283వ రోజు పాదయాత్ర డైరీ | 283rd day padayatra diary | Sakshi
Sakshi News home page

283వ రోజు పాదయాత్ర డైరీ

Published Thu, Oct 11 2018 2:24 AM | Last Updated on Thu, Oct 11 2018 7:38 AM

283rd day padayatra diary - Sakshi

10–10–2018, బుధవారం 
గజపతినగరం, విజయనగరం జిల్లా  

అవార్డులు ఇప్పించుకుని ప్రచారం చేసుకోవడంలో ముఖ్యమంత్రిగారు ముందుంటారు  
నిన్నటి దాకా ఉన్న ఎండ తీవ్రత, ఉక్కపోత.. ఈ రోజు కనిపించకుండా పోయాయి. అల్పపీడన ప్రభావంతో వాతావరణం చల్లబడింది. కానీ జనం గుండెలు మండుతూనే ఉన్నాయి. కష్టాలు, కన్నీళ్ల ఉక్కపోత.. వారికి ఊపిరాడనీయకుండా చేస్తూనే ఉంది.  

ఈ రోజు ఎంతోమంది పండు ముసలివారు కలిశారు. తగ్గిన కంటిచూపు, ఒంగిన నడుములతో నడిచే శక్తి లేకున్నా.. నిలబడలేకున్నా.. నా కోసం కదలి వచ్చి తమ బతుకు వ్యథల్ని చెప్పుకొన్నారు. ‘పిల్లలు చూడటం లేదు.. పింఛనూ రావడం లేదు’అని లచ్చమ్మ అనే 80 ఏళ్ల అవ్వ కంటతడి పెట్టడంతో గుండె తరుక్కుపోయింది. పెద్ద వయసులో ఏ ఆదరణా లేక.. చూసుకునే వారూ లేక.. భారంగా బతుకులీడుస్తున్న వారెందరో! అలాంటి వారికి కనీసం పింఛన్లు, రేషన్‌ బియ్యం లాంటివైనా సక్రమంగా అందితే కాస్తయినా ఊరటగా ఉంటుంది కదా. 

లింగాలవలస వద్ద కొద్ది మంది రైతన్నలు కలిశారు. తోటపల్లి కాలువ పనులు పూర్తికాకపోవడంతో సాగు నీరందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిపోయిన కాస్త పనులనూ పూర్తిచేయని ఈ సర్కారు నిర్లక్ష్యమే.. ఈ ప్రాంత రైతన్నలకు శాపమైంది.  

గత ఎన్నికలకు ముందు రూ.53 వేల పంట రుణం తీసుకుంటే.. అది మాఫీ కాలేదని బంగారు నాయుడన్న బాధపడ్డాడు. బాబుగారిని నమ్ముకున్నందుకు వడ్డీ భారం తడిసి మోపెడైందని వాపోయాడు. అది చాలదన్నట్టు.. గోరుచుట్టుపై రోకలి పోటులా ఎన్నికల తర్వాత హుద్‌హుద్‌ తుపాను ముంచేసింది. ఆయన ఆశ పెట్టుకున్న ఐదెకరాల మొక్క జొన్న పంట పూర్తిగా దెబ్బతింది. దానికీ నష్టపరిహారం రాలేదు. ఇది రైతు వ్యతిరేక పాలనగాక మరేంటి? క్షేత్ర స్థాయి వాస్తవాలు ఇంత దారుణంగా ఉంటే.. అవార్డులు ఇప్పించుకుని ప్రచారం చేసుకోవడంలో ముఖ్యమంత్రిగారు ముందుంటారు.  

దారిలో ఏడొంపులగెడ్డ నదిని చూసి చాలా బాధేసింది. ఇసుకనేదే కనిపించడం లేదు. నది మొత్తం గుంతలమయం.. రాళ్లు తేలిపోయింది. రాత్రీపగలన్న తేడా లేకుండా ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా అడ్డదిడ్డంగా తవ్వేస్తుంటే.. భూగర్భ జలాలు ఇంకిపోవా? ఏరులు ఎడారులను తలపించవా? 

ఉపాధి అవకాశాల్లేక వేలాది మంది విలవిల్లాడుతున్నామని ఫార్మసిస్టులు గోడు వెళ్లబోసుకున్నారు. కేవలం వైఎస్సార్‌గారి హయాంలో నియామకాలు పొందామన్న ఏకైక కారణంతో కక్షగట్టిమరీ ఉద్యోగాల్లోంచి తొలగించాలని చూస్తోందీ ప్రభుత్వం.. అని ఆరోగ్యమిత్రలు ఆవేదన వ్యక్తం చేశారు.
 
గజపతినగరంలో ఇరుకైన, గతుకుల రోడ్ల గురించి.. దుర్భరమైన డ్రైనేజీ గురించి.. దారుణమైన పారిశుద్ధ్యం గురించి.. అనేక ఫిర్యాదులందాయి. ఈ రోజు సాయంత్రం ఆ దుస్థితిని ప్రత్యక్షంగా చూశాను. వర్షాలొస్తే మురుగునీరు పొంగిపొర్లుతుందని.. రోగాలు వణికిస్తాయని ఇక్కడి ప్రజలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బైపాస్‌ రోడ్డు వేస్తామని, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని గత ఎన్నికలప్పుడు పచ్చనేతలు గొప్పగా హామీలిచ్చారు. ఇప్పటిదాకా పట్టించుకున్న పాపాన పోలేదు. మళ్లీ ఎన్నికలొస్తున్నాయి.. మరోసారి అవే హామీలిచ్చి మోసపుచ్చడానికి సిద్ధంగా ఉన్నారు.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీరు అధికారంలోకి వచ్చే నాటికి తోటపల్లి ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తయింది వాస్తవం కాదా? మిగిలిన పదిశాతం పనులను కూడా ఈ నాలుగున్నరేళ్ల కాలంలో పూర్తిచేయలేకపోవడానికి కారణమేంటి? ఈ ప్రాజెక్టు కింద లక్షా 35 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా.. 80 వేల ఎకరాలకు ఇప్పటికీ నీళ్లు అందడం లేదంటే.. ఆ పాపం మీది కాదా?  
-వైఎస్‌ జగన్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement