విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయంలో 4 కేజీల బంగారు ఆభరణాలతో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. దుబాయ్ నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖకు శనివారం రాత్రి వచ్చిన వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో ఆరా తీయగా గుట్టురట్టయింది. సదురు వ్యక్తిని శంషాబద్ విమానాశ్రయంలో నిఘావర్గాలు ముందుగానే అనుమానించినా అప్పటికే విమానం కదిలిపోవడంతో అక్కడి అధికారులు విశాఖ అధికారులను అప్రమత్తం చేశారు.
దీంతో విశాఖ విమానాశ్రయంలో అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా బాత్‌రూంలో రూ. 1.2 కోట్లు విలువచేసే 4 కేజీల బంగారం బయటపడింది. అనంతరం అధికారులు నిందితుడిని హైదరాబాద్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డెరైక్టరేట్ (డీఆర్‌ఐ)కు అప్పగించినట్లు సమాచారం.