పథకం ప్రకారమే విధ్వంసం: అదనపు డీజీపీ ఆర్‌పీ ఠాకూర్ వెల్లడి
సాక్షి, తుని/పాయకరావుపేట: తునిలో కాపు గర్జన సందర్భంగా పక్కా పథకం ప్రకారమే అల్లరి మూకలు విధ్వంసం సృష్టించాయని లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ ఆర్‌పీ ఠాకూర్ చెప్పారు. ఆందోళనకారుల దాడిలో ధ్వంసమైన తుని రూరల్ పోలీస్ స్టేషన్, అక్కడ దగ్ధమైన వాహనాలను ఆయన సోమవారం పరిశీలించారు. తుని పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఉత్తర కోస్తా ఐజీ కుమార్ విశ్వజిత్, నాలుగు జిల్లాల ఎస్పీలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపు గర్జన సభ నిర్వహించేందుకు అనుమతులు లేవని, సభలో నుంచి ఒక్కసారిగా జనం బయటకు వచ్చి రైలు ఆపి విధ్వంసం సృష్టించారని తెలిపారు.
విధ్వంసకారులు పోలీసులను టార్గెట్ చేశారని, పోలీసులు సంయమనం పాటించారని చెప్పారు. దాడుల్లో పోలీసులు 15 మంది గాయాలపాలయ్యారని తెలిపారు. ఐదు వేలమంది పోలీసులను రంగంలోకి దించామని, తూర్పు గోదావరి జిల్లాలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమలులో ఉన్నాయని వివరించారు. కాపు ఐక్య గర్జన సభ సందర్భంగా చోటుచేసుకున్న విధ్వంసంలో ఇప్పటివరకు 50 కేసులు నమోదు చేసినట్టు తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు తెలిపారు. వీడియో పుటేజ్‌ల ద్వారా గుర్తించిన మేరకు ప్రాథమికంగా కేసులు నమోదైనట్టు ఆయన వివరించారు. ఆందోళనకారుల దాడుల్లో రైల్వే, పోలీస్, పబ్లిక్ తదితర ఆస్తులకు సంబంధించి సుమారు రూ.103 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు గుర్తించామన్నారు. ఇప్పటివరకు సుమారు 250 మంది నిందితులను గుర్తించినట్టు సమాచారం.
250 మంది నిందితులు గుర్తింపు
Published Tue, Feb 2 2016 3:12 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM
Advertisement