విశాల్, దీప
సాక్షి, చెన్నై : ఈనెల 21న నిర్వహించే ఆర్కే నగర్ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన సందర్భంగా మంగళవారం భారీ హైడ్రామా నడిచింది. సాంకేతిక కారణాలు చూపుతూ తొలుత ఎన్నికల అధికారులు సినీ నటుడు విశాల్ నామినేషన్‌ను తిరస్కరించారు. అయితే ఆయన ఎన్నికల ప్రధాన అధికారిని కలుసుకుని తనను బలపరిచిన వారికి బెదిరింపులు వచ్చాయని చెప్పడంతో రాత్రి 8.30 గంటలకు ఆయన నామినేషన్ ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా విశాల్ ఇచ్చిన వివరణ అవాస్తమని తేలడంతో తిరిగి రాత్రి 11 గంటలకు ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మరోవైపు, జయలలిత మేనకోడలు దాఖలుచేసిన నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది.
ఒక్క రోజులో ఎన్ని మలుపులో...
చెన్నై తండయార్ పేటలోని మండల కార్యాలయంలో ఎన్నికల అధికారి వేలుస్వామి పర్యవేక్షణలో ఉదయం నుంచి నామినేషన్ల పరిశీలన జరిగింది. విశాల్ పేరును ప్రతిపాదించిన ఆర్కేనగర్‌కు చెందిన పదిమందిలో ఇద్దరి పేర్లు, వివరాలు తప్పుల తడకగా ఉండటంతో పాటు, అనేకచోట్ల అవును, లేదు అన్న సమాధానాలు కూడా ఇవ్వకుండా ఖాళీగా వదలి పెట్టడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు వేలుస్వామి ప్రకటించారు. దీంతో ఆందోళనకు దిగిన విశాల్ పోలీసులు సర్దిచెప్పడంతో శాంతించారు.
అనంతరం ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖానికి చేసిన ఫిర్యాదులో తన పేరును ప్రతిపాదించిన వారికి బెదిరింపులు వచ్చాయని, వాటిని నిరూపించే వీడియో తన వద్ద ఉందని విశాల్ పోరాటానికి దిగారు. దీంతో రాత్రి 8.30 గంటలకు విశాల్ నామినేషన్ ఆమోదించినట్లు అధికారులు చెప్పారు. చివరకు రాత్రి 11 గంటలకు మళ్లీ ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరోవైపు 26ఐ పత్రాన్ని పూర్తిగా నింపకుండానే సమర్పించడంతో దీప నామినేషన్‌ను తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక పోరులో మొత్తం 131 మంది నామినేషన్లు వేయగా పరిశీలనలో 54 తిరస్కరణకు గురయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment