
300 కిలోల గంజాయి స్వాధీనం
విశాఖపట్నంలో భారీ మొత్తంలో గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్లో దాదాపు 300 కిలోల గంజాయిని వారు గుర్తించారు. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన అరకు, పాడేరు మండలాల నుంచి మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు ఈ గంజాయిని తరలిస్తుండగా రైల్వే పోలీసులకు ముందస్తు సమాచారం అందడంతో దాడి చేశారు. 20 బస్తాలలో పట్టుబడిన ఈ గంజాయి విలువ దాదాపు 20 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు.
ఈ సంఘటనలో ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని వారు అరెస్టు చేశారు. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడటం ఇదే మొదటిసారి. ఈ ప్రాంతంలో గంజాయి సాగు చేస్తున్నట్లు ఎప్పటినుంచో చెబుతున్నా, ఈ స్థాయిలో మాత్రం ఎప్పుడూ పట్టుకోలేదు. అయితే, దీని వ్యాపారులు తమకు ఈ గంజాయి ఇచ్చి, ఔరంగాబాద్లో అమ్మి డబ్బు తీసుకురమ్మని చెప్పారని, అంత చేసినందుకు తమకు 15వేల రూపాయలు మాత్రమే వస్తాయని నిందితులు చెప్పారు.