సాక్షి, అనంతపురం : పేద విద్యార్థులకు పెద్ద చదువులు దూరం కాకూడదన్న మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయానికి ప్రస్తుతపాలకులు తూట్లు పొడుస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అమలులో వ్యత్యాసాల కారణంగా ఎందరో విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరేందుకు సిద్ధపడడం లేదు. ఫలితంగా ఆయా కళాశాలల్లో సీట్లు భర్తీ కావడం లేదు. నిర్వహణ భారం మోయలేక కళాశాలలను మూసివేయడమే ఉత్తమమని యాజమాన్యాలు భావిస్తున్నాయి. జిల్లాలోని 18 ఇంజనీరింగ్ కళాశాలల్లో 7,500 సీట్లు ఉన్నాయి. ఇందులో 70 శాతం కన్వీనర్ కోటా, 30 శాతం యాజమాన్య కోటా సీట్లు ఉన్నాయి. మొదటి, రెండో విడత కౌన్సెలింగ్ అనంతరం దాదాపు మూడు వేల సీట్లు మిగిలిపోయాయి.
కన్వీనర్ కోటా సీట్లే మిగిలిపోవడంతో యాజమాన్య కోటా సీట్లు అడిగేవారే కరువయ్యారు. సమైక్యాంధ్ర సమ్మె ప్రభావం, బ్యాంకుల సెలవు దినాల నేపథ్యంలో మొదటి విడత కౌన్సెలింగ్ (సర్టిఫికెట్ల పరిశీలన) ఆలస్యంగా జరిగింది. మే 10న ఎంసెట్ నిర్వహించగా.. జూలై 25 నుంచి ఆగస్టు 5 వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆగస్టు 19 నుంచి బ్రాంచ్‌ల ఎంపిక కోసం వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. ఉద్యమం కారణంగా సీట్ల కేటాయింపు ఆలస్యమైంది. సెప్టెంబర్ 17న సీట్లు కేటాయించారు. సీట్ల భర్తీ ఆలస్యం కావడంతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై ప్రభుత్వం నుంచి సరైన స్పష్టత రాలేదు. అసలు నిధులు విడుదల చేస్తారో.. లేదోనన్న అనుమానం విద్యార్థులకు కలిగింది. దీంతో అనేక మంది ప్రత్యామ్నాయ కోర్సుల్లో చేరిపోయారు. ఈ ఏడాది బీఎస్సీ, బీకాం కంప్యూటర్స్ కోర్సుల్లో చేరిన విద్యార్థుల సంఖ్య 15 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం.
జిల్లాలో జేఎన్‌టీయూ, ఎస్కేయూ కళాశాలల్లో మాత్రమే మొదటి విడత కౌన్సెలింగ్‌లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఆ తర్వాత ఎస్‌ఆర్‌ఐటీ, ఇంటెల్(అనంతపురం), గేట్స్ (గుత్తి) ఇంజనీరింగ్ కళాశాలల్లో 95 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల(అనంతపురం), తాడిపత్రిలోని రెండు ఇంజనీరింగ్ కళాశాలల్లో 60 శాతం చొప్పున, జిల్లా కేంద్రంలోని ఎస్వీఐటీలో 55 శాతం, షిరిడిసాయి, మౌలాలి, సీఆర్‌ఐటీలోని రెండు కళాశాలల్లో 20 శాతం చొప్పున, హిందూపురం బిట్స్‌లో 30 శాతం సీట్లు భర్తీ అయినట్లు తెలిసింది. ఇక అనంతపురం నగర శివారులోని లోలూరు వద్దనున్న శ్రీసాయి కళాశాలలో ఒక్క సీటు కూడా భర్తీ కాలేదని జేఎన్‌టీయూ వర్గాల ద్వారా సమాచారం. ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తున్నందునే ప్రతి యేటా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరుతున్నారనేది వాస్తవం. అయితే.. ప్రస్తుత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంటుపై స్పష్టమైన విధానాన్ని అమలు చేయడం లేదు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి.. ఎంసెట్‌లో పది వేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులకుమొత్తం ఫీజు చెల్లిస్తామని, ఆ పైన వచ్చిన వారికి రూ.35 వేలు మాత్రమే ఇస్తామని నిబంధన పెట్టింది. కాగా.. జిల్లాలో ఉన్న 18 కళాశాలలకూ ఒక్కో విద్యార్థిపై రూ.35 వేల చొప్పున మాత్రమే ఫీజు వర్తిస్తోంది. మిగిలిన మొత్తాన్ని విద్యార్థులే చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఇంజనీరింగ్‌లో చేరడానికి విద్యార్థులు వెనుకడుగు వేస్తున్నారు. ఎంసెట్‌తో పాటు ఐఐటీ, ఐఈఈఈలోనూ మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు వివిధ రాష్ట్రాల్లోని ఐఐటీలు, ఇతర పేరెన్నికగన్న సాంకేతిక విద్యాసంస్థల్లో చేరిపోయారు.
రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించినా రాష్ట్రంలో కాస్తో.. కూస్తో పేరున్న కళాశాల్లోనే చేరారు. మిగిలిన వాటిలో చేరేందుకు ఏ విద్యార్థీ ఇష్టపడలేదు. బోధనా సదుపాయాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ప్రయోగశాలలు లేకున్నా.. ఫీజు రీయింబర్స్‌మెంటుతో ఇంత కాలం నెట్టుకొచ్చిన కళాశాలలకు ప్రస్తుతం గడ్డుకాలం ఎదురైంది. ఖర్చులు పెరిగిన దృష్ట్యా ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై ఇచ్చే రూ.35 వేలు ఏమాత్రమూ సరిపోకపోవడంతో పాటు అడ్మిషన్లు కూడా తగ్గిపోవడంతో యాజమాన్యాలు లబోదిబోమంటున్నాయి.
ఇంజనీరింగ్ కళాశాలల్లో మిగిలిపోయిన మూడు వేల సీట్లు
Published Mon, Oct 28 2013 3:05 AM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM
Advertisement
Advertisement