అనంతపురం, న్యూస్‌లైన్ : మండుతున్న పొయ్యిపై పెట్రోలు క్యాన్ పడడంతో ఇంటికి నిప్పంటుకుని ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. అనంతపురం పాతూరులోని రాణినగర్‌లో బుధవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముండే బ్రహ్మయ్య, గంగమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ముత్యాలమ్మ, వెంకటలక్ష్మి, సరస్వతి. వీరిలో ఇద్దరు తమ పిల్లలతో పుట్టింట్లో ఉన్నారు. బ్రహ్మయ్య దంపతులు కూలి పనులకు వెళ్తుండగా, మిగతా కుటుంబ సభ్యులు లూజుగా పెట్రోలు విక్రయిస్తున్నారు. కట్టెల పొయ్యిపై వంట చేస్తుండగా, పిల్లలు ఆడుకుంటూ అరుగుపై ఉన్న పెట్రోలు క్యాన్‌ను కిందకు నెట్టేశారు.
అది మండుతున్న పొయ్యిపై పడడంతో క్షణాల్లో అగ్ని కీలలు ఇల్లంతా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ముత్యాలమ్మ, ఆమె కూతురు జ్యోతి (8), శ్యామ (5), 11 నెలల మగ శిశువు, వెంకటలక్ష్మి, ఆమె కుమారుడు నందకిషోర్ (1) తీవ్రంగా గాయపడగా, సరస్వతికి స్వల్ప గాయాలయ్యాయి. 11 నెలల చిన్నారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, మిగిలిన వారిని కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో జ్యోతి, శ్యామ, నందకిషోర్ మృతి చెందారు. సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ క్షతగాత్రులను పరామర్శించారు.