315వ రోజు పాదయాత్ర డైరీ | 315th day padayatra diary | Sakshi
Sakshi News home page

315వ రోజు పాదయాత్ర డైరీ

Published Sat, Dec 8 2018 2:22 AM | Last Updated on Sat, Dec 8 2018 8:07 AM

315th day padayatra diary - Sakshi

ఇప్పటి వరకు నడిచిన దూరం 3,408 కిలోమీటర్లు
07–12–2018, శుక్రవారం. 
ఫరీద్‌పేట, శ్రీకాకుళం జిల్లా.  

శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ భవనానికి ఒక్క ఇటుకైనా వేశావా బాబూ? 
ఈ రోజు ఎచ్చెర్ల మండలంలో పాదయాత్ర సాగింది. ఉదయం కేశవరెడ్డి స్కూలు వద్ద కలిసిన బాధితులు తమగోడు వినిపించారు. ఎస్‌ఎం.పురానికి చెందిన 80 ఏళ్ల భారతమ్మ అనే అవ్వకు భర్త చనిపోయాడు. ఆమె భర్త ప్రభుత్వోద్యోగి కావడంతో ఆమెకు పింఛన్‌ వస్తోంది. ఆమె కుమారుడు ఏ పనీ చేయలేని దివ్యాంగుడు. అటు కొడుక్కి, ఇటు మనవడికి ఆ అవ్వే దిక్కు. మనవడి చదువుకోసం మూడున్నర లక్షల రూపాయలు అప్పుచేసి కేశవరెడ్డి స్కూల్లో చేర్పించింది. బిడ్డ చదువు అయిపోగానే డిపాజిట్‌ సొమ్మంతా వస్తుందని చెప్పిన మేనేజ్‌మెంట్‌.. బోర్డు తిప్పేసింది. తెచ్చిన అప్పునకు వడ్డీలు కట్టలేక, ఇంటిని నడపలేక వృద్ధాప్యంలో తల్లడిల్లిపోతోంది. మరో కన్నీటి కథ అరుణమ్మది. తనకున్న చిన్నపాటి ఇంటిని తాకట్టు పెట్టి మరీ కొడుకును కేశవరెడ్డి స్కూల్లో చేర్పించింది. ఆ బిడ్డ పదో తరగతి పూర్తిచేసినా డిపాజిట్‌ సొమ్ము వెనక్కి రాలేదు. ఇంటిని విడిపించుకోలేక.. కొడుకును పైచదువులు చదివించుకోలేక నానా అవస్థలు పడుతోంది. ఎంతోమంది కడుపు కోత ఇది! కేశవరెడ్డి వల్ల అయినా, అగ్రిగోల్డ్‌ వల్ల అయినా లక్షల కుటుంబాలు యాతనపడుతున్నాయి. వారికి బాసటగా నిలిచి ఊరటనివ్వాల్సిన ప్రభుత్వం.. నిందితులకు కొమ్ముకాయడం, ప్రజల కష్టార్జితంపై కన్నేయడం అత్యంత దుర్మార్గం.  

శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణం పక్కనుంచే పాదయాత్ర సాగింది. కొద్దిమంది విద్యార్థులొచ్చి కలిశారు. బాబుగారు మూడేళ్ల కిందట శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీని ఆర్భాటంగా ప్రకటించి.. ఒక్క ఇటుక కూడా వేయకపోవడంతో ఇప్పటి దాకా> నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లోనే నడిపించారట. కాగా, ఎన్నికలొస్తున్నాయని హడావుడిగా 500 మంది రెండో సంవత్సరం విద్యార్థినులను ఇక్కడికి తరలించి.. ఇదివరకే నాన్నగారు కట్టిన ట్వంటీఫస్ట్‌ గురుకులం భవనాల్లో పెట్టారట. మరో 500 మంది విద్యార్థులను.. మూతబడ్డ ఓ ప్రయివేటు ఇంజనీరింగ్‌ కాలేజీలో ఉంచారట. వసతుల్లేవని, సౌకర్యాలుండటం లేదని విద్యార్థులంతా ఆందోళన చేసినా పట్టించుకోవడం లేదన్నారు. మొదటి, మూడో సంవత్సరం విద్యార్థులింకా నూజివీడు ట్రిపుల్‌ ఐటీలోనే ఉన్నారట. కేవలం మేమూ ఓ ట్రిపుల్‌ ఐటీ పెట్టామని అనిపించుకోవడానికి శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీని ప్రకటించడం.. దానికోసం శ్రీకాకుళంలో ఒక్క ఇటుక కూడా వేయకుండా.. ఈ సంస్థను కూడా నూజివీడు ట్రిపుల్‌ ఐటీలోనే నిర్వహించడం.. వసతులు సరిపోక రెండు ట్రిపుల్‌ ఐటీల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులుపడటం.. తీరా ఎన్నికలొస్తున్నాయని హడావుడిగా కొద్దిమందిని శ్రీకాకుళానికి తరలించడం.. పిచ్చి చేష్టలుకాక మరేంటి? 

అనమిత్ర వద్ద రాజీవ్‌స్వగృహ లబ్ధిదారులు కలిశారు. నాన్నగారు మధ్య తరగతివారి సొంతింటి కలను నిజం చేయాలనుకున్నారు. ఆయన మరణమే వారికి శాపమైంది. ఏళ్లు గడిచినా ఇళ్లు పూర్తికాలేదు. ఓ వైపు.. పెరిగిపోతున్న అప్పుల భారం, మరోవైపు.. అద్దె ఇంటి భారం. సర్కారు నిర్లక్ష్యాన్ని ప్రశ్నించినా ఫలితంలేక కోర్టును ఆశ్రయిస్తే చివరికి ఇళ్లు అప్పగించారట. ఆ ఇళ్లలో అన్నీ అరకొర పనులే జరిగాయని, ఎలాంటి మౌలిక వసతులూ లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. త్రిశంకు స్వర్గంలా ఉంది వారి పరిస్థితి. ఈ కష్టాలు చాలవన్నట్టు.. వారి ఇళ్లను ఆనుకునే ఇష్టారాజ్యంగా మట్టిని తవ్వుకుపోతున్నారట పచ్చ నాయకులు. తమ ఇళ్ల మనుగడకే ప్రమాదమని భోరుమన్నారు బాధితులు. ప్రభుత్వాలు మారొచ్చు, పాలకులూ మారొచ్చు.. కానీ పథకాలను నిర్లక్ష్యం చేసి.. ప్రజలను ఇక్కట్ల పాల్జేయడం ఎంతమాత్రం సమంజసం కాదు.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. గ్రామీణ పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యున్నత విద్యనందించడమే ట్రిపుల్‌ ఐటీల లక్ష్యం. కాగా.. భవనాలే నిర్మించకుండా, వసతులు కల్పించకుండా, సరైన సిబ్బందిని నియమించకుండా, విద్యాప్రమాణాలే పాటించకుండా.. కేవలం ప్రచారం కోసం ట్రిపుట్‌ ఐటీలను ప్రారంభించడం.. పేద విద్యార్థుల భవిష్యత్తును çపణంగా పెట్టడం కాదా?  
- వైఎస్‌ జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement