సాక్షి, చెన్నై: ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతున్న కొద్ది తమిళనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ నెల 21న జరగనున్న ఆర్కే నగర్ ఉప ఎన్నికలో భాగంగా రాజకీయ వేడి రాసుకుంది. ఈ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసేందుకు హీరో విశాల్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు మొదట తిరస్కరించి.. తర్వాత ఆమోదం తెలిపి మరలా తిరస్కరణకు గురి చేశారు.
దీనిపై డీఎంకే నేత స్టాలిన్ మాట్లాడుతూ.. విశాల్ నామినేషన్ తిరస్కరణ కుట్రే అని అన్నారు. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా పాలక పక్షంతో కుమ్మక్కైందని ఆయన పేర్కొన్నారు. విశాల్ నామినేషన్‌పై అన్నాడీఎంకే దురాగతాలకు పాల్పడిందని డీఎంకే నేత పేర్కొన్నారు. ఆర్కే నగర్ రిటర్నింగ్ అధికారిని తొలిగించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆర్కేనగర్ ఉప ఎన్నికలో తమ పార్టీ విజయం సాధిస్తుందని డీఎంకే నేత స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ మంత్రులే గత ఏప్రిల్‌లో రూ. 89 కోట్లు పంచి పెట్టారన్నారు. ప్రభుత్వం ఆర్కేనగర్ ఉప ఎన్నికను మరోసారి రద్దు చేయడానికి కుట్ర పన్నుతోందని స్టాలిన్ అన్నారు. దాదాపు 70 మంది స్వతంత్ర అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీకి దిగడంతో ఉపసమరం ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment