అనంతపురం: అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాలకు చెందిన దాదాపు 70 మంది వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అనంతరం వారిని ఇటుకుల పల్లి, అత్మకూరు, కనగానపల్లె పోలీసు స్టేషన్లుకు తరలించారు. అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మార్వో కార్యాలయంలో ఇటీవల వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాదరెడ్డి దారుణ హత్యకు గురైయ్యారు.
దీంతో ఆగ్రహించిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఎమ్మార్వో కార్యాలయంపై దాడి చేసి... ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అందులోభాగంగా అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాల్లోని వైఎస్ఆర్ సీపీ మద్దతుదారుల ఇళ్లలో పోలీసులు శుక్రవారం అర్థరాత్రి నుంచి సోదాలు కొనసాగిస్తున్నారు.
అయితే ప్రసాద్ రెడ్డి హత్య కేసులో పలువురు అధికారులను వీఆర్ పై పంపడంపై రాప్తాడు ఎమ్మెల్యే, పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటా సునీత ఆగ్రహించారు. దీంతో తనకు ప్రభుత్వం కేటాయించిన భద్రత సిబ్బందిని వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో వారు ఉన్నతాధికారులకు విషయాన్ని వెల్లడించారు. దాంతో పోలీసులు ఆగమేఘాల మీద రంగంలోకి దిగి... వైఎస్ఆర్ పీసీ మద్దత దారుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించి అరెస్ట్ చేయడం గమనార్హం.