సాక్షి, విజయనగరం గంటస్తంభం: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న నామినేషన్ల పర్వంలో మరో అంకం పరిశీలన పూర్తయింది. జిల్లాలోని విజయనగరం పార్లమెంట్ స్థానం, 9 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లో జరిగింది. అభ్యర్థులు హాజరై నామినేషన్లు సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకున్నారు. ఈ సందర్భంగా సక్రమంగా లేని నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. సక్రమంగా ఉన్నవాటిని అనుమతించారు.
కురుపాం టీడీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ..
నామినేషన్ల పరిశీలనలో కురుపాం టీడీపీ అభ్యర్థి జనార్దన్ థాట్రాజ్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి విశ్వేశ్వరరావు తిరస్కరించారు. ఆయన 2013లో పొందిన ఎస్టీ ధ్రువీకరణ పత్రం సమర్పించారు. దానిపై ఆయన ఎస్టీ కాదంటూ సుప్రీం, హైకోర్టులు తీర్పు ఇచ్చాయని బీజేపీ అభ్యర్థి నిమ్మక జయరాజ్ చెప్పడంతో పరిశీలన చేసి అధికారులు తిరస్కరించారు. విజయనగరం, పార్వతీపురం మినహా అన్ని చోట్లా ప్రథాన పార్టీల అభ్యర్థులు తమకు డమ్మీలుగా మరొకరితో నామినేషన్ వేయించారు. వారి నామినేషన్లు సక్రమంగా ఉండడంతో డమ్మీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. సరైన పత్రాలు, ఇతరత్రా లేని నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. మొత్తం ఈ విధంగా మొత్తం దాఖలైన 132 నామినేషన్లలో 28 మందివి తిరస్కరించారు. 104 నామినేషన్లు సక్రమంగా ఉండడంతో అనుమతించారు.
నామినేషన్ల పరిశీలన వివరాలు..
∙విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ముగ్గురు నామినేషన్లను తిరస్కరించారు. మొత్తం 17 నామినేషన్లు దాఖలు కాగా రిటర్నింగ్ అధికారి, కలెక్టరు హరి జవహర్‌లాల్ పరిశీలించి టీడీపీ, వైఎస్సార్ సీపీ, బీజేపీల డమ్మీ అభ్యర్థులు సునీలా గజపతిరాజు, బెల్లాన రవి, పాకలపాటి శ్రీదేవి నామినేషన్లను తిరస్కరించారు. ఈ పార్టీల నుంచి ఇప్పటికే ప్రధాన అభ్యర్థులుగా బెల్లాన చంద్రశేఖర్ (వైఎస్సార్ సీపీ), పి.ఆశోక్‌గజపతిరాజు (టీడీపీ), పాకలపాటి సన్యాసిరాజు (బీజేపీ) బరిలో ఉన్నారు.
∙కురుపాం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి జనార్దన్ థాట్రాజ్ నామినేషన్‌ను నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి విశ్వేశ్వరరావు తిరస్కరించారు. ఆయన ఎస్టీ కాదని బీజేపీ అభ్యర్థి నిమ్మక జయరాజ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పరిశీలించిన అధికారులు నామినేషన్‌ను తిరస్కరించారు. ఆయతో పాటు ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి బట్ల భద్రప్రసాద్, మరో ఐదుగురు స్వతంత్రుల నామినేషన్లను కూడా తిరస్కరించారు. మొత్తంగా 13 నామినేషన్లు దాఖలు కాగా ఏడింటిని తిరస్కరించి, ఆరింటిని అనుమతించారు.
∙సాలూరులో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి టి.రమేష్, వైఎస్సార్ సీపీ డమ్మీ అభ్యర్థి పి.కృష్ణారావు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. పత్రాలు సక్రమంగా లేనందున అనుమతించనట్లు అధికారులు చెప్పారు. ఇక్కడ 10 మంది నామినేషన్లు వేస్తే 8 మందివి అనుమతించారు.
∙బొబ్బిలిలో రెండు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. వైఎస్సార్ సీపీ, బీజేపీ డమ్మీ అభ్యర్థులు శంబంగి శ్రీకాంత్, పుల్లెల శ్రీనివాస్ నామినేషన్లను తిరస్కరించారు. ప్రధాన అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ 11 మంది నామినేషన్లు దాఖలు చేయగా 9 మందివి అనుమతించారు.
∙చీపురుపల్లిలో 15 నామినేషన్లు దాఖలు కాగా, టీడీపీ వైఎస్సార్ సీపీ, బీజేపీ డమ్మీ అభ్యర్థులు కిమిడి మృణాళిని, బొత్స ఝాన్సీలక్ష్మి, డి.అసుతోస్‌ల నామినేషన్లను తిరస్కరించారు. ఆయా పార్టీల ప్రధాన అభ్యర్థులు బరిలో నిలిచారు. మిగతా 12 నామినేషన్లను అనుమతించారు.
∙గజపతినగరంలో 13 నామినేషన్లలో రెండింటిని అధికారులు తిరస్కరించారు. టీడీపీ, వైఎస్సార్ సీపీ డమ్మీ అభ్యర్థులు కొండపల్లి అరుణతేజి, బొత్స దేవీఅనురాధల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. పార్టీ తరుఫున నామినేషన్లు వేయగా బీ ఫారం ప్రధాన అభ్యర్థులకు ఇచ్చినందున వీరి నామినేషన్లను పక్కన పెట్టారు. ఆయా పార్టీ ప్రధాన అభ్యర్థులు బరిలో ఉన్నారు.
∙నెల్లిమర్లలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ డమ్మీ అభ్యర్థులు పతివాడ అప్పలనాయుడు, పతివాడ సత్యం, కడగల లక్ష్మి, బడుకొండ పద్మావతి నామినేషన్లను పత్రాలు సరిగ్గా లేనందున తిరస్కరించారు. ఆయా పార్టీలకు చెందిన ప్రధాన అభ్యర్థులతో పాటు 12 మంది నామినేన్లను అనుమతించారు.
∙ఎస్‌కోటలో 16 మంది నామినేషన్లు వేయగా ప్రధాన పార్టీలకు చెందిన డమ్మీ అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 7 నామినేషన్లను తిరస్కరించారు. తొమ్మిందింటిని అనుమతించారు.
∙విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో 11 మంది నామినేషన్లు దాఖలు చేయగా, అన్నీ సక్రమంగా ఉండడంతో అనుమతించారు.
∙పార్వతీపురం అసెంబ్లీకి 10 మంది నామినేషన్లు దాఖలు చేయగా అన్నీ సక్రమంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment