రెండు నెలల్లో.. 217 కేసులు!
గ్రామస్థాయిలో పట్టున్న రేషన్ డీలర్లపై రాజకీయాల ప్రభావం ఇటీవలి కాలంలో సాధారణ అంశంగా మారింది. అధికారంలో ఉన్న పార్టీ నాయకులు తమకు అనుకూలంగా ఉండేవారిని డీ లర్లుగా పెట్టుకోవాలని ఉబలాటపడుతుంటారు. తమ వ్యతిరేకులను తప్పించడానికి డీలర్లపై సహజంగా వచ్చే అక్రమాల ఆరోపణలనే ఆస్త్రాలుగా సంధిస్తుంటారు. ఇవన్నీ తెలిసినవే అయినా.. అధికార పార్టీ మారిన నేపథ్యంలో ఈ తరహా వేధింపులు తప్పవని డీలర్లు మానసికంగా సిద్ధపడినా.. వారు ఊహించిన దాని కంటే పెద్దస్థాయిలో రాజకీయ కక్ష సాధింపులు ఎదురుకావడంతో కళవెళపడుతున్నారు. కేసుల తాకిడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్:రెండు నెలల్లో.. రెండొందలుకుపైగా కేసు లు.. అక్కడితో ఆ స్కోరు ఆగిపోలేదు. రోజూ దాదాపు ఐదారు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇవన్నీ రేషన్ డీలర్ల మీద నమోదు చేస్తున్నవే. ఎందుకిలా..?.. గతంలో అక్రమాలకు పాల్పడే డీలర్లపై కేసులు నమోదవుతున్నా.. ఎన్నడూ ఇంత పెద్దస్థాయిలో లేవు. మరి ఈ రెండు నెలల్లోనే డీలర్ల అక్రమాలు ఒక్కసారి బయటకొచ్చాయా? అంటే.. అక్రమాల కంటే రాజకీయ అవసరాలే ఎక్కువగా కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలపైనా పట్టు సాధిం చేందుకు ప్రయత్నిస్తోంది. అందులో ప్రధానమైనది రేషన్ డీలర్ల వ్య వస్థ. ప్రజాపంపిణీని నిర్వహించే డీలర్లకు గ్రామస్థాయిలో ఓటర్లపై పట్టు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న వారిలో అధికశాతం మంది గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నియమితులైనవారే. దాంతో వారిని మార్చి.. తమ పార్టీకి చెందిన వారిని, అనుకూలంగా ఉన్నా వారిని నియమించుకుంటే గ్రామాల్లో తమకు ఎదురుండదన్న ఉద్దేశంతో అధికార పార్టీ నేతలు డీలర్లపై కేసులు బనాయింపజేస్తున్నారు.
ఎన్నడూ లేనంతస్థాయిలో..
గతంలోనూ అధికార పార్టీలు మారిన సందర్భాల్లో ఇటువంటివి జరిగినా.. ఇప్పుడు జరుగుతున్నంత పెద్దస్థాయిలో ఎప్పుడూ జరగలేదని డీలర్లు ఆందోళన చెందుతున్నారు. కేసులు బనాయించ డం, సస్పెండ్ చేయడం, మెమోలు జారీ చేయడం, ఉన్నవారిని తప్పించి డిపోలన మహిళా సంఘాలకు, పక్కనున్న డీలర్లకు అప్పగించడం వంటి చర్యలతో అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. చౌకధరల దుకాణాల వ్యవస్థ ఏర్పడి 40 ఏళ్లు కావస్తోంది. ఎప్పుడూ ఇంత పెద్ద సంఖ్యలో కేసులు బనాయించలేదని, ప్రధానంగా టీడీపీ ప్రజాప్రతినిధులున్న నియోజకవర్గాల్లోనే ఇలా కక్ష సాధింపు చర్యలు తీవ్రస్థాయిలో ఉన్నాయని డీలర్ల సంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
ప్రజాపంపిణీ వ్యవస్థలో ఇప్పటికే ఎలక్ట్రానిక్ కాటా మిషన్లు, యూనివర్సల్ స్టాకు రిజిస్టర్లు, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికార్ల తనిఖీలు వంటి చర్యలతోపాటు కమీషన్ తగ్గింపు, రవాణా భారం వంటి ఇబ్బందులతో నానా అవస్థలు పడుతున్నామని వారంటున్నారు. ఇవి చాలవన్నట్లు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో అధికారులు చిన్న పొరపాట్లను కూడా పెద్దవి చేసి 6ఏ, తదితర కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో ఏళ్ల తరబడి డిపోల నిర్వహణతోనే ఉపాధి పొందుతున్న డీలర్లు ఉపాధిని కోల్పోతున్నారని వారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు జిల్లాలో రెండుమూడు కేసులైనా నమోదు చేస్తున్నారని అంటున్నారు.
ఎడాపెడా కేసులు
జిల్లాలో సుమారు రెండు నెలల్లో రేషన్ డీలర్లపై 217 కేసులు నమోదు చేశారు. అధికంగా శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆమదాలవలస, టెక్కలి, నరసన్నపేట, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలోనే ఎక్కువ కేసులు బనాయిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేని కొంత మంది స్వచ్ఛంధంగానే డీలర్ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఉదాహరణకు. ఇటీవల శ్రీకాకుళం నియోజకవర్గంలోని రెండు మండలాల పరిధిలో 8 మంది డీలర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయడమే పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్‌లో 74, టెక్కలి డివిజన్‌లో 76, పాలకొండ డివిజన్‌లో 67 కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతుండగా.. రోజు రోజుకీ వీటి సంఖ్య పెరుగుతోంది.