Namination rejected
-
ఐదు నామినేషన్ల తిరస్కరణ
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఐదు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల పరిశీలన ప్రక్రియను కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఆర్వీ.కర్ణన్ మంగళవారం చేపట్టారు. పార్లమెంట్ నియోజకవర్గ జనరల్ అబ్జర్వర్ జీకే.అరుణ్ సుందర్ త్యాలన్ సమక్షంలో ఎన్నికల నామినేషన్ల పరిశీలన నిర్వహించారు. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఐదు నామినేషన్లను తిరస్కరించగా.. 29 నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు కలెక్టర్ కర్ణన్ తెలిపారు. తిరస్కరణకు గురైన వాటిలో వంకాయలపాటి నాగేశ్వరరావు, మార్త రాజయ్య, గద్దల సుబ్బారావు, గాదె నర్సింహారెడ్డి, కాసాని అయిలయ్య నామినేషన్లు ఉన్నాయి. అఫిడవిట్ అసంపూర్తిగా ఉండడం.. ప్రతిపాదన చేసిన వారి సంతకాలు పూర్తిస్థాయిలో లేకపోవడం వంటి కారణాలతో తిరస్కరించారు. కార్యక్రమంలో జేసీ అనురాగ్ జయంతి, జెడ్పీ సీఈఓ ప్రియాంక, అసిస్టెంట్ కలెక్టర్ హన్మంతు కొడింబా, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జె.శ్రీనివాసరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి మదన్‌గోపాల్, ఎన్నికల విభాగపు డిప్యూటీ తహసీల్దార్ రాంబాబు, నామినేషన్లు దాఖలు చేసిన వివిధ పార్టీల అభ్యర్థులు, ప్రతిపాదకులు పాల్గొన్నారు. -
77 నామినేషన్ల తిరస్కరణ
సాక్షి, ఒంగోలు అర్బన్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మంగళవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు దాఖలైన నామినేషన్లను పరిశీలించి సక్రమంగా లేని వాటిని రిజెక్టు చేశారు. రిజెక్ట్ అయిన వాటిలోఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 17నామినేషన్లు దాఖలు కాగా వాటిలో 4 నామినేషన్లు తిరస్కరించారు. బాపట్ల పార్లమెంట్‌కు మొత్తం 16 నామినేషన్లు దాఖలు కాగా వాటిలో 2 నామినేషన్లు తిరస్కరించారు. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 237 నామినేషన్లు దాఖలైతే వాటిలో 65 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 172 నామినేషన్లు ఆమోదం పొందాయి. రిజెక్ట్ అయిన వాటిలో యర్రగొండపాలెం నియోజకవర్గంలో 4, దర్శి 10, పర్చూరులో 2, అద్దంకిలో 3, చీరాల 3, సంతనూతలపాడు 2, ఒంగోలు 5, కందుకూరు 12, కొండపి 3, మార్కాపురం 7, గిద్దలూరు 10, కనిగిరి 14 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. -
28 నామినేషన్ల తిరస్కరణ
సాక్షి, విజయనగరం గంటస్తంభం: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న నామినేషన్ల పర్వంలో మరో అంకం పరిశీలన పూర్తయింది. జిల్లాలోని విజయనగరం పార్లమెంట్ స్థానం, 9 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లో జరిగింది. అభ్యర్థులు హాజరై నామినేషన్లు సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకున్నారు. ఈ సందర్భంగా సక్రమంగా లేని నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. సక్రమంగా ఉన్నవాటిని అనుమతించారు. కురుపాం టీడీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ.. నామినేషన్ల పరిశీలనలో కురుపాం టీడీపీ అభ్యర్థి జనార్దన్ థాట్రాజ్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి విశ్వేశ్వరరావు తిరస్కరించారు. ఆయన 2013లో పొందిన ఎస్టీ ధ్రువీకరణ పత్రం సమర్పించారు. దానిపై ఆయన ఎస్టీ కాదంటూ సుప్రీం, హైకోర్టులు తీర్పు ఇచ్చాయని బీజేపీ అభ్యర్థి నిమ్మక జయరాజ్ చెప్పడంతో పరిశీలన చేసి అధికారులు తిరస్కరించారు. విజయనగరం, పార్వతీపురం మినహా అన్ని చోట్లా ప్రథాన పార్టీల అభ్యర్థులు తమకు డమ్మీలుగా మరొకరితో నామినేషన్ వేయించారు. వారి నామినేషన్లు సక్రమంగా ఉండడంతో డమ్మీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. సరైన పత్రాలు, ఇతరత్రా లేని నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. మొత్తం ఈ విధంగా మొత్తం దాఖలైన 132 నామినేషన్లలో 28 మందివి తిరస్కరించారు. 104 నామినేషన్లు సక్రమంగా ఉండడంతో అనుమతించారు. నామినేషన్ల పరిశీలన వివరాలు.. ∙విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ముగ్గురు నామినేషన్లను తిరస్కరించారు. మొత్తం 17 నామినేషన్లు దాఖలు కాగా రిటర్నింగ్ అధికారి, కలెక్టరు హరి జవహర్లాల్ పరిశీలించి టీడీపీ, వైఎస్సార్ సీపీ, బీజేపీల డమ్మీ అభ్యర్థులు సునీలా గజపతిరాజు, బెల్లాన రవి, పాకలపాటి శ్రీదేవి నామినేషన్లను తిరస్కరించారు. ఈ పార్టీల నుంచి ఇప్పటికే ప్రధాన అభ్యర్థులుగా బెల్లాన చంద్రశేఖర్ (వైఎస్సార్ సీపీ), పి.ఆశోక్‌గజపతిరాజు (టీడీపీ), పాకలపాటి సన్యాసిరాజు (బీజేపీ) బరిలో ఉన్నారు. ∙కురుపాం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి జనార్దన్ థాట్రాజ్ నామినేషన్‌ను నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి విశ్వేశ్వరరావు తిరస్కరించారు. ఆయన ఎస్టీ కాదని బీజేపీ అభ్యర్థి నిమ్మక జయరాజ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పరిశీలించిన అధికారులు నామినేషన్‌ను తిరస్కరించారు. ఆయతో పాటు ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి బట్ల భద్రప్రసాద్, మరో ఐదుగురు స్వతంత్రుల నామినేషన్లను కూడా తిరస్కరించారు. మొత్తంగా 13 నామినేషన్లు దాఖలు కాగా ఏడింటిని తిరస్కరించి, ఆరింటిని అనుమతించారు. ∙సాలూరులో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి టి.రమేష్, వైఎస్సార్ సీపీ డమ్మీ అభ్యర్థి పి.కృష్ణారావు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. పత్రాలు సక్రమంగా లేనందున అనుమతించనట్లు అధికారులు చెప్పారు. ఇక్కడ 10 మంది నామినేషన్లు వేస్తే 8 మందివి అనుమతించారు. ∙బొబ్బిలిలో రెండు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. వైఎస్సార్ సీపీ, బీజేపీ డమ్మీ అభ్యర్థులు శంబంగి శ్రీకాంత్, పుల్లెల శ్రీనివాస్ నామినేషన్లను తిరస్కరించారు. ప్రధాన అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ 11 మంది నామినేషన్లు దాఖలు చేయగా 9 మందివి అనుమతించారు. ∙చీపురుపల్లిలో 15 నామినేషన్లు దాఖలు కాగా, టీడీపీ వైఎస్సార్ సీపీ, బీజేపీ డమ్మీ అభ్యర్థులు కిమిడి మృణాళిని, బొత్స ఝాన్సీలక్ష్మి, డి.అసుతోస్ల నామినేషన్లను తిరస్కరించారు. ఆయా పార్టీల ప్రధాన అభ్యర్థులు బరిలో నిలిచారు. మిగతా 12 నామినేషన్లను అనుమతించారు. ∙గజపతినగరంలో 13 నామినేషన్లలో రెండింటిని అధికారులు తిరస్కరించారు. టీడీపీ, వైఎస్సార్ సీపీ డమ్మీ అభ్యర్థులు కొండపల్లి అరుణతేజి, బొత్స దేవీఅనురాధల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. పార్టీ తరుఫున నామినేషన్లు వేయగా బీ ఫారం ప్రధాన అభ్యర్థులకు ఇచ్చినందున వీరి నామినేషన్లను పక్కన పెట్టారు. ఆయా పార్టీ ప్రధాన అభ్యర్థులు బరిలో ఉన్నారు. ∙నెల్లిమర్లలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ డమ్మీ అభ్యర్థులు పతివాడ అప్పలనాయుడు, పతివాడ సత్యం, కడగల లక్ష్మి, బడుకొండ పద్మావతి నామినేషన్లను పత్రాలు సరిగ్గా లేనందున తిరస్కరించారు. ఆయా పార్టీలకు చెందిన ప్రధాన అభ్యర్థులతో పాటు 12 మంది నామినేన్లను అనుమతించారు. ∙ఎస్‌కోటలో 16 మంది నామినేషన్లు వేయగా ప్రధాన పార్టీలకు చెందిన డమ్మీ అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 7 నామినేషన్లను తిరస్కరించారు. తొమ్మిందింటిని అనుమతించారు. ∙విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో 11 మంది నామినేషన్లు దాఖలు చేయగా, అన్నీ సక్రమంగా ఉండడంతో అనుమతించారు. ∙పార్వతీపురం అసెంబ్లీకి 10 మంది నామినేషన్లు దాఖలు చేయగా అన్నీ సక్రమంగా ఉన్నాయి. -
విశాల్ నామినేషన్‌పై హైడ్రామా
సాక్షి, చెన్నై : ఈనెల 21న నిర్వహించే ఆర్కే నగర్ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన సందర్భంగా మంగళవారం భారీ హైడ్రామా నడిచింది. సాంకేతిక కారణాలు చూపుతూ తొలుత ఎన్నికల అధికారులు సినీ నటుడు విశాల్ నామినేషన్‌ను తిరస్కరించారు. అయితే ఆయన ఎన్నికల ప్రధాన అధికారిని కలుసుకుని తనను బలపరిచిన వారికి బెదిరింపులు వచ్చాయని చెప్పడంతో రాత్రి 8.30 గంటలకు ఆయన నామినేషన్ ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా విశాల్ ఇచ్చిన వివరణ అవాస్తమని తేలడంతో తిరిగి రాత్రి 11 గంటలకు ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మరోవైపు, జయలలిత మేనకోడలు దాఖలుచేసిన నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. ఒక్క రోజులో ఎన్ని మలుపులో... చెన్నై తండయార్ పేటలోని మండల కార్యాలయంలో ఎన్నికల అధికారి వేలుస్వామి పర్యవేక్షణలో ఉదయం నుంచి నామినేషన్ల పరిశీలన జరిగింది. విశాల్ పేరును ప్రతిపాదించిన ఆర్కేనగర్కు చెందిన పదిమందిలో ఇద్దరి పేర్లు, వివరాలు తప్పుల తడకగా ఉండటంతో పాటు, అనేకచోట్ల అవును, లేదు అన్న సమాధానాలు కూడా ఇవ్వకుండా ఖాళీగా వదలి పెట్టడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు వేలుస్వామి ప్రకటించారు. దీంతో ఆందోళనకు దిగిన విశాల్ పోలీసులు సర్దిచెప్పడంతో శాంతించారు. అనంతరం ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖానికి చేసిన ఫిర్యాదులో తన పేరును ప్రతిపాదించిన వారికి బెదిరింపులు వచ్చాయని, వాటిని నిరూపించే వీడియో తన వద్ద ఉందని విశాల్ పోరాటానికి దిగారు. దీంతో రాత్రి 8.30 గంటలకు విశాల్ నామినేషన్ ఆమోదించినట్లు అధికారులు చెప్పారు. చివరకు రాత్రి 11 గంటలకు మళ్లీ ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరోవైపు 26ఐ పత్రాన్ని పూర్తిగా నింపకుండానే సమర్పించడంతో దీప నామినేషన్‌ను తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక పోరులో మొత్తం 131 మంది నామినేషన్లు వేయగా పరిశీలనలో 54 తిరస్కరణకు గురయ్యాయి. -
అజారుద్దీన్ ఆరోపణల్లో వాస్తవం లేదు
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వివేక్‌పై అజరుద్దీన్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని హెచ్‌సీఏ నూతన కార్యదర్శి శేషు నారాయణ అన్నారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ తన నామినేషన్ తిరస్కరించారన్న ఆక్రోశంతోనే అజహర్ మాట్లాడుతున్నారన్నారు. వివేక్‌పై అజహర్ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. అలాగే వివేక్‌కు అనర్హత వర్తించదని శేషు నారాయణ పేర్కొన్నారు. కాగా హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్ష పదవికి అజహర్ వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. జీవిత కాల నిషేధంపై అజహర్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆయన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో హెచ్‌సీఏ అధ్యక్ష పదవి రేసులో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వివేక్, జయసింహ రేసులో ఉన్నారు. మరోవైపు నామినేషన్ తిరస్కరణపై అజహర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. -
'మొదటి నుంచి నాకు వ్యతిరేకంగా కుట్రలు'
-
'మొదటి నుంచి నాకు వ్యతిరేకంగా కుట్రలు'
హైదరాబాద్ : హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్ తిరస్కరించడంపై మొహమ్మద్ అజహరుద్దీన్ స్పందించారు. మొదటి నుంచి తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం మధ్యాహ్నం అజహర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రిటర్నింగ్ అధికారి పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు. చదవండి...(అజారుద్దీన్‌కు ఎదురుదెబ్బ) తన నామినేషన్‌ను తిరస్కరించడం సరికాదన్న ఆయన... కేబినెట్ ర్యాంక్ పదవిలో కొనసాగుతున్న వివేక్ నామినేషన్‌ను ఎందుకు తిరస్కరించలేదని ప్రశ్నించారు. కార్యదర్శి పదవి విషయంలోనూ నిబంధనలు పక్కనపెట్టారని, లోథా కమిటీ నియమాలు మిగతా వారికి వర్తించవా అంటూ ప్రశ్నలు సంధించారు. క్రికెట్ కు మంచి చేయాలనే తాను నామినేషన్ వేసినట్లు పేర్కొన్నారు. తన నామినేషన్ తిరస్కరణపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు అజహర్ తెలిపారు. కాగా హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి అజహర్ వేసిన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన విషయం తెలిసిందే. -
అజారుద్దీన్‌కు ఎదురుదెబ్బ
-
అజారుద్దీన్‌కు ఎదురుదెబ్బ
హైదరాబాద్ : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్ష పదవికి ఆయన వేసిన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. కాగా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అజహర్‌పై బీసీసీఐ 2000 సంవత్సరంలో జీవితకాలం నిషేధం విధించగా, దాదాపు 12 ఏళ్ల తర్వాత ఏపీ హైకోర్టు బోర్డు నిర్ణయాన్ని తప్పు పడుతూ అజహర్‌ను నిర్దోషిగా తేల్చింది. అయితే ఆ తర్వాత కూడా బీసీసీఐ అధికారికంగా అజహర్‌పై నిషేధాన్ని ఎత్తివేయలేదు. అయితే జీవిత కాల నిషేధంపై అజహర్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆయన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించినట్లు సమాచారం. దీంతో హెచ్‌సీఏ అధ్యక్ష పదవి రేసులో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వివేక్, జయసింహ రేసులో ఉన్నారు. మరోవైపు నామినేషన్ తిరస్కరణపై అజారుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం హెచ్‌సీఏ ఎన్నికలు ఈ నెల 17న జరగనున్నాయి.