గతుకుల రోడ్డు.. అధిక వేగానికి ముగ్గురు విద్యార్థుల ప్రాణాలు బల య్యాయి.
అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన బైక్
హైదరాబాద్‌లో ముగ్గురు విద్యార్థుల మృతి
హైదరాబాద్, న్యూస్‌లైన్: గతుకుల రోడ్డు.. అధిక వేగానికి ముగ్గురు విద్యార్థుల ప్రాణాలు బల య్యాయి. హైదరాబాద్‌లోని జీడిమెట్లలో శుక్రవారం అర్ధరాత్రి ఒక ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు. సూరారం కాలనీకి చెందిన వినయ్(22) సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. నెల్లూరుకు చెందిన సురేందర్(21), ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వినోద్(21) దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. స్నేహితులైన ఈ ముగ్గురూ శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో కరిజ్మా బైక్‌పై నెక్లెస్ రోడ్డులోని పార్క్‌లేన్ హోటల్‌లో డిన్నర్‌కు వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో చింతల్ నుంచి సూరా రం వైపు వెళుతుండగా అర్ధరాత్రి 2.30 గంటలకు హెచ్‌ఎంటీపరిశ్రమ ముందు వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి, పక్కనే ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో వీరి తలకు, ఛాతీకి బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. జీడిమెట్ల ఎస్సై సుధాకర్ సిబ్బందితో అక్కడికి వెంటనే చేరుకోగా.. అప్పటికే ముగ్గురూ మృతి చెందినట్లు గుర్తించారు. అదే సమయంలో మృతుడు వినయ్ ఫోన్‌కు ఇంటి నుంచి కాల్ రావడంతో పోలీసులు ప్రమాద విషయం తెలియజేశారు. ప్రమాదస్థలికి చేరుకున్న వినయ్ తండ్రి దాస్ రోదించిన తీరు అక్కడున్న వారిని కదిలించింది.