సాక్షి, చిత్తూరు: జిల్లా అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పే సీఎం చంద్రబాబునాయుడు ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సొంత జిల్లాకు పైసా నిధులు విదల్చడం లేదు. పైగా ఆయన పాలనలో పంచాయతీలు విద్యుత్ బకాయిలు కూడా సకాలంలో చెల్లించలేని పరిస్థితికి దిగజారాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన దాంతోనే నెట్టుకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానిక సంస్థల అభివృద్ధి కుంటుపడుతోంది. అభివృద్ధి పనులను పక్కనపెట్టి కేంద్రం ఇస్తున్న 13వ ఆర్థిక సంఘం నిధులను తాగునీటి అవసరాలకు వెచ్చించాల్సి వస్తోంది.
జిల్లాలో 1,363 పంచాయతీలున్నాయి. వీటి అభివృద్ధికి ఫర్ క్యాపిటా గ్రాంట్‌తో పాటు ప్రొఫెషనల్ ట్యాక్స్, సీనరైజేస్ గ్రాంట్‌తో కూడిన నిధులు ఉన్నాయి. పన్నుల వసూళ్లు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. పన్నుల రూపంలో వచ్చే నిధులతో పంచాయతీల అభివృద్ధి సాధ్యమయ్యే పనికాదు. ఇందులో చాలామటుకు విద్యుత్ బిల్లులకే సరిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తే తప్ప పంచాయతీలఅభివృద్ధి సాధ్యం కాదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులను తాగునీటి అవసరాలకు, గ్రామీణ రోడ్ల మరమ్మతులు, పరిశ్రమల మెయింటినెన్స్ తదితర వాటికి వినియోగించాల్సి ఉన్నా అలా జరగడం లేదు.
పైసా ఇవ్వని బాబు ప్రభుత్వం..
2014-15 ఏడాదికి సంబంధించి స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం మొక్కుబడిగా కూడా నిధులు ఇవ్వడం లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో జిల్లా పంచాయతీలకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి కేవలం రూ.1,86,44,700 నిధులు మాత్రమే వచ్చాయి. పంచాయతీలకు ఫర్ క్యాపిటా గ్రాంట్ (తలకు నాలుగు రూపాయల వంతున) ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రూ.66,13,800, ప్రొఫెషనల్ ట్యాక్స్ రూపంలో రూ.2,91,61,000, సీనరైజేస్ గ్రాంట్ రూ.1,08,02,300 వచ్చింది.
ఈ లెక్కన మొత్తం కలిపితే రూ.4,65,77,100 మాత్రమే వచ్చింది. ఈ మొత్తం విద్యుత్ బకాయిల్లో పదో వంతుకు కూడా సరిపోలేదు. ఇక జిల్లా పరిషత్‌కు సంబంధించి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కేవలం రూ.55 లక్షలు మాత్రమే మంజూరు చేసింది. ఈ నిధులు అధికారుల వాహనాల డీజిల్ ఖర్చులకు కూడా సరిపోని పరిస్థితి.
కేంద్రం నిధులే దిక్కు..
జిల్లాకు 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం 13వ ఆర్థిక సంఘం నిధులతో పాటు బీఆర్‌జీఎఫ్ కింద మొత్తం రూ.233,61,64,900 నిధులను విడుదల చేసింది. ఇందులో పంచాయతీలకు రూ.198 కోట్లు, జిల్లా పరిషత్‌కు రూ.40 కోట్లు, మండల పరిషత్‌కు రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఇక బీఆర్‌జీఎఫ్ కింద జిల్లా పరిషత్‌కు రూ.36 కోట్లు విడుదల చేసింది. ఈ లెక్కన ఇప్పటికే కేంద్రం జిల్లాకు రూ.233,61,64,900 నిధులను కేటాయించింది.
ఈ నిధులతోనే బాబు ప్రభుత్వం నాటకమాడుతోంది. సొంత జిల్లాలో దాదాపు 3వేల గ్రామాల్లో తాగునీటి సమస్య ఉన్నా పైసా విదల్చని ప్రభుత్వం కేంద్రం నిధులనే వాడుకుంటుండడం తెలిసిందే. చిన్నచిన్న అభివృద్ధి కార్యక్రమాలకు సైతం కేంద్రం నిధులనే వెచ్చిస్తున్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులతోనే గ్రామపంచాయతీల పరిధిలో పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.130 కోట్లు విద్యుత్ బకాయిలను చెల్లించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. గ్రామాల్లో రోడ్లు, మరుగుదొడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు తదితర అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగే పరిస్థితి లేదు. జిల్లాకు వచ్చిన ప్రతిసారీ ముఖ్యమంత్రి మాటలతో సరిపెడుతున్నారు.
సొమ్ము కేంద్రానిది.. సోకు బాబుది
Published Wed, Apr 22 2015 3:02 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM
Advertisement
Advertisement