సాక్షి, చెన్నై: నటుడు విశాల్ నాకు షాక్ ఇచ్చాడని నటుడు పొన్‌వన్నన్ అన్నారు. దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి, తమిళనిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ఇటీవల ఆర్‌కే.నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేసిన విషయం, అది అనేక నాటకీయ పరిణామాల తరువాత తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. విశాల్ అనూహ్య నామినేషన్ చర్య పరిశ్రమలో ఒక వర్గం దిగ్భ్రాంతికి, మరో వర్గం తీవ్ర వ్యతిరేకతకు గురి చేసింది.
ఈ వ్యవహరంలో ఇండస్ట్రీలో పెద్ద రచ్చే జరిగింది. అందులో దక్షిణ భారత నటీనటుల సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి నటుడు పొన్‌వన్నన్ రాజీనామా నిర్ణయం ఒకటి. ఈ విషయంపై ఆ సంఘంలో పెద్ద చర్చే జరిగింది. చివరికి పొన్‌వన్నన్ రాజీనామాను అంగీకరించేది లేదని సంఘం అధ్యక్షుడు నాజర్ వెల్లడించారు. దీంతో బుధవారం పొన్‌వన్నన్ మీడియా ముందుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతనటీనటుల సంఘ నిర్వాహం రాజకీయాలకతీతంగా పని చేయాలన్న సిద్ధాంతంతో ఉందన్నారు. అలాంటిది సంఘం కార్యదర్శి విశాల్ అనూహ్యాంగా ఆర్‌కే.నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేసి తనకు పెద్ద షాక్ ఇచ్చారన్నారు.
సంఘం అధ్యక్షుడు నాజర్‌కు ఫోన్ చేసి సంప్రదించగా ఆయన తనకేమీ తెలియదని చెప్పారన్నారు. సంఘం కోశాధికారి కార్తీని సంప్రదించగా తనకూ ఏమీ తెలియదని,అది విశాల్ వ్యక్తిగత నిర్ణయం అని చెప్పారన్నారు. ఈ వ్యవహారంపై మీడియాతో పాటు పలువురు తనను ప్రశ్నించడంతో బదులు చెప్పలేక తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానన్నారు.
తన రాజీనామాను సంఘ నిర్వాకం ఆమోదించక పోవడం, విశాల్ ఈ విషయంలో విచారం వ్యక్తం చేసి, ఇకపై ఇలాంటి సంఘటనలు జరగవని మాట ఇవ్వడంతో తన రాజీనామాను వెనక్కు తీసుకున్నట్లు వెల్లడించారు. అదే విధంగా తన రాజీనామాతో సంఘం బలహీన పడుతుందని, సంఘ భవన నిర్మాణం నిధిని సమకూర్చడం కోసం వచ్చే నెల 6వ తేదీన మలేషియాలో నిర్వహించ తలపెట్టిన స్టార్ క్రికెట్ కార్యక్రమం పనులు చేయాల్సిఉండడం లాంటివి దృష్టిలో పెట్టుకుని రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నానన్నారు.
రజనీ,కమల్ పాల్గొననున్నారు..
జనవరి 6వ తేదీన మలేషియాలో జరగనున్న స్టార్ క్రికెట్ పోటీల్లో కమలహాసన్, రజనీకాంత్‌తో సహా 200 మంది కళాకారులు పాల్గొననున్నారని వెల్లడించారు. నటుడు అజిత్ కూడా పాల్గొనాలని కోరుతున్నామని చెప్పారు. స్టార్ క్రికెట్‌తో పాటు పలు సంప్రదాయ సినీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దీన్ని మలేషియా ప్రభుత్వంతో కలిసి నటీనటుల సంఘం నిర్వహించనుందని పొన్‌వన్నన్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment