16–08–2018, గురువారం
ములగపూడి శివారు, విశాఖపట్నం జిల్లా
ప్రజలను మాటలతో మభ్యపెట్టడం దారుణం
ఈ రోజు పాదయాత్రలో గిరిపుత్రుల ఘోష విన్నాను. విధి వంచితుల ఆవేదన తెలుసుకున్నాను. పల్లెల్లో పచ్చబాబుల అవినీతి చరిత్రను చూశాను. నాతవరం మండలం మన్యపురెట్ల గ్రామస్తులు ఈ రోజు నన్ను కలిశారు. వాళ్లు చెప్పిన మాటలు ఆశ్చర్యం కలిగించాయి. ఈ ఒక్క ఊళ్లోనే దాదాపు వంద మరుగుదొడ్ల డబ్బులు టీడీపీ వాళ్లు తినేశారట. కట్టకుండానే కట్టినట్టు.. ఎప్పుడో కట్టినవి ఇప్పుడు కట్టినట్టు బిల్లులు పెట్టారట. నిజంగా వీళ్లెంతకు దిగజారారు! అధికార పార్టీ నేతలు దోచుకునేందుకు దేనినీ విడిచిపెట్టరనిపించింది. పైన చంద్రబాబు దోచుకుంటుంటే.. గ్రామాల్లో ఆయన కార్యకర్తలు అడ్డగోలుగా తినేస్తున్నారనడానికి ఇంతకన్నా సాక్ష్యాలు కావాలా?!
మర్రిపాలేనికి చెందిన 70 ఏళ్ల తాత కళ్లలో నీళ్లు చూసి చలించిపోయాను. రెండు కిడ్నీలూ చెడిపోయాయని చెప్పాడు. వైద్యం కోసం నెలకు రూ.5 వేలు ఖర్చవుతోందన్నాడు. పార్టీ వివక్ష చూపించి పింఛనూ ఇవ్వడం లేదయ్యా.. పేదవాడిని.. ముసలోడిని.. ఎట్టా బతకాలయ్యా.. అని బావురుమన్నాడు. పేదపూడి నారాయణమ్మ పరిస్థితీ ఇదే.. పక్షవాతంతో ఉన్న ఆమెను తోపుడు బండి మీద నా దగ్గరకు తీసుకొచ్చారు. ఆప్యాయంగా పలకరిస్తే.. ఆమె గుండెలవిసేలా బావురుమంది. కనీసం పింఛన్ కూడా ఇవ్వడం లేదయ్యా.. అంటూ వాపోయింది. ఒలిమి మహాలక్ష్మిది మరో కన్నీటి కథ.. భర్త చనిపోయాడు. 30 ఏళ్లుగా వస్తున్న వితంతు పింఛన్‌ను టీడీపీ ప్రభుత్వం తీసేసిందని చెప్పింది. న్యాయం చెయ్యాలని వేడుకుంది. మరో అడుగు వేస్తే.. ఆశ వర్కర్ రాజేశ్వరి నన్ను కలిసింది. ఆమె భుజం మీద మూడేళ్ల బాలిక ఉంది. ఆ చిన్నారి మానసిక వికలాంగురాలట. అనాథ అయిన ఆ చిన్నారిని పెంచుకుంటోందట. కనీసం ఈ పాపకైనా పింఛన్ ఇస్తే బాగుంటుందనేదే ఆమె కోరిక. అదే నాకు చెప్పింది.
వస్తున్న పింఛన్ తీసేశారని.. అర్హత ఉన్నా ఇవ్వడం లేదని.. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. ఈ ఒక్క రోజే 15 మంది నా వద్ద మొరపెట్టుకున్నారు. వందశాతం పింఛన్లు ఇచ్చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం గూడు, తోడు లేని ఇలాంటి నిర్భాగ్యులను గుర్తించకపోవడం దారుణం.
మేమేం పాపం చేశామయ్యా.. ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేసింది.. అంటూ గొలిగొండ, నాతవరం మండలాలకు చెందిన గిరిజనులు నా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నాటికీ వాళ్ల ఊళ్లకు రోడ్డు సౌకర్యం లేదన్నారు. అంబులెన్స్ రానేరాదన్నారు. కొన్ని రోజులుగా ఊళ్ల్లలో జనం డెంగీ, మలేరియా బారిన పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఏమాత్రం వైద్య సేవలు అందించడం లేదని చెప్పారు. మా ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందేనా.. అంటూ ప్రశ్నించారు. నర్సీపట్నం నుంచి వచ్చిన వైద్యులూ ఇదే మాట చెప్పారు. డెంగీ, మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, ప్లేట్‌లెట్స్ ఎక్కించే సదుపాయం ఈ ప్రాంతంలో లేదని తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏజెన్సీ ప్రాంత గిరిజనుల ఆరోగ్య పర్యవేక్షణపై సైతం ప్రత్యేక శ్రద్ధ ఉండేదని గుర్తుచేశారు. మలేరియా నివార ణకు చిత్తశుద్ధితో పనిచేశారని తెలిపారు. ఆ సమయంలో మలేరియా, డెంగీ కేసులు గణనీ యంగా తగ్గాయని వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం దోమలపై దండయాత్ర అంటూ.. అదేపనిగా ప్రచారం చేసుకుంటోంది తప్ప, ఆచరణలో చిత్తశుద్ధే కనిపించడం లేదన్నారు. మాటలు కోటలు దాటడం తప్ప.. ఇసుమంతైనా కార్యాచరణ కన్పించడం లేదన్నారు. ప్రజలను మాటలతో మభ్యపెట్టడం నిజంగా దారుణం.
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ప్రతి గిరిజన కుటుంబానికీ డయేరియా, మలేరియా, డెంగీ లాంటి అన్ని జబ్బులకు ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేస్తాం.. ఐటీడీఏ స్థాయిలో ప్రత్యేకంగా డీఎంహెచ్‌వోలను నియమిస్తాం.. అదనంగా ఆస్పత్రులను ఏర్పాటు చేస్తాం.. అంటూ మీ మేనిఫెస్టోలోని 25వ పేజీలో హామీ ఇచ్చారు.. కనీసం గుర్తయినా ఉందా? ప్రత్యేక డీఎంహెచ్‌వోల మాట దేవుడెరుగు.. కనీసం మలేరియా ఆఫీసర్ పోస్టులనూ భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచడాన్ని ఏమనుకోవాలి? అదనపు ఆస్పత్రుల ఊసేలేదు. కనీసం 108 అంబులెన్స్ కూడా లేదంటున్న గిరిజనులకు ఏం సమాధానం చెబుతారు? మీ హయాంలో డెంగీ, మలేరియా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.. ఏమైంది దోమలపై మీ దండయాత్ర?
-వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment