286వ రోజు పాదయాత్ర డైరీ | 286th day padayatra diary | Sakshi
Sakshi News home page

286వ రోజు పాదయాత్ర డైరీ

Published Tue, Oct 16 2018 2:28 AM | Last Updated on Tue, Oct 16 2018 7:22 AM

286th day padayatra diary - Sakshi

ఇప్పటిదాకా నడిచిన దూరం: 3,149.6 కిలోమీటర్లు
15–10–2018, సోమవారం 
లక్ష్మీపురం క్రాస్, విజయనగరం జిల్లా 

తుపాను చేసిన గాయం మాసిపోతున్నా.. పాలకుల మోసం వారిని దహిస్తూనే ఉంది
భరతమాత ముద్దుబిడ్డ అబ్దుల్‌ కలాంగారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటూ పాదయాత్ర ప్రారంభించాను. నేడు గజపతినగరం పూర్తిచేసుకుని బొబ్బిలి నియోజకవర్గంలోకి ప్రవేశించాను. బొబ్బిలి ఘన చరిత్ర ఎవరికీ తెలియందికాదు.. కళలకు, కళాకారులకు, కోలాటానికి, భామాకలాపానికి ప్రసిద్ధి. బొబ్బిలి వీణ దేశవిదేశాల్లో ప్రఖ్యాతి గాంచింది. అమెరికా అధ్యక్షుడి మన్ననలను సైతం పొందింది. ఆ ప్రాభవం నేడు మసకబారుతోంది.  

పుట్టుకతోనే మూగ, చెవుడైన ఆడబిడ్డను చూసి తల్లడిల్లిపోయారు.. కళ్యాణి, సూర్యనాగేశ్వరరావు దంపతులు. దిక్కుతోచని స్థితిలో 2008లో నాన్నగారిని కలిశారు. అదే రోజు సాయంత్రానికే ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.6 లక్షలు మంజూరయ్యాయి. ఆపరేషన్‌ జరిగి ఆ బిడ్డ గలగలా మాట్లాడుతోంది. అదీ.. మనసున్న ముఖ్యమంత్రి సహాయనిధి. కానీ నేటి పాలనలోముఖ్యమంత్రి సహాయనిధి ఎండమావిగా మారింది. అరకొరగా అప్పుడప్పుడు కొద్దిమందికి మాత్రమే అందుతోంది. వారిలో.. ముఖ్యమంత్రిగారు ఇచ్చిన చెక్కులు చెల్లక సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నవారెందరెందరో.  

బాడంగికి చెందిన పెద్దింటి రమేష్‌ తదితర అగ్రిగోల్డ్‌ బాధితులు కలిశారు. 2015లో పార్వతీపురానికి వచ్చిన ముఖ్యమంత్రి గారిని కలిస్తే.. రెండు నెలల్లో పూర్తి న్యాయం చేస్తానని ప్రకటించారట. రెండేళ్లు దాటినా ఆ ఊసే ఎత్తకపోవడంతో చీపురుపల్లికి వచ్చిన బాబుగారిని మారోమారు కలవబోయారట. కలవడం సంగతి దేవుడెరుగు.. ముందస్తు అరెస్ట్‌లు చేసి వేధించారని బావురుమన్నారు.
 
హుద్‌హుద్‌ తుపాను దెబ్బకు ఉపాధి కోల్పోయిన గీత కార్మికులకు ఒక్కొక్కరికి పరిహారం కింద తక్షణం రూ.పదివేలు ఇస్తానని బాబుగారు హామీ ఇచ్చారట. నాలుగేళ్లు దాటినా ఒక్క పైసా ఇవ్వకపోగా.. పరిహారం కోసం ధర్నా చేసినందుకు అరెస్ట్‌చేసి జైల్లో పెట్టించారట. గతంలో మాకు ఇచ్చినట్టుగానే.. ఇప్పుడు తిత్లీ తుపాను బాధితులపై వరాల వర్షం కురిపిస్తున్నాడని వాపోయారు.. యర్ర బాబురావు తదితర గీత కార్మికులు. తుపాను చేసిన గాయం మాసిపోతున్నా.. పాలకులు చేసిన మోసం వారిని దహించి వేస్తూనే ఉంది.  

లక్ష్మీపురం వద్ద సొంగలి సుమలత, సావిత్రమ్మ, జయలక్ష్మి, పార్వతి తదితర మహిళా రైతులు కలిశారు. ఈ సర్కారు నిర్లక్ష్యంతో సాగు నీరందక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. రుణ మాఫీ కాక, గిట్టుబాటు ధరలేక వ్యవసాయం భారమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ మహిళా రైతు దినోత్సవం రోజునే.. వారి సాగు కష్టాలు వినాల్సి రావడం మనసుకు బాధనిపించింది.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. నాలుగేళ్లయినా హుద్‌హుద్‌ తుపాను బాధితులకు ఇచ్చిన హామీలు నేటికీ నెరవేర్చకపోవడం నిజం కాదా? రైతులు, మత్స్యకారులు, చేనేతలు, యాదవులు, గీతకార్మికులు తదితర తుపాను బాధిత వర్గాలకు మీరు ప్రకటించిన పరిహారం ఏమైంది? కట్టిస్తానన్న ఇళ్లు ఏమయ్యాయి? 
-వైఎస్‌ జగన్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement