289వ రోజు పాదయాత్ర డైరీ | 289th day padayatra diary | Sakshi
Sakshi News home page

289వ రోజు పాదయాత్ర డైరీ

Published Sun, Oct 21 2018 3:15 AM | Last Updated on Sun, Oct 21 2018 8:12 AM

289th day padayatra diary - Sakshi

ఇప్పటివరకు నడచిన దూరం: 3,175.5 కి.మీ.
20–10–2018, శనివారం 
పారాది, విజయనగరం జిల్లా 

ఆడపిల్లల ఆత్మగౌరవం పట్ల ఈ ప్రభుత్వ బాధ్యతారాహిత్యం క్షమార్హం కాదు
ఈ రోజంతా బొబ్బిలి పట్టణం, మండల పరిధిలో పాదయాత్ర సాగింది. ఎక్కడా ఇసుమంతైనా అభివృద్ధి కనిపించలేదు. అడుగడుగునా సమస్యల తోరణాలే.. ఈ రోజు కూడా జూట్‌మిల్లు కష్టాలు వినిపించాయి. భవానీ అనే సోదరి.. పక్షవాతంతో బాధపడుతున్న తన తల్లిని తీసుకొచ్చి కలిసింది. జూట్‌మిల్లు మూతపడటంతో అందులో కార్మికుడిగా పనిచేసిన తన భర్త దినసరి కూలీగా మారాడని చెప్పింది. కుటుంబ పోషణ భారమైందని వాపోయింది. పదో తరగతిలో పదికి పది పాయింట్లు సాధించిన తన పిల్లల్ని పైచదువులు చదివించడం కష్టంగా ఉందని కన్నీరుపెట్టుకుంది. తల్లికి వైద్యమూ భారమేనంది.  

బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌కు భూములిచ్చిన రైతన్నలు కలిశారు. భూములిచ్చిన రైతులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న నేతల మాటలు నమ్మి.. పిల్లల్ని వృత్తి విద్యాకోర్సులు చదివిస్తే ఆశ నిరాశ అయిందని వాపోయారు. ఓ వైపు భూములు త్యాగం చేసి.. మరో వైపు ఆ పరిశ్రమల కాలుష్యపు బాధలు తాము అనుభవిస్తుంటే.. వచ్చిన కొద్దో గొప్పో ఉద్యోగాలను సైతం స్థానికేతరులకే ఇచ్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  

పోలవానివలస గిరిజన కాలనీ అక్కచెల్లెమ్మలు కలిశారు. రోడ్లు లేవు.. కొళాయిల్లేవు.. కరెంటు లేదు.. మురుగు కాల్వలు లేవంటూ కష్టాలు చెప్పుకొన్నారు. గున్నతోటవలస ఎస్సీ కాలనీదీ అదే పరిస్థితట. బొబ్బిలి పట్టణానికి ఆనుకునే ఉన్నా.. మా కాలనీల కష్టాలు ఈ పాలకులకు కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  

కొండకెంగువ గ్రామస్తులు కలిసి ఆ ఊరి రహదారి కష్టాలు చెప్పుకొన్నారు. అధ్వానమైన ఆ రోడ్డుపై 108 వెళ్లాలన్నా కష్టమేనన్నారు. ఆటోలలోనే ప్రసవాలు జరిగిన ఘటనలూ ఉన్నాయన్నారు. ఆ రహదారి మరమ్మతులకు నోచుకోక ఇరవై గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారట. రోడ్డు వేయిస్తామని పదే పదే మాటిచ్చి.. మోసం చేసిన పాలక నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కడుపు మండిన ప్రజలు మంత్రిని సైతం ఊళ్లోకి రాకుండా అడ్డుకున్నారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పల్రాజుపేట రహదారిదీ ఇదే పరిస్థితి.  

పారాది ప్రభుత్వ పాఠశాల పదో తరగతి విద్యార్థినులు కలిశారు. 350 మంది చదువుకుంటున్న ఆ పాఠశాలలో పిల్లలకు ఒక్కటంటే ఒక్క మరుగుదొడ్డీ లేదంట. అత్యవసరమైనప్పుడు మరుగు కోసం వెతుక్కోలేక.. సిగ్గుతో చచ్చిపోతున్నామని ఆ చెల్లెమ్మలు చెబుతుంటే.. చాలా బాధేసింది. ఆడపిల్లల ఆత్మగౌరవం పట్ల ఈ ప్రభుత్వ బాధ్యతారాహిత్యం ఎంతమాత్రం క్షమార్హం కాదు  

ఇలా ఈ రోజంతా దారి పొడవునా.. రోడ్లు లేవని, మంచినీరు లేదని, మరుగుదొడ్లు లేవని, మౌలిక సదుపాయాలు కరువయ్యాయని.. రకరకాల సమస్యలు వెల్లువెత్తాయి. ఈ ప్రజల ఓట్లతో గెలిచిన నేతలేమో.. అభివృద్ధి సాకుతో పార్టీ ఫిరాయించి, మంత్రి పదవులు అనుభవిస్తూ ప్రజలకు ముఖంచాటేస్తున్నారు. అవినీతి నల్లడబ్బుతో వారిని కొన్న ప్రభుత్వ పెద్దలేమో.. ఈ ప్రజలతో అవసరమేమని.. నిర్లక్ష్యం చేస్తున్నారు.  
ఈ రోజు పాదయాత్ర ముగిశాక.. తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవడానికి పార్టీ వేసిన కమిటీ సభ్యులు కలిశారు. తుపాను నష్టం, ప్రభుత్వ వైఫల్యం.. సిక్కోలు ప్రజలకు చేసిన తీవ్ర గాయాన్ని వివరించారు. పార్టీ బృందాలు చేపడుతున్న సహాయక చర్యలు సంతృప్తినిచ్చాయి. మరింత ముమ్మరం చేసి అండగా నిలవాలని సూచించాను.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ప్రతి గ్రామానికీ తారు రోడ్డు, ప్రతి వీధికీ సిమెంటు రోడ్డు అంటూ.. మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏమైంది? రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రహరీలు, మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం రెండేళ్లలో కల్పిస్తామని మేనిఫెస్టోలోని 35వ పేజీలో హామీ ఇచ్చారు. నాలుగున్నరేళ్లయింది.. కనీసం గుర్తయినా ఉందా? 
-వైఎస్‌ జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement