256వ రోజు పాదయాత్ర డైరీ | 256th day padayatra diary | Sakshi
Sakshi News home page

256వ రోజు పాదయాత్ర డైరీ

Published Fri, Sep 7 2018 4:11 AM | Last Updated on Fri, Sep 7 2018 7:27 AM

256th day padayatra diary - Sakshi

06–09–2018, గురువారం  
జెర్రిపోతులపాలెం, విశాఖపట్నం జిల్లా 

ప్రజాస్వామిక విలువలే లేని సభలో ప్రజావాణికి విలువేముంటుంది?


అభిమానానికి హద్దులుండవు.. హనుమాన్‌ జంక్షన్‌ నుంచి వచ్చిన సాయిగణేశ్‌ ఐటీఐ చదువుతున్నాడట. రాత్రంతా రెండు రైళ్లు మారి.. ఐదు కిలోమీటర్లు నడిచిమరీ నన్ను చూడటానికి వచ్చాడట. వారంలో సెలవు రోజు పూలంగడిలో పనిచేయగా వచ్చిన కాస్త డబ్బుతో పాదయాత్రకు వచ్చి నన్ను కలిశానని చెబుతుంటే.. ఆ అభిమానానికి ముచ్చటేసింది. ‘బాగా చదువుకుని, అమ్మానాన్నలను బాగా చూసుకోవాలి’ అని  చెప్పాను. పట్టరాని సంతోషంతో తలూపాడు.

ఈ రోజు కూడా అధికార పార్టీ భూదోపిడీపైనే అధికంగా ఫిర్యాదులొచ్చాయి. సబ్బవరం, పరవాడ మండల రైతన్నలు కలిశారు. శాటిలైట్‌ టౌన్‌షిప్‌ నిర్మాణం పేరుతో.. ట్రైజంక్షన్‌ పరిధిలో బలవంతపు భూసేకరణకు పూనుకున్నారని వాపోయారు. పేద రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఈ బలవంతపు భూసేకరణలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక అధికారుల ఎదుటనే లంకా తాతారావు అనే రైతన్న గుండె ఆగి మరణించాడట. పేదల పొట్టకొట్టి, అధికార పెద్దలకు కట్టబెట్టే కార్యక్రమం కొనసాగుతున్నంత కాలం.. ఇలాంటి విషాద ఘటనలు ఆగవేమో..

జెర్రిపోతులపాలెం, చింతగట్ల గ్రామస్తులూ భూదోపిడీ బాధితులే. ఎస్సీలకు ఇచ్చిన అసైన్‌మెంటు భూముల్లో ఎన్టీఆర్‌ హౌసింగ్‌ పేరుతో చేస్తున్న అక్రమాల్ని వివరించారు. పేదల భూముల్లో రోడ్లేసుకుని చేస్తున్న అక్రమ క్వారీయింగ్‌ గురించి చెప్పారు. ఐవోసీ పైప్‌లైన్‌ కోసం.. టీడీపీ నేతల భూముల్ని తప్పించి.. పేదల భూముల్ని సేకరించాలన్న కుయత్నాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాలకు అధికారుల అండతో తప్పుడు రికార్డులు సృష్టించి టీడీపీవారు అమ్మేసుకుంటున్నారని వాపోయారు. పేదల ఆధార్‌ కార్డుల్లోనూ, రేషన్‌ కార్డుల్లోనూ చిన్న పొరపాటు ఉన్నా ఏళ్ల తరబడి సరిచేయరు. దాన్ని సాకుగా చూపి పింఛన్, రేషన్‌ ఎగ్గొడతారు. పచ్చనేతలు మాత్రం క్షణాల్లో తప్పుడు రికార్డులు సృష్టించుకుని.. పేదల భూముల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని దోచుకుంటారు.  
 
సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ నేతలు దళిత మహిళను వివస్త్రను చేసి, దౌర్జన్యం చేసిన ఘటన ఈ జెర్రిపోతులపాలెంలోనే జరిగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ ఘోర సంఘటనకు బలైన బాధిత మహిళలు కలిశారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచినందుకు నాకు కృతజ్ఞతలు తెలిపారు.  భూదందాలు, కబ్జాలలోనే టీడీపీ నేతలు, అధికార యంత్రాంగం తలమునకలైంది. పాలనను గాలికొదిలేశారు. ఉత్తరాంధ్ర విషజ్వరాలతో వణికిపోతున్నా.. వందలాది మంది పేదల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా.. పట్టించుకోవడం లేదు. తన ఏడేళ్ల పాప విషజ్వరంతో కన్ను మూసిందని నందవరపువానిపాలెం అప్పలరాజు కన్నీటి పర్యంతమయ్యాడు.

ముదపాకలో చిత్తాడ శ్రీను అనే సోదరుడూ జ్వరంతోనే ప్రాణాలు కోల్పోయాడట. చాలా బాధేసింది. పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే, మెడికల్‌ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి ఉన్నా.. ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. ప్రజా సమస్యల్ని చర్చించాల్సిన అసెంబ్లీని సైతం.. ప్రతిపక్షంపై బురద జల్లడానికి, గొంతు నొక్కడానికి వాడుకుంటున్నారు. ఆత్మస్తుతి, పరనిందకే పరిమితం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా 22 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపర్చుకుని, శాసనసభని అప్రజాస్వామిక వ్యవస్థగా మార్చేశారు. చట్టాలు చేసే సభలోనే చట్టాలను అపహాస్యం చేస్తున్నారు. ప్రజాస్వామిక విలువలే లేని సభలో ప్రజావాణికి విలువేముంటుంది?  
 
ముఖ్యమంత్రిగారూ.. మీకు, స్పీకర్‌ గారికి సూటి ప్రశ్న..
మీరు ప్రలోభపర్చుకుని పదవులిచ్చిన ఆ నలుగురు మంత్రులు ఏ పార్టీకి చెందినవారు? టీడీపీనా? వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనా? అసెంబ్లీ సాక్షిగా స్పష్టంగా చెప్పగలిగే ధైర్యం, నిజాయితీ మీకున్నాయా? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై మీరు చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘనకు వ్యతిరేకంగా.. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన మమ్మల్ని ప్రశ్నించడం.. దొంగే.. దొంగా.. దొంగా.. అన్నట్లుగా లేదా?  

-వైఎస్‌ జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement