 900 కిలోమీటర్లు కేజీ బేసిన్లో చమురు, సహజ వాయువులను ఓఎన్జీసీ, రిలయన్స్, రవ్వ జాయింట్ వెంచర్, ఆయిల్ ఇండియా తదితర సంస్థలు వెలికితీస్తున్నాయి. గ్యాస్, ముడిచమురును పైపులైన్ల ద్వారా రవాణాకు గెయిల్ వంటి సంస్థల ద్వారా ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. కోనసీమలో తీరం వెంబడి ఉన్న మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలాల్లో గ్యాస్ పైపులైన్లు విస్తరించి ఉన్నాయి. తీరప్రాంత మండలాలే కాకుండా అమలాపురం పట్టణంతో పాటు కోనసీమలోని అంబాజీపేట, అయినవిల్లి మండలాల్లో కూడా పైపులైన్లు ఉన్నాయి. అమలాపురం మీదుగా ఉన్న గ్యాస్ పైపులైన్ ప్రాంతంలో ఎన్నో ప్రధాన కట్టడాలు, కార్పొరేట్ స్కూళ్లు ఉన్నాయి. కేజీ బేసిన్లో మొత్తం 900 కిలోమీటర్ల మేరకు గ్యాస్ పైపులైన్లు విస్తరించి ఉన్నాయి. కోనసీమతో పాటు ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు వీటిని ఏర్పాటు చేశారు. నిర్వహణ లోపం గెయిల్ పైపులైన్లను తరచూ పరిశీలిస్తూ నిర్వహణ సక్రమంగా ఉండాలి. కేజీ బేసిన్లో ఈ పైపులైన్ల నిర్వహణ సక్రమంగా లేదు. వీటిలో ప్యూర్ గ్యాస్ మాత్రమే వెళ్లాలి. కానీ నీరు, క్రూ డాయిల్‌తో కూడిన గ్యాస్ సరఫరా అవుతోంది. దీంతో తక్కువ కాలానికే పాడైపోతున్నాయి. పూర్తి నిర్లక్ష్యం గ్యాస్ పైపులైన్లు పాడైపోతున్నా.. వాటిని మార్చాల్సిన గెయిల్‌తో పాటు ఇతర సంస్థలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గ్యాస్ అమ్మకాల ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నా.. ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నాయి మినహా మరమ్మతులను చేయించడం లేదు. పైపులైన్ల నిరా్మాణంలో నాణ్యత లోపం చాలా ఉంటోంది. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న పైపులైన్ల నిర్మాణంలో బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా, ఇష్టానుసారం కాంట్రాక్టులు ఇచ్చి, నాణ్యత లేని పైపులైన్లు వేయడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దోపిడీయే.. అభివృద్ధి శూన్యం ఆయిల్ నిక్షేపాలను తరలించుకుపోతున్న సంస్థలు ఈ ప్రాంత అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు కంటితుడుపుగానే ఉన్నాయి. కారు చౌకగా ప్రైవేటు సంస్థలకు గ్యాస్‌ను కేటాయిస్తున్నాయి. ఇక్కడ కనీసం రోడ్డు వేయడానికి నిధులు ఇవ్వరు. ఆ సంస్థ వాహనాలు తిరిగి పాడైపోతున్నా రోడ్లను ప్రభుత్వం వేయించాల్సి వస్తోంది. కుంగిన కోనసీమ ఓఎన్జీసీ, గెయిల్ కార్యకలాపాల వల్ల కోనసీమ మూడడుగులు కిందికి దిగిందని అధ్యయన బృందాలు ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జరిగిన సదస్సులో తేల్చాయి. దీంతో సముద్రం నుంచి ఉప్పునీరు భూభాగం పైకి వస్తోందని ఆ బృందం స్పష్టం చేసింది. తగ్గిన పంట దిగుబడులు ఆయిల్, గ్యాస్ వెలికితీత వల్ల కోనసీమలో వ్యవసాయ దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయని రైతులు, వ్యవసాయ నిపుణులు తేల్చారు. ఇవి అపోహలంటూ భౌగోళిక శాస్త్రవేత్తలమంటూ కొందరు సదస్సులు పెట్టి ఆ సంస్థకు వత్తాసు పలుకుతున్నారు. కక్కుర్తి పడేది నాయకులే.. ఓఎన్జీసీ, గెయిల్ చర్యలకు వ్యతిరేకంగా ఇప్పటివరకు కొంత మంది రాజకీయ నాయకులు అనేక పోరాటాలు చేశారు. ప్రజలు ఉద్యమాలు చేసినా.. నాయకులు ప్రవేశించి నీరు గార్చేశారు. చిల్లర పైసలకు కక్కుర్తి పడి నాయకులు.. ప్రజా ఉద్యమాలను అణగదొక్కించిన సంఘటనలు కోనసీమలో అనేకం ఉన్నాయి.