29న బాబు రాక?
=తిరుపతి నుంచి ఎన్నికల శంఖారావం
=తెలుగు తమ్ముళ్లలో ఉత్తేజం నింపేందుకే
=వాయిదాపడ్డ శంఖారావం 29న జరిగే అవకాశం
సాక్షి, తిరుపతి: జిల్లాలో నీరసంగా ఉన్న తెలుగు తమ్ముళ్లను ఉత్తేజ పరచడానికి 29వ తేదీన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తిరుపతికి రానున్నట్లు తెలిసింది. అదే రోజున ఎన్నికల శంఖారావం ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు అక్టోబర్ 29వ తేదీన శంఖారావం పేరుతో తిరుపతిలో సభను ఏర్పాటు చేయాలనుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆ సభను నవంబర్ ఏడో తేదీన ఏర్పాటు చేస్తామని ప్రకటించి, తుపాను పేరుతో నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు నీరసించారు.
చంద్రబాబు కుమారుడు లోకేష్ వచ్చినా తమ్ముళ్లలో ఉత్తేజం కనిపించలేదు. దీంతో చంద్రబాబు నాయుడు ఎన్నికల శంఖారావాన్ని తిరుపతి నుంచి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 29వ తేదీన మున్సిపల్ హైస్కూలు గ్రౌండ్ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. దీనికిగాను జన సేకరణ ప్రారంభించాలని అధిష్టానం నుంచి సమాచారం రావడంతో, జిల్లాలోని ‘దేశం’ నాయకులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. చంద్రబాబు నాయుడు వస్తాననడం, వాయిదా పడడం రెండు సార్లు జరగడంతో, ఈ సారైనా కచ్చితంగా వస్తారా లేదా అని పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఆదివారం తిరుమలకు వచ్చిన పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడు కొంత మంది నాయకులను కలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు 29న వ చ్చే అవకాశం ఉందని తెలిపారు. దీనికి భారీ ఏర్పాట్లు చేపట్టాలని సూచించినట్లు తెలిసింది. దీంతో జన సేకరణ ఏ విధంగా చేపట్టాలనే విషయంపై జిల్లా నాయకులు తర్జన భర్జన పడుతున్నారు.
దాదాపు లక్షమందితో ఈ సభను నిర్వహించాలని, ఎన్నికల శంఖారావం కావడంతో, సభ భారీగా ఉండాలని చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. జనం తక్కువయినా, ఎక్కువగా కనిపించే చోటు మున్సిపల్ హైస్కూలు గ్రౌండ్ ఒక్కటేనని, అందుకే అక్కడే సభను నిర్వహించాలని జిల్లా నాయకులు అనుకుంటున్నారు. ఒక వేళ ఎక్కువ మందిని సమీకరించగలిగితే వేదికను మార్చే అవకాశం ఉంది.