హామీలు.. తూచ్ | 2014-15 budget, women, unemployed people, full of disappointment | Sakshi
Sakshi News home page

హామీలు.. తూచ్

Published Thu, Aug 21 2014 12:53 AM | Last Updated on Mon, Aug 27 2018 8:44 PM

హామీలు.. తూచ్ - Sakshi

హామీలు.. తూచ్

చంద్రబాబు సర్కారు గిమ్మిక్కు
 
హైదరాబాద్: ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఉత్తిత్తి వాగ్దానాలుగానే మిగిలిపోయాయి. రెండున్నర నెలలుగా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి, డ్వాక్రా మహిళలకు బడ్జెట్‌లో మొండి చెయ్యి చూపారు. 2014-15లో మిగిలిన ఆర్థిక సంవత్సరానికి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం శాసనసభకు సమర్పించిన బడ్జెట్.. రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులకు పూర్తి నిరాశ మిగిల్చింది. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలను గుప్పించిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో.. ఆ హామీలను నెరవేర్చడానికి బడ్జెట్‌లో భారీ కేటాయింపులుంటాయని ప్రజలు ఆశించారు. కానీ.. సర్కారు వారు కొన్ని హామీలను అసలు బడ్జెట్‌లో ప్రస్తావన కూడా చేయకుండా విస్మరిస్తే.. మరికొన్నింటికి అరకొర విదిలింపులతో సరిపుచ్చారు.

లక్ష కోట్ల రుణాల మాఫీకి రూ. 5 వేల కోట్లే!

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 87,617 కోట్ల రూపాయల మేరకు వ్యవసాయ రుణాలున్నాయని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) నివేదిక వెల్లడిస్తోంది. రూ. 14,204 కోట్ల మహిళా సంఘాల రుణాలతో కలిపి రూ.1,01,821 కోట్ల రుణాలున్నాయి. వీటన్నింటినీ మాఫీ చేస్తానని బాబు ఎన్నికలకు ముందు పదేపదే హామీలు గుప్పించారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ.. ఈ రుణాలన్నీ మాఫీ అవుతాయని అటు రైతాంగం, ఇటు మహిళా సంఘాలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాయి. కానీ.. తాజా బడ్జెట్‌లో అసలు మహిళా సంఘాల రుణాల మాఫీ అంశాన్ని కనీసం ప్రస్తావించను కూడా లేదు. పంట రుణాల మాఫీకి కట్టుబడి ఉన్నాం.. శాయశక్తులా కృషి చేస్తున్నాం.. అంటూనే నామ మాత్రంగా రూ. 5,000 కోట్లు (ప్రణాళిక పద్దులో రూ. 4,000 కోట్లు, ప్రణాళికేతర పద్దు కింద రూ. 1,000 కోట్లు) మాత్రమే బడ్జెట్‌లో కేటాయించారు. కానీ.. ఇప్పటికే రైతు, మహిళా సంఘాల రుణాలు చెల్లించాల్సిన గడువు దాటిపోయింది. రుణ మాఫీపై ఆశలు పెట్టుకున్న రైతులు, మహిళా సంఘాలు ఆ రుణాలను తిరిగి చెల్లించకపోవటంతో.. ఆ రుణాలపై గతేడాదికి 13 శాతం వడ్డీ పడింది. ఈ ఏడాదికి మరో 13 శాతం వడ్డీ భారం పడనుంది. అంటే లక్ష కోట్ల రుణాలకు ఏడాదికి రూ.13,000 కోట్ల చొప్పున రెండేళ్లకు కలిపి 26,000 కోట్లు కేవలం వడ్డీయే చెల్లించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో బడ్జెట్‌లో కేవలం రూ. 5,000 కోట్లు కేటాయించడం చూసి రైతాంగం, మహిళా సంఘాలు విస్తుపోతున్నాయి. ఇదే లెక్కన ప్రతీ ఏడాది బడ్జెట్‌లో రుణ మాఫీకి రూ. 5,000 కోట్లు చొప్పున కేటాయించినా 25 సంవత్సరాలకు గానీ రైతులు, డ్వాక్రా మహిళలు రుణ విముక్తులు కాలేరు.

 రైతులు, డ్వాక్రా సంఘాల వడ్డీలేని రుణాలకు అరకొరగా కేటాయింపులు చేశారు. ఇందుకోసం ఎంత తక్కువగా అంచనా వేసినా రూ. 1,500 కోట్లు అవసరమవుతాయి. కానీ.. బడ్జెట్‌లో కేవలం రూ. 599 కోట్లు కేటాయించారు. మరోపక్క రైతులకు పావలా వడ్డీ పథకం కింద బడ్జెట్‌లో రూ. 18 కోట్ల కేటాయింపుతో సరిపుచ్చారు.

ఉద్యోగ కల్పనా లేదు.. భృతి ఊసూ లేదు..!

యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు బడ్జెట్‌లో మాత్రం గ్రామీణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వీలుగా శిక్షణ ఇచ్చేందుకు కేవలం రూ. 25 కోట్లు చూపారు. దీనికి ‘ఆంధ్రా యువశక్తి’ అని నామకరణం చేశారు. అన్ని వర్గాల యువతకు యువ కిరణాలు పేరిట శిక్షణ ఇచ్చేందుకు రూ. 55.16 కోట్లు కేటాయించారు.

 ఉద్యోగం కల్పించకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికల ముందు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచినప్పటికీ.. బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి ఊసేలేదు. వాస్తవానికి రాష్ట్రంలో కోటిన్నర కుటుంబాలు ఉంటే.. కుటుంబానికి ఒకొక్కరు చొప్పున లెక్కవేసుకున్నా కోటిన్నర మంది నిరుద్యోగ యువత ఉం టుందని నిపుణుల అంచనా. ఎన్నికల హామీ ప్రకా రం ఒక్కొక్కరికి నెలకు రూ. 2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే ఏటా రూ. 36,000 కోట్లు అవసరం. కానీ.. బడ్జెట్‌లో ఈ నిరుద్యోగ భృతి కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.
  కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్యను అందిస్తామని చంద్రబాబు, టీడీపీలు ఎన్నికలకు ముందు ఘనమైన హామీలు ఇచ్చాయి. కానీ.. తీరా బడ్జెట్‌లో ఆ ఊసు కూడా లేకుండా చేశారు. పైగా విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు గత బకాయిలతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 3,500 కోట్లు అవసరం కాగా.. కేటాయింపులు మాత్రం రూ. 2,040 కోట్లతో సరిపుచ్చారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పింఛన్లను పెంచుతానని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఏడు నెలలకు పెంపు కోసం రూ. 3,080 కోట్లు అవసరమవుతాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి బడ్జెట్‌లో కేవలం రూ. 1,336 కోట్లు మాత్రమే కేటాయించారు.

అర్హులందరికీ మూడు సెంట్లు ఇంటి స్థలమిచ్చి రూ.1.5 లక్షల వ్యయంతో ఇల్లు నిర్మించి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి... దానికీ కంటితుడుపు కేటాయింపులే చేసింది. గృహ నిర్మాణానికి రూ. 808 కోట్లతో సరిపెట్టింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల నిధుల్లోనూ భారీ కోత విధించారు. కేవలం రూ. 3,103 కోట్లు మాత్రమే కేటాయించారు.  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధికి కూడా తాజా బడ్జెట్‌లో మంగళం పాడారు. ఈ బడ్జెట్‌లో నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఏమీ కేటాయించలేదు.
 
పొంచి ఉన్న పన్నుల భారం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి ప్రజలపై సుమారు రూ. 8,000 కోట్ల మేర పన్నుల భారం పొంచి ఉంది. వ్యాట్ ద్వారా ఏకంగా రూ. 28,749 కోట్లు ఆదాయం రానున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు.

రాజధాని ఊసే లేదు...

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణం గురించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో చెప్తుందని, అవసరమైన కేటాయింపులూ చేస్తుందన్న ఆశలపై టీడీపీ సర్కారు నీళ్లుజల్లింది. దాన్ని బడ్జెట్‌లో రేఖామాత్రంగానైనా ప్రస్తావించకపోవడంపై పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
 
ఆర్టీసీనీ పట్టించుకోలేదు


రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను నిధుల కేటాయింపు ద్వారా ఆదుకోవాలని ఆ సంస్థ కోరినా కూడా బడ్జెట్‌లో ఆ ఊసే ఎత్తలేదు. ఏపీకి సంబంధించి ఆర్‌టీసీకి రూ.2,625 కోట్ల నష్టాలున్నాయని సంస్థ నివేదించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. రవాణా శాఖకు ప్రణాళికేతర వ్యయం కింద రూ.116.85 కోట్ల విదిలింపుతో సరిపెట్టారంతే. ఆర్‌టీసీని ప్రైవేటుపరం చేస్తారన్న ప్రచారానికి ఇది బలం చేకూరుస్తోందని ఎంప్లాయిస్ యూనియన్ అదనపు ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు ‘సాక్షి’తో ఆందోళన వ్యక్తం చేశారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement