332వ రోజు పాదయాత్ర డైరీ | 332th day padayatra diary | Sakshi
Sakshi News home page

332వ రోజు పాదయాత్ర డైరీ

Published Sun, Dec 30 2018 3:24 AM | Last Updated on Sun, Dec 30 2018 8:16 AM

332th day padayatra diary - Sakshi

ఇప్పటివరకు నడిచిన దూరం:  3,550.3  కిలోమీటర్లు
332వ రోజు నడిచిన దూరం:11.3 కిలోమీటర్లు
29–12–2018, శనివారం 
ఉండ్రకుడియా జంక్షన్, శ్రీకాకుళం జిల్లా

అబద్ధాలు, మోసాలతో ప్రజలను ఇంకెన్నాళ్లు మభ్యపెడతారు బాబూ? 
ఈ రోజు పెదమడి, చీపురుపల్లి, రేగులపాడు, టెక్కలిపట్నం గ్రామాల మీదుగా నా పాదయాత్ర సాగింది. రోడ్డుకిరువైపులా నేల కూలిన చెట్లు కనిపించాయి. తిత్లీ బీభత్సాన్ని అవి చెప్పకనే చెబుతున్నాయి. ఉదయం ఆదివాసీ సంఘాల ప్రతినిధులు కలిశారు. ఈ ప్రభుత్వం వచ్చాక గిరిజన సహకార సంస్థ నిర్వీర్యమైందని, ఐటీడీఏ నిరుపయోగంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీడీఏ పరిధిలోని ఉద్యోగాల్లో సైతం గిరిజనులకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. రేగులపాడు ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు నిర్వాసితులు గ్రామగ్రామానా ఆవేదన చెప్పుకున్నారు. పునరావాస, పరిహార చర్యల్లో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తూర్పారబట్టారు. తమకు పరిహారమే ఇవ్వడం లేదని కొందరు.. అర్హులకు ఇవ్వకపోగా, అనర్హులకు దోచిపెడుతున్నారని మరికొందరు.. ఇచ్చేదాంట్లోనూ వివక్షేనని ఇంకొందరు.. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో ఆందోళన. సమస్యలేవీ పరిష్కరించని ప్రభుత్వం.. తమను పునరావాస ప్రాంతాలకు వెళ్లాలని ఒత్తిడి తెస్తోందన్నారు. మౌలిక వసతుల్లేని, నివాసయోగ్యంకాని చోట మేమెలా ఇళ్లు కట్టుకోగలమని దీనంగా ప్రశ్నించారు. అందరిలోనూ తీవ్ర ఆవేదన కనిపించింది. నాన్నగారి హయాంలో ఎన్నో ప్రాజెక్టులు చేపట్టారు. అప్పుడులేని అభద్రత, ఆందోళన నేడు మాత్రమే కనిపించడానికి కారణం.. నేటి పాలకులకు ప్రాజెక్టులు కట్టడంపై కన్నా.. వాటిమీద వచ్చే కమీషన్ల పైనే మక్కువ ఎక్కువగా ఉండటం.. నిర్వాసితులకు న్యాయం చేయాలన్న మానవీయ కోణం మచ్చుకైనా లేకపోవడం.  

మధ్యాహ్నం పాతపట్నం నియోజకవర్గం పూర్తిచేసి పలాస నియోజకవర్గంలో అడుగుపెట్టాను. రేగులపాడు ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు మీదుగా పాదయాత్ర సాగించాను. నాన్నగారు 2008లో దానికి శంకుస్థాపన చేసిన శిలాఫలకం కనిపించింది. ప్రాజెక్టు పనులు ప్రారంభించిన కొద్దికాలానికే ఆయన మనల్ని విడిచి వెళ్లిపోయారు. అప్పటి దాకా శరవేగంగా సాగిన పనులన్నీ ఒక్కసారిగా నత్తనడకపట్టడం చాలా బాధనిపించింది. పదేళ్లయినా ఏ కొంచెం ముందుకెళ్లని స్థితని స్థానికులు మనోవ్యథతో చెప్పారు. ఈ ప్రభుత్వం చేస్తున్న డ్రామాలను వివరించారు. ప్రాజెక్టు కోసం ఇక్కడి టీడీపీ ఎమ్మెల్యే ఆందోళనలు చేసినట్టు నటించడం.. అంతలోనే నిధులిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించడం.. దీంతో ఎమ్మెల్యే, టీడీపీ నేతలు బాబుగారికి కృతజ్ఞతలు చెబుతూ సంబరాలు చేసుకోవడం.. అంతా ఓ ప్రహసనంగా సాగుతోందని చెప్పారు. పనులు జరిగిందీ లేదు.. ప్రాజెక్టు ముందుకెళ్లిందీ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అబద్ధాలు.. మోసాలు.. నయవంచనతో ఇంకెన్నాళ్లు ప్రజలను మభ్యపెడతారు? సాయంత్రం కళింగవైశ్య సోదరులతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఈ నాలుగున్నరేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.63,657 కోట్లు ఖర్చుచేశామని చెబుతున్నారు. అంచనాలు పెంచి నిధులు మింగేయడం తప్ప.. మీకు మీరుగా ప్రారంభించి పూర్తిచేసిన ప్రాజెక్టు ఒక్కటంటే ఒక్కటైనా ఉందా?  
- వైఎస్‌ జగన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement